ఉత్తర తెలంగాణలో ఉత్తిదే | tdp failure in north telangana | Sakshi
Sakshi News home page

ఉత్తర తెలంగాణలో ఉత్తిదే

Published Sat, May 17 2014 1:13 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM

ఉత్తర తెలంగాణలో ఉత్తిదే - Sakshi

 ఐదు జిల్లాల్లో కానరాని టీడీపీ ...  72చోట్ల పోటీ.. 15సీట్లతో సరి
 
* పనిచేయని బీసీ సీఎం నినాదం
* నల్లగొండలో జీరో..ఖమ్మంలో గెలిచింది ఒక్కటే
* తెలంగాణ వ్యతిరేక పార్టీగా తిరస్కరించిన జనం
* టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణకు మూడో స్థానం
* ఓడిన తుమ్మల, మోత్కుపల్లి, రేవూరి, రావుల తదితరులు

 
 సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని తెలంగాణ ప్రజానీకం తిరస్కరించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చివరి వరకు అడ్డుకున్నారన్న కోపంతో  చంద్రబాబునాయుడు పార్టీని ఇక్కడి ఓటర్లు ఓడించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది తామేనని టీడీపీ అభ్యర్థులు చెప్పుకున్నా, వారి మాటలను ఓటర్లు నమ్మలేదు. బీజేపీ పొత్తుతో తెలంగాణలోని 72 సీట్లలో పోటీచే సిన టీడీపీ కేవలం 15 సీట్లలోనే గెలుపొందింది. 9 లోక్‌సభ సీట్లకు పోటీ చేసిన ఆ పార్టీ కేవలం మల్కాజిగిరిలోనే పోటీ ఇవ్వగలిగింది. గత లోక్‌సభలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్య వహించిన రమేష్ రాథోడ్ (ఆదిలాబాద్), నామా నాగేశ్వర్‌రావు (ఖమ్మం)పరాజయం పాలయ్యారు. రమేష్ రాథోడ్ మూడో స్థానంలో నిలవగా, నామా వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి గట్టిపోటీ ఇచ్చినా, చివరికి ఓడిపోయారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సీమాంధ్ర సెటిలర్ల ఓట్లు, మోడీ ప్రభావంతో 10అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ మిగతా జిల్లాలన్నీ కలిపి ఐదు సీట్లకే పరిమితమైంది.
 
 తెలంగాణలోని సగం జిల్లాల్లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో రెండేసి సీట్ల చొప్పున గెలుచుకున్న టీడీపీ.. ఖమ్మంలో సత్తుపల్లిలో మాత్రమే విజయం సాధించింది. అయితే ఈ  ఐదు సీట్లు కూడా అభ్యర్థుల వ్యక్తిగత బలంతోనే విజయం సాధించడం గమనార్హం. గత శాసనసభలో టీడీపీ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి), సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి), మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం), రేవంత్‌రెడ్డి (కొడంగ ల్), ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్) తెలంగాణ వాదాన్ని తట్టుకొని సొంతబలంతో మళ్లీ విజయం సాధించగలిగారు. నారాయణపేటలో ఓట్ల చీలిక టీడీపీకి అనుకూలించి విజయాన్ని అందించగా, పరకాలలో ఉప ఎన్నికల్లో ఓడిపోయిన ధర్మారెడ్డి సానుభూతితో ఈసారి విజయాన్ని అందుకున్నారు.

గత ఎన్నికల్లో నల్లగొండ జిల్లా తుంగతుర్తి నుంచి విజయం సాధించి ఈసారి ఖమ్మం జిల్లా మధిరకు వలస పోయిన టీటీడీపీ ఎన్నికల కమిటీ కన్వీనర్ మోత్కుపల్లి నర్సింహులుకు అక్కడ నిరాశే ఎదురైంది. ఆయన కాంగ్రెస్ చేతిలో ఓడిపోయారు. టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ జగిత్యాలలో మూడోస్థానానికి పరిమిత మయ్యారు. టీడీపీ సీనియర్లు, గత శాసనసభలో ప్రాతినిధ్యం వహించిన  తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం), రేవూరి ప్రకాశ్‌రెడ్డి (నర్సంపేట), రావుల చంద్రశేఖర్ రెడ్డి (వనపర్తి), కొత్తకోట దయాకర్ రెడ్డి (మక్తల్), సీతాదయాకర్ రెడ్డి (దేవరకద్ర), సీతక్క (ములుగు), విజయ రమణారావు ( పెద్దపల్లి), ఉమా మాధవరెడ్డి (భువనగిరి) తదితరులు ఓటమి పాలయ్యారు.
 
 ఉత్తర తెలంగాణలో రెండే సీట్లు
 ఉత్తర తెలంగాణ ప్రాంతమైన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్ జిల్లాల్లోని 50కి పైగా ఉన్న సీట్లలో టీడీపీ గెలిచిన సీట్లు రెండు మాత్రమే. వరంగల్ జిల్లాలోని పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాలలో ధర్మారెడ్డి తమకున్న వ్యక్తిగత బలంతోనే విజయం సాధించగలిగారు. వారు కూడా నెగ్గకుంటే ఉత్తర తెలంగాణలో ఆపార్టీ ప్రాతి నిధ్యమే సున్నా అయ్యేది. అలాగే జిల్లా పరిషత్, మునిసిపల్ ఎన్నికల్లో అంతో ఇంతో ప్రభావం చూపిన నల్లగొండ జిల్లాలో టీడీపీకి చోటు లభించలేదు. ఇక సీమాంధ్ర ప్రభావం ఉంటుందని టీడీపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీకి కళ్లు బైర్లు గొలిపేలా తీర్పునిచ్చింది. ఇక్కడి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, సిట్టింగ్ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావులిద్దరు పట్టుపట్టి సీట్లిప్పించుకున్న అభ్యర్థులను జనం ఓడగొట్టారు. ఒక్క సత్తుపల్లిలో మాత్రమే సండ్ర వెంకటవీరయ్య తన పలుకుబడితో విజయం సాధించారు.

 సీమాంధ్రుల ఓట్లతోనే గ్రేటర్‌లో పది సీట్లు
 సీమాంధ్రలో అధికారం కోసం చంద్రబాబు చేసిన ప్రచారంతో ఆ ప్రాంత ప్రజలు అధికంగా ఉన్న హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో 10సీట్లను టీడీపీ గెలుచుకుంది. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీగానే టీడీపీని భావించిన సెటిలర్లు రంగారెడ్డి జిల్లాలోని అర్బన్ నియోజకవర్గాల్లోని ఏడింటిని గెలిపించారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను ఎల్‌బీనగర్ నుంచి పోటీ చేయించి గెలిపించడం కూడా అందులో భాగమేనని చెపుతున్నారు. రంగారెడ్డి జిల్లా గ్రామప్రాంతాల్లో వికారాబాద్, మేడ్చల్, తాండూరు, చేవెళ్ల, పరిగి వంటి తెలంగాణ ప్రజల ప్రాబల్యం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ ఓడిపోయింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement