సాక్షి, మంచిర్యాల : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీల అగ్రనేతలతోపాటు పలువురు ప్రముఖుల ప్రచారంపై సొంత పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. ఆయా ప్రచార ఏర్పాట్లు చూసుకునే సమయాన్ని ఓటర్ల దగ్గరికి చేరువయ్యేందుకు ఉపయోగించినా మరిం త బాగుండేదని సణుగుతున్నారు. స్థూలంగా నాయకుల ప్రచారంతో తమకు లాభం లేకుండాపోయిందని వాపోతున్నారు.
ఈ ఆవేదన ముఖ్యంగా టీడీపీ నాయకుల్లో బలంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీల ప్రముఖ నాయకులంతా జిల్లాను చుట్టివచ్చారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రెండు ధపాలుగా జిల్లాలో పర్యటించారు. గులాబీ బాస్ పర్యటనకు తప్ప మిగతా నాయకులెవ్వరి ప్రచారానికి పెద్దగా ఫలితం దక్కలేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఒక్కరోజులోనే జిల్లాలో పర్యటించారు. బీజేపీతో పొత్తు ఉన్నా కేవలం టీడీపీ అభ్యర్థులు పోటీచేసిన స్థానాల్లోనే బాబు ప్రచారం నిర్వహించారు.
కాని ఏ ఒక్కస్థానంలోనూ పార్టీ అభ్యర్థులు గెలువలేదు. సాక్షాత్తు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సిట్టింగ్ ఎంపీ రాథోడ్ రమేశ్ మూడో స్థానంలో నిలవడం ప్రచారం ఫలితానికి నిదర్శన మని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. తూతుమంత్రపు ప్రచారం చేస్తే ఫలితాలు ఇలా కాకుండా ఇంకెలా ఉంటాయని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ శ్రేణుల ఆవేదన ఇందుకు మరింత భిన్నంగా ఉంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డితోపాటు సినీ నటుడు రాజశేఖర్‌తో సైతం ఆ పార్టీ ప్రచారం చేయించింది. అయినా చేదు ఫలితమే దక్కింది. కిషన్‌రెడ్డి పర్యటించిన సమయంలోనూ కేవలం బీజేపీ నేతలు బరిలో ఉన్న స్థానాల్లోనే ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సైతం ఇందుకు భిన్నమైన రీతిలో ఏమీలేదు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను అన్నీ తానై చూసిన కేంద్రమంత్రి జైరాం రమేశ్ జిల్లాలో పలు దఫాలుగా పర ్యటించి పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు.
పలుచోట్ల బహిరంగ సభల్లో ప్రసంగించి, కొన్నిచోట్ల పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. అయినా ఒక్క ముథోల్‌లో తప్ప ఏ ఒక్క స్థానంలోనూ ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేదు. ఆసిఫాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభకు రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేతలు పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. కాని ఆ నియోజకవర్గ అభ్యర్థి విజయానికి సదరు నేతల ప్రచారం అండగా నిలవలేకపోయింది. ఇదిలా ఉండగా..నిర్మల్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి మహేశ్వరరెడ్డి సీరియల్ నటుడు టార్జాన్‌తో ప్రచారం చేయించినా ఫలితం లేకపోయింది.
కేసీఆర్ జోష్..
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన బహిరంగ సభల ద్వారా పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. జిల్లాలో మొదటి విడత ప్రచారం చేసినపుడు తొమ్మిది బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. రెండో దఫా వచ్చినపుడు మందమర్రి సభలో మాట్లాడారు. కేసీఆర్ ప్రచార పర్వంతో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలన్న ఆలోచన జనాల్లో కలిగించేందుకు బలమైన కారణాలను ప్రస్తావించిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నారు. ఆయన ప్రచారమే ఆ పార్టీ అభ్యర్థులు అధిక మెజార్టీ సాధించేందుకు తోడ్పడిందని వ్యాఖ్యానిస్తున్నారు.
బీఎస్పీ అభ్యర్థులే భేష్!!
బడానేతల ప్రచార సహకారం లేకుండా ఒంటిచేత్తో విజయదుందుభి మోగించిన బీఎస్పీ అభ్యర్థులు ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్పలే భేష్ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తమ సొంత చరిష్మా ఆధారంగానే వారు విజయతీరాలు చేరుకున్నారని పేర్కొంటున్నారు.
ప్రచారం సరే.. ఫలితం ఏది?
Published Sun, May 18 2014 1:19 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement