ఆల్ రికార్డ్స్ హరీష్ సొంతం
పార్టీలో గానీ ఇతరత్రా ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరిస్తూ ట్రబుల్ షూటర్‌గా పేరొందాడు సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు. సిద్దిపేట నియోజకవర్గంలోని పరిస్థితులను దశాబ్ద కాలంగా తనకు అనుకూలంగా మలుచుకుని ప్రత్యర్థుల డిపాజిట్లను గల్లంతు చేస్తున్నారు. అదీగాక మెజార్టీని పెంచుకుంటూ రికార్డులు బద్దలు కొడుతున్నారు. గత ఉప ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మెజార్టీని సాధించిన హరీష్‌రావు ఈ సార్వత్రిక ఎన్నికల్లో స్పల్ప తేడాతో తెలంగాణ ప్రాంతంలో ఆధిక్యం సాధించడంలో ఈయన ద్వితీయ స్థానంలో నిలిచారు. - న్యూస్‌లైన్, సిద్దిపేట జోన్
టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు రాజకీయపరంగా ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా వాటికి చక్కదిద్దడానికి పార్టీ అధినేత కేసీఆర్ ట్రబుల్ షూటర్‌గా హరీష్‌రావునే పురమాయిస్తారు. గతంలో సిరిసిల్ల, స్టేషన్‌ఘనపూర్, పరకాల, సిర్పూర్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను అధిష్టానం హరీష్‌రావుపైనే మోపింది. మరోవైపు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గ బాధ్యతలతోపాటు ప్రతికూల పరిస్థితులు నెలకొన్న దుబ్బాక, మెదక్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో ఆయన స్థానిక అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు.
సిద్దిపేట నియోజకవర్గంలో 2004 ఉప ఎన్నిక ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన హరీష్‌రావుకు ఐదుసార్లు సిద్దిపేట ఓటర్లు సానుకూల తీర్పునిచ్చారు. ప్రత్యర్థి పార్టీల్లోని నాయకత్వ లోపాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటూనే ప్రతి ఎన్నికల్లో మెజార్టీని పెంచుకుంటున్నారు. ప్రత్యర్థుల డిపాజిట్లను కొల్లగొట్టే విధంగా రాజకీయ చతురత తో ఎన్నికల బరిలో దూసుకుపోతున్నారు.
2004లో జరిగిన ఉప ఎన్నికలో సమీప ప్రత్యర్థిపై 24.827 ఓట్ల మెజార్టీని సాధించారు. 2008 ఉప ఎన్నికలో 58,935 మెజార్టీ తెచ్చుకొని బరిలో ఉన్న వారందరి డిపాజిట్లు జప్తు చేశారు. 2009 జమిలీ ఎన్నికల్లో 64,014 మెజార్టీతోపాటు పోటీలో ఉన్న 13 మంది డిపాజిట్లు గల్లంతయ్యేలా దూసుకుపోయారు. ఈ క్రమంలో 2010లో జరిగిన ఉప ఎన్నికలో 95,858 భారీ మెజార్టీని సాధించి రాష్ట్ర స్థాయిలోనే రికార్డ్ నమోదు చేయడంతోపాటు ఇక్కడ పోటీ చేసిన పదిమంది డిపాజిట్లను జప్తు చేశారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 93,328 ఓట్ల మెజార్టీని సాధించి తెలంగాణలోనే రెండో స్థానంలో నిలిచి పదిమంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేశారు.