సిద్దిపేట జిల్లా ఏర్పాటు తథ్యం!
సిద్దిపేట టౌన్, న్యూస్‌లైన్: సిద్దిపేట ప్రాంత వాసుల దశాబ్దాల ఆకాంక్ష త్వరలో నెరవేరనుంది. ప్రత్యేక జిల్లా ఆవిర్భావానికి మార్గం సుగమం కానుంది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మెజార్టీ అసెంబ్లీ స్థానాలు గెలుపొంది అధికారం చేపట్టనుండడంతో కొత్త జిల్లా ఏర్పాటుపై ఈ ప్రాంత వాసుల్లో ఆశలు చిగురించాయి.
మెదక్ జిల్లాలో సిద్దిపేట అతి పెద్ద పట్టణం. ఇది జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి145 కిలో మీటర్ల దూరంలో ఉండడంతో ఈ ప్రాం తంలోని నిరుద్యోగులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు, కార్మికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
ఈ ప్రాంత వాసులు జిల్లా కేంద్రానికి వెళ్లి రావాలంటే అనేక వ్యయప్రయాసాలకు ఓర్చుకోవాల్సి వస్తోంది. జిల్లాస్థాయి అన్ని కార్యాలయాలు సంగారెడ్డిలోనే ఉండడంతో వివిధ పనులపై అక్కడికి వెళ్లడ ం అనివార్యం. కష్టనష్టాలను భరించి అక్కడికి వెళ్తే సంబంధిత అధికారి అందుబాటులో లేకపోతే మరింత వ్యధ. ఈ పరిస్థితిని దూరం చేసుకోవాలని నాలుగు దశాబ్దాలుగా పాదయాత్రలు, ఆందోళనలు, ప్రముఖులకు విజ్ఞాపనపత్రాలు సమర్పిస్తూ వస్తున్నారు. ఎన్నికల ముందు ఈ నినాదం మార్మోగి ఆశలను రేపిం ది. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సైతం సిద్దిపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. కాగా ఆయన మరణంతో అది కార్యరూపం దాల్చలేదు.
ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ హామీ..
2001 సంవత్సరం నుంచి ప్రతి ప్రధాన ఎన్నికలు, ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తామంటూ హమీలిస్తున్నారు. తెలంగాణలో 24 జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ స్పష్టమైన మెజార్టీని సాధించడంతో చిరకాల స్వప్నం సాకారమయ్యే అవకాశం ఏర్పడింది. జిల్లా కేంద్రం నుంచి దూరంగా ఉండడం.. తెలంగాణలో రెండో స్థానంలో సిద్దిపేట ఉండడం, సిద్దిపేట గడ్డ కేసీఆర్, హరీష్‌రావు రాజకీయ ఎదుగుదలకు కీలకంగా మారడంతో సిద్దిపేట జిల్లా తథ్యమని భావిస్తున్నారు.
ప్రతిపాదిత సిద్దిపేట జిల్లా..
సిద్దిపేటతోపాటు కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలు సైతం జిల్లా కేంద్రాలకు దూరంగా ఉండి ఇబ్బందులకు గురవుతున్నాయి. ఈ క్రమంలో మెదక్ జిల్లాలోని సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, దుబ్బాక, రామాయంపేట, తుప్రాన్, గజ్వేల్, కరీంనగర్ జిల్లా ముస్తాబాద్, సిరిసిల్లా, హుస్నాబాద్, బెజ్జంకి, ఇల్లంతకుంట, నల్గొండ జిల్లా రాజాపేట, వరంగల్ జిల్లా చేర్యాల ప్రాంతాలను కలిపి సిద్దిపేట కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని స్పష్టమైన ప్రతిపాదనలను ఇప్పటికే రూపొందించారు. కేసీఆర్ స్వయంగా ఈ ప్రతిపాదనలు పరిశీలించి యథాతథంగా లేదా స్వల్ప మార్పులతో ఆమోదిస్తే దశాబ్దాల కల కొన్ని నెలల్లోనే నిజం కానుంది.