కేసీఆరే సీఎం
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ఆ పార్టీ అధినేత కేసీఆరే ముఖ్యమంత్రి పదవి చేపట్టాలంటూ సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కేసీఆర్ ఒక్కరితోనే సాధ్యమని ఆయనే కొత్త రాష్ర్ట సీఎం బాధ్యతలు చేపట్టాలని ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్‌తోపాటు పలువురు నియోజకవర్గ నాయకులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.
శనివారం టీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు నరహరిరెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్ అభ్యర్థుల సమావేశం జరిగింది. సమావేశానికి చింతా ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో పాల్గొన్న నాయకులు, స్థానిక సంస్థల అభ్యర్థులు కేసీఆర్ సీఎం పదవిచేపట్టాలంటూ తీర్మానం చేశారు. అంతకుముందు సమావేశంలో చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు 12, 13 తేదీల్లో జరగనున్నట్లు చెప్పారు.
ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఏజెంట్ల నియామకాలు పూర్తి చేయాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అభ్యర్థులు, ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఎక్కడ ఎలాంటి చిన్నపొరపాటు కనిపించినా వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకవెళ్లాలని సూచించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా అభ్యర్థులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఫలితాలు వెలువడిన వెంటనే అభ్యర్థులు తనను కలవాలన్నారు. అలాగే సమావేశంలో ప్రసంగించిన పలువురు అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలుపొందనున్న చింతా ప్రభాకర్‌కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేయటం చర్చనీయాంశమైంది. సమావేశంలో పార్టీ నాయకులు విజయేందర్‌రెడ్డి, జలాలుద్దీన్‌బాబా, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌చారి, కసిని విజయ్‌కుమార్, హరికిషన్, సాయికుమార్, రాజేందర్‌నాయక్, నాని, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌కే పట్టం..
తెలంగాణలో టీఆర్‌ఎస్ అధికారంలోకి రావటం ఖాయమని చింతా ప్రభాకర్ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ నాయకులు సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సీఎం అయితేనే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమన్నారు. పార్టీ మేనిఫెస్టోకు అనుగుణంగా ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలతోపాటు తెలంగాణ అభివృద్ధికి తమ పార్టీ అధినేత కట్టుబడి ఉంటారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సంగారెడ్డి నియోజకవర్గంలోని మెజార్టీ స్థానాల్లో గెలుపొందటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.