హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. సోమవారం హన్మకొండ ఎన్జీవోస్ కాలనీలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీతో పొత్తు వద్దని పార్టీ శ్రేణులన్నీ మొత్తుకున్నా జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తమ ఓట్లు టీడీపీకి లాభించాయని, ఆ పార్టీ ఓట్లను తమకు అనుకూలంగా మలచుకోవాలని చూసిన వారి నాయకులు సహకరించలేదని ఆరోపించారు.
మునిసిపల్, పరిషత్ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలిచామని, జిల్లాలో టీడీపీ గెలిచిన పరకాల, పాలకుర్తి సీట్లు తమ పార్టీ నాయకులు, కార్యకర్తల కృషితోనే సాధ్యమయిందని చెప్పారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా వారి నుంచి సహకారం అందలేదని, ఈ పరిస్థితి పునరావృతమైందని అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామని తెలిపారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజలను కష్టాలకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రబీ సీజన్‌లో మూడు సార్లు అకాల వర్షాలు పడి రైతులు తీవ్రంగా నష్టపోయారని వారికి పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు కొత్త దశరథం, కాసర్ల రాంరెడ్డి, కుమారస్వామి, గాదె రాంబాబు, రావు అమరేందర్‌రెడ్డి, ఏదునూరి భవాని, కూచన రవళి పాల్గొన్నారు.
పొత్తుతో నష్టపోయాం
Published Tue, May 20 2014 2:47 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement