సాక్షి, ఒంగోలు,జిల్లా టీడీపీ శ్రేణులను నైరాశ్యం ఆవరించింది. మొన్నటి మున్సిపల్, నిన్నటి తొలివిడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్న ఆ పార్టీ కార్యకర్తల్లో నాటి ఉత్సాహం మచ్చుకైనా కనిపించడం లేదు. పార్టీ ఉనికిని కాపాడుకోవాలనే ప్రయత్నాల్లో భాగంగా అక్కడక్కడా కొందరు మాత్రమే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మెజార్టీ శ్రేణులు మాత్రం చంద్రబాబు నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ప్రధానంగా ఆ పార్టీ బీజేపీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకున్న దగ్గర్నుంచి జిల్లా శ్రేణుల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. సంతనూతలపాడు నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడంతో స్థానిక నాయకత్వం కాస్త అసమ్మతి వర్గంగా మారింది. దీంతో తిరిగి ఆ నిర్ణయాన్ని మార్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. సంతనూతలపాడుకు బదులు కొండపి నియోజకవర్గాన్ని కేటాయించనున్నట్టు సమాచారం. అయితే కొండపితో పాటు గిద్దలూరు స్థానాన్ని కూడా కేటాయించాలని, రాజంపేట బదులు ఒంగోలు లోక్‌సభ ఇవ్వాలని బీజేపీ పట్టుపడుతోంది. వీటిపై టీడీపీ శ్రేణులు మాత్రం గెలిచినా ఓడినా అన్ని నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాలని కోరుతున్నారు.
ఇద్దరిపైనే అంత ప్రేమేంటి..?
నియోజకవర్గాలను బీజేపీకి వదులుకుంటున్నామనే బాధ టీడీపీ శ్రేణులను తొలుస్తోంది. ఇప్పటికే జిల్లా పార్టీని నడిపిస్తున్న తెలుగు రైతు అధ్యక్షుడు కరణం బలరాం, జిల్లాపార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. వీరిద్దరూ తమ అనుయాయులైన ఎమ్మెల్యే బీఎన్ విజయ్‌కుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామికి ఎట్టిపరిస్థితుల్లో సీట్లు ఖరారుచేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.
మారిన పొత్తు పరిణామాల ప్రకారం సంతనూతలపాడులో బీఎన్ విజయ్‌కుమార్ స్థానం పదిలమని భావిస్తే బీజేపీ కోరుతున్న కొండపి నియోజకవర్గాన్ని దారా సాంబయ్యకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అలాంటప్పుడు బాలవీరాంజనేయస్వామి పరిస్థితి ఏమిటనేది తెలియాలి. ఇవే అంశాలు ప్రస్తుతం మలివిడత స్థానిక ఎన్నికలకు టీడీపీ శ్రేణులను దూరం చేస్తున్నాయి. దీంతో కొండపిని కూడా టీడీపీకే ఉంచేలా దామచర్ల మంత్రాంగం చేస్తున్నట్లు తెలిసింది.
ఇక గిద్దలూరు నియోజకవర్గాన్ని అటు కరణం బలరాం, ఇటు జనార్దన్ పట్టించుకోకుండా ఉండటంపై పార్టీశ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. బీజేపీ నేతలు సైతం గిద్దలూరులో అభ్యర్థి ఎంపిక అంశాన్ని కర్నూలు జిల్లా విభాగానికి అప్పగించినట్లు తెలిసింది. మొత్తానికి పార్టీ అధినేత నిర్ణయాలతో టీడీపీ కేడర్ పూర్తిగా నీరసపడి అయోమయానికి గురవుతున్నారు.