సీమాంధ్రలో నేడు, రేపు మోడీ ప్రచారం
బుధవారం రాత్రి ఏడున్నరకు తిరుపతికి రాక
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ బుధ, గురువారం రెండురోజుల పాటు సీమాంధ్రలో పర్యటించనున్నారు. ఆ పార్టీ పోటీ చేస్తున్న తిరుపతి, విశాఖపట్నం, నరసాపురం, రాజంపేట లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు టీడీపీ బరిలో ఉన్న నెల్లూరు, గుంటూరు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బుధవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో మోడీ పాట్నా నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీలోని ఎన్టీఆర్ స్టేడియూనికి వెళ్లి బహిరంగ సభలో మాట్లాడతారు. అనంతరం తిరుమలకు చేరుకొని అక్కడ ప్రముఖ కార్పొరేట్ దిగ్గజానికి చెందిన గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస చేస్తారు. మే ఒకటవ తేదీ తెల్లవారుజామున బ్రేక్ (ప్రారంభ) దర్శనంలో శ్రీవారి ని దర్శించుకుంటారు.
తర్వాత తిరుపతికి చేరుకొని హెలికాప్టర్‌లో బయలుదేరి తొలుత శ్రీకాళహస్తికి వెళతారు. దేవాలయంలో దర్శనానంతరం రాజంపేట నియోజకవర్గ పరిధిలోని మదనపల్లి బీజే కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. 12.45 నిమిషాలకు నెల్లూరులో, 3 గంటలకు గుంటూరులో, 4.30 గంటలకు నరసాపురం లోక్‌సభ పరిధిలోని భీమవ రానికి సమీపాన పెదమీర గ్రామంలో ఏర్పాటు చేసిన సభల్లో మోడీ ప్రసంగిస్తారు. రాత్రి 7గంటల ప్రాంతంలో విశాఖపట్నం బహిరంగసభలో పాల్గొంటారని బీజేపీ అధికార ప్రతినిధి జి.భానుప్రకాశ్‌రెడ్డి తెలిపారు. కాగా, మోడీ ఎన్నికల ప్రచార సభల్లో పలుచోట్ల చంద్రబాబు, పవన్‌కల్యాణ్, బీజేపీ నేత వెంకయ్యనాయుడు పాల్గొననున్నారు.
రేపు బీజేపీలో కావూరి చేరిక: ఏలూరు లోక్‌సభ సభ్యుడు కావూరి సాంబశివరావు గురువారం బీజేపీలో చేరుతున్నారు. భీమవరం బహిరంగ సభలో మోడీ సమక్షంలో ఆయన పార్టీలో చేరుతున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్ హైదరాబాద్‌లో చెప్పారు.