వన్ మేన్ షో! | One man show ! | Sakshi
Sakshi News home page

వన్ మేన్ షో!

Published Thu, May 1 2014 3:10 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

నరేంద్ర మోడీ - Sakshi

నరేంద్ర మోడీ

కాలం ఎంత చిత్రమైంది. ఎన్ని మార్పులనైనా తెస్తుంది. అందుకు జాతీయ పార్టీ బిజెపియే నిదర్శనం. గత ఎన్నికలలో దేదీప్యమానంగా వెలిగిపోయిన నాయకులు ఈ ఎన్నికలకు వెలిసిపోయారు. అంతే కాకుండా బిజెపి పరిస్థితి సినిమాను తలపిస్తోంది. సినిమాలో ఎన్ని ప్రధాన పాత్రలు ఉన్నా హీరోకి, దర్శకుడికి మాత్రమే పేరు వస్తుంది. సినిమా విజయవంతం కావడానికి ఇతరులు ఎంత కీలక పాత్ర పోషించినా వారిద్దరికే క్రెడిట్ దక్కుతుంది. సినిమాలలో మాదిరి రాజకీయాలలో కూడా హీరోలకే ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పుడు బిజెపి పరిస్థితి కూడా అలాగే తయారైంది. బిజెపిలో ఇప్పుడు హీరో గుజరాత్ ముఖ్యమంత్రి, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ. ఆ పార్టీ ప్రచారంలో అగ్రభాగంలో ఉంది ఆయనే. ఈ హీరో తప్ప మిగిలిన అతిరథమహారధులు ఎవరూ కనిపించడంలేదు. పార్టీని ఈ స్థాయిలో నిలిపిన, గతంలో ఓ వెలుగు వెలిగి కీర్తి కిరీటాలు అందుకున్న నేతలు ఇప్పుడు కళతప్పి మరుగునపడిపోయారు.

లాల్‌కృష్ణ అద్వానీ - సుష్మా స్వరాజ్ - మురళీ మనోహార్ జోషీ.....వంటి వాళ్లు దేశ రాజకీయ యవనికపై బలమైన ముద్ర వేశారు.  నిప్పు కణికల్లాంటి మాటలతో ప్రత్యర్థులకు వణుకు పుట్టించారు. పార్టీలో అగ్రనేతలుగా దేశవ్యాప్తంగా పేరు ఘడించారు. ఎన్నికల పర్వం మొదలైతే చాలు తమ ప్రాంతంలో అంటే తమ ప్రాంతంలో ప్రచారం చేయమని  స్థానిక నేతల నుంచి విపరీతమైన ఒత్తిళ్లు ఎదుర్కొనే వారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటన చేసేవారు. ఇంటా, బయటా గౌరవం. పార్టీలో, ప్రజల్లో క్రేజ్‌తో పాటు సమర్థులుగా పేరు ప్రఖ్యాతులు గడించిన ఘనత వారిది. అదంతా గతం. ఇప్పుడు ఓడలు బళ్లయ్యాయి.  ధారాళంగా మాటలు జారే నోటి నుంచి పలుకే బంగారమై పోయింది.

దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. సినిమాను ప్రదర్శనకు పెట్టిన బీజేపీ ప్రమోషన్‌ కార్యక్రమాలను రసవత్తరంగా జరిపిస్తోంది. సినిమా ప్రమోషన్ అంటే హీరో, డైరెక్టర్ హడావుడే ఎక్కువగా ఉంటుంది. బీజేపీ సినిమా ప్రమోషన్‌లో కూడా అవే సీన్లు కనిపిస్తున్నాయి. హీరో పాత్రలో పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, డైరెక్టర్ పాత్రలో పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాధ్‌ సింగ్ తమ పాత్రలను రక్తికట్టిస్తున్నారు. ముఖ్యంగా సినిమాను విజయవంతం చేసే బాధ్యతను తలకెత్తుకున్న మోడీ అంతా తానై ప్రమోషన్ చేస్తున్నారు. ఇక్కడే అటు ప్రజలకు, ఇటు పార్టీ శ్రేణులకు ఒక వెలితి కనిపిస్తోంది. గతంలో బీజేపీ సినిమాను నిలబెట్టి, పరాజయాలు ఎదురైనా మళ్లీ మళ్లీ కొత్త సొబగులు అద్దుతూ పార్టీని నడిపించిన కీలక నేతలు ఎక్కడా కనిపించకపోవడం వారిని నిరాశకు గురి చేస్తోంది.

లాల్‌కృష్ణ అద్వానీ: ఉక్కుమనిషి అంటూ అభిమానులు గౌరవంగా పిలుచుకునే వారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కనిపించడమే లేదు. గాంధీనగర్ దాటి ఆయన మాట బయటకు రావడమే లేదు. గత ఎన్నికల్లో అంతా అద్వానీ జపం చేశారు.  ఇప్పుడు మోడీ నామ స్మరణలో అద్వానీ స్వరం అంతగా వినిపించడం లేదు. హెలికాప్టర్ పర్యటనలు, హోరెత్తించే ప్రసంగాలు ఎక్కడా కనిపించడం లేదు. అద్వానీ పరిస్థితి ఇల్లే వైకుంఠం పందిరే పరమార్థం టైపులో మారిందని  కమలం వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. గతంలో పార్టీని అంతా తానై నడిపించిన ఈ అర్జునుడు ఇప్పుడు పద్మవ్యూహంలో చిక్కుకన్న అభిమన్యుడిలా మారిపోయారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సుష్మా స్వరాజ్: లోక్‌సభలో విపక్షనేతగా రాణించిన ఈ మహిళా నేత కమలదళంలో పదునైన మాటల అస్త్రం. ఒక దశలో ఆమెను ప్రధాని పదవికి అర్హురాలిగా కూడా పేర్కొన్నారు.  ఇప్పుడు బీజేపీ సినిమా ప్రమోషన్‌లో ఆమె పెద్దగా కనిపించడం లేదు.  మంచి వక్తగా పేరొందిన సుష్మా గత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఈసారి మాత్రం ఆమెకు అంత సీన్ కనిపించడం లేదు. ఆమె పాత్ర మధ్యప్రదేశ్‌కు మరీ ముఖ్యంగా విదీశ లోక్‌సభ నియోజకవర్గానికే పరిమితమైపోయినట్లుగా కనిపిస్తోంది.  ఏదో అప్పుడప్పుడు ఒకటీ, అరా ఇతర నియోజకవర్గాల్లో పర్యటిస్తూ తన పాత్ర ప్రాధాన్యత కోల్పోకుండా చేసుకుంటున్నారు.  ఢిల్లీలో ఒకసారి పర్యటించారు. తెలంగాణ కోసం లోక్సభలో గలమెత్తారు. ఈ చిన్నమ్మను మరచిపోవద్దని తెలంగాణ ప్రజలను కోరారు. అటువంటి తెలంగాణలో కూడా ఆమె ఒక్కసారే పర్యటించారు.

మురళీ మనోహార్ జోషీ: పార్టీలో మేధావిగా, హిందూత్వవాదిగా ముద్రపడిన జోషీ ఇప్పుడు బీజేపీ తెరపై ప్రాభవం కోల్పోయారు.  ఆయన పాత్ర కాన్పూర్‌కే పరిమితమైంది. ఎన్నికల వేళల్లో ఉత్తర భారతంలో విస్తృతంగా తిరుగుతూ ఉధృతంగా ప్రసంగించే జోషీ మారిన పరిస్థితుల్లో కాన్పూర్‌లోనే కాలం వెళ్లదీస్తున్నారు. అద్వానీ, సుష్మా, జోషీలు మాత్రమే కాదు జైట్లీ వంటి  నేతలు కూడా సొంత గడప దాటి కాలు బయట  పెట్టే పరిస్థితి లేదు. ఇది కాకతాళీయమా లేక పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతున్న తతంగమా అనేదే ప్రశ్నార్థకంగా మారింది.

ఇదిలా ఉంటే, మరో కథ ప్రచారంలో ఉంది. బీజేపీ సినిమా ప్రమోషన్‌లో మోడీని మాత్రమే ప్రమోట్ చేయాలని, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులందరినీ సైడ్ చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి సూచనలున్నాయని సమాచారం. మోడీతో పాటు మిగతా నటులు కూడా ప్రమోషన్లో పాల్గొంటే ఫోకస్ వారిమీదకు కూడా వెళ్తుందని, అలా జరిగితే మోడీ ప్రమోషన్ అనుకున్నస్థాయిలో జరగక ఇబ్బంది ఏర్పడుతుందని సంఘ్ భావనగా చెబుతున్నారు. అందుకే మాతృ సంస్థ నుంచి డైరెక్షన్ మేరకే అద్వానీ తదితరులను ప్రచారంలో పక్కన పెట్టారని పేర్కొంటున్నారు.లోగట్టు పెరమాళ్లకెరుక.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement