
ఈ దొంగలందరి పేర్లలో మోదీ అన్న పదం ఎందుకుందో...అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తే...ఆ మోదీ వేరు...మేం వేరు అంటున్నారు మోదీనగర్ వాసులు. రాహుల్ వ్యాఖ్యలతో తమకే సంబంధం లేదని, తామెవరం దొంగలం కామని వారు స్పష్టం చేస్తున్నారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్య మోదీనగర్ పేరుతో ఉన్న పట్టణవాసులకు ఇబ్బందికరంగా మారింది. లలిత్ మోదీ తాతగారి ఊరైన ఈ మోదీనగర్ ఢిల్లీకి ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఘజియాబాద్–మీరట్ మధ్యలో ఉన్న ఈ పట్టణం ఒకప్పుడు పలు రకాల మిల్లులు, ఫ్యాక్టరీలతో చరిత్ర ప్రసిద్ధిగాంచింది. రాహుల్ వ్యాఖ్యలతో ఈ పట్టణం రాజకీయ రొంపిలో చిక్కుకుంది. రాజకీయ రొంపిలోకి తమను లాగవద్దని వారు కోరుతున్నారు. మోదీ అన్నది మా పట్టణం పేరు. ఇది దొంగల నగరం కాదు. రాహుల్ అలా అనడం తప్పు’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాకేశ్ కుమార్ అగర్వాల్ అనే మోదీనగర్ వాసి. ‘ఇక్కడ మోదీ పేరుతో చక్కెర కర్మాగారం ఉంది. పరిశ్రమలున్నాయి. ఆలయం కూడా ఉంది. మోదీ అన్న పేరు ఇక్కడ ఎంతో గొప్పది’అని అగర్వాల్ స్పష్టం చేశారు.
1923 ప్రాంతంలో లలిత్‌మోదీ తాతగారైన రాజ్ బహదూర్ గుజర్‌మల్ మోదీ పాటియాలా నుంచి ఇక్కడికి వచ్చి అనేక ఫ్యాక్టరీలు, డిగ్రీ కాలేజీ పెట్టారు. ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం కూడా అందజేసింది.మొదట్లో ఈ పట్టణాన్ని బేగమాబాద్ అని పిలిచేవారని, గుజర్‌మల్ మోదీ చేసిన అభివృద్ధికి గుర్తుగా బ్రిటిష్ ప్రభుత్వం దీనికి ఆయన పేరు పెట్టిందని 76 ఏళ్ల మిథిలేశ్ చెప్పారు. మోదీలను కించపరచడానికి వారు కేవలం ఏదో ఒక వర్గం వారు కాదని, పార్శీలు, ముస్లింలు, ఇతర సామాజిక వర్గాల వారిని ఇక్కడ వృత్తిరీత్యా మోదీలుగా పిలుస్తారని మిథిలేశ్ తెలిపారు. నిజాయితీకి, కష్టించే తత్వానికి ప్రతీకగా మోదీ పేరు నిలుస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment