lalit modi
-
ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్ తమ్ముడు
Sushmita Sen Brother Rajeev Sen: మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ విషయం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు కారణం వ్యాపారవేత్త, ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీతో డేటింగ్ చేయడమే. అయితే తాజాగా సుష్మితా సేన్‌కు సంబంధించిన మరో విషయం చర్చనీయాంశమైంది. సుష్మితా తమ్ముడు రాజీవ్ సేన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో తను అన్‌ఫాలో చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాజీవ్, అతని భార్య చారు అసోపాతో వివాహమైన మూడేళ్లకే విడిపోయారు. వీరిద్దరు విడిపోవడంలో తప్పు రాజీవ్‌దేనని, అందుకే సుష్మితా సేన్ అతని మాజీ భార్య చారుకు సపోర్ట్ చేస్తుందని కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలపై తాజాగా రాజీవ్ స్పందించాడు. 'నా సోదరి నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వట్లేదని మీడియా చెబుతోంది. అసలు ఆమె ఎప్పుడూ నన్ను ఫాలో కాలేదు, కొత్తగా అన్‌ఫాలో చేయడానికి. ఈ వార్త నన్ను కలిచివేసింది. అందుకే ఈ విషయం గురించి నిజం చెప్పాల్సి వచ్చింది. సుష్మితా నన్ను కేవలం ఒక ట్విటర్లోనే ఫాలో అవుతోంది. అది కూడా చాలా కాలంగా. ఇక రెండో విషయం ఏంటంటే ? నా భార్య చారుని ఫాలో అవుతూ ఆమెకు సుష్మితా మద్దతుగా నిలిచిందని మీడియా పేర్కొంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే.. మా అక్క సుష్మితా చాలా తెలివైనది. మేము దేని గురించి నిలబడతామో ఆమెకు చాలా బాగా తెలుసు. అలాగే తను బాధితురాలిగా మెలగడంలో ఎంత గొప్ప నేర్పరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది' అని తెలిపాడు. మరి సుష్మితా సేన్ ఆమెను ఎందుకు ఫాలో అవుతుందని అడిగిన ప్రశ్నకు 'అది ఆమెనే అడిగి తెలుసుకోండి' అని సమాధానమిచ్చాడు. కాగా చారు అసోపా తన మొదటి పెళ్లి గురించి అతని దగ్గర దాచిందని గతంలో ఆరోపణలు చేశాడు రాజీవ్. అయితే ఇప్పుడు ఆమె మూవ్ ఆన్ అయిందని, ముంబైలో సంతోషంగా జీవిస్తున్నందుకు ఆనందిస్తున్నాను చెప్పుకొచ్చాడు. -
ఆ మోదీ వేరు... ఈ మోదీ వేరు
ఈ దొంగలందరి పేర్లలో మోదీ అన్న పదం ఎందుకుందో...అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తే...ఆ మోదీ వేరు...మేం వేరు అంటున్నారు మోదీనగర్ వాసులు. రాహుల్ వ్యాఖ్యలతో తమకే సంబంధం లేదని, తామెవరం దొంగలం కామని వారు స్పష్టం చేస్తున్నారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్య మోదీనగర్ పేరుతో ఉన్న పట్టణవాసులకు ఇబ్బందికరంగా మారింది. లలిత్ మోదీ తాతగారి ఊరైన ఈ మోదీనగర్ ఢిల్లీకి ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఘజియాబాద్–మీరట్ మధ్యలో ఉన్న ఈ పట్టణం ఒకప్పుడు పలు రకాల మిల్లులు, ఫ్యాక్టరీలతో చరిత్ర ప్రసిద్ధిగాంచింది. రాహుల్ వ్యాఖ్యలతో ఈ పట్టణం రాజకీయ రొంపిలో చిక్కుకుంది. రాజకీయ రొంపిలోకి తమను లాగవద్దని వారు కోరుతున్నారు. మోదీ అన్నది మా పట్టణం పేరు. ఇది దొంగల నగరం కాదు. రాహుల్ అలా అనడం తప్పు’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాకేశ్ కుమార్ అగర్వాల్ అనే మోదీనగర్ వాసి. ‘ఇక్కడ మోదీ పేరుతో చక్కెర కర్మాగారం ఉంది. పరిశ్రమలున్నాయి. ఆలయం కూడా ఉంది. మోదీ అన్న పేరు ఇక్కడ ఎంతో గొప్పది’అని అగర్వాల్ స్పష్టం చేశారు. 1923 ప్రాంతంలో లలిత్‌మోదీ తాతగారైన రాజ్ బహదూర్ గుజర్మల్ మోదీ పాటియాలా నుంచి ఇక్కడికి వచ్చి అనేక ఫ్యాక్టరీలు, డిగ్రీ కాలేజీ పెట్టారు. ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ పురస్కారం కూడా అందజేసింది.మొదట్లో ఈ పట్టణాన్ని బేగమాబాద్ అని పిలిచేవారని, గుజర్మల్ మోదీ చేసిన అభివృద్ధికి గుర్తుగా బ్రిటిష్ ప్రభుత్వం దీనికి ఆయన పేరు పెట్టిందని 76 ఏళ్ల మిథిలేశ్ చెప్పారు. మోదీలను కించపరచడానికి వారు కేవలం ఏదో ఒక వర్గం వారు కాదని, పార్శీలు, ముస్లింలు, ఇతర సామాజిక వర్గాల వారిని ఇక్కడ వృత్తిరీత్యా మోదీలుగా పిలుస్తారని మిథిలేశ్ తెలిపారు. నిజాయితీకి, కష్టించే తత్వానికి ప్రతీకగా మోదీ పేరు నిలుస్తుందన్నారు. -
రాజస్థాన్ క్రికెట్ సంఘంపై నిషేదం ఎత్తివేత
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌పై కొనసాగుతున్న నిషేదాన్ని ఎత్తి వేసింది. సోమవారం జరిగిన బోర్డు ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా ప్రకటించారు. ఇక 2014లో రాజస్థాన్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీని ఎన్నుకోవడాన్ని వ్యతిరేకిస్తూ బీసీసీఐ రాజస్థాన్ క్రికెట్ సంఘంపై వేటు వేసింది. హైకోర్టు సూచనలతో ఈ ఏడాది జూన్‌లో మళ్లీ జరిగిన ఎన్నికల్లో లలిత్ మోదీ కుమారుడు రుచిర్ పై కాంగ్రెస్ నేత సీపీ జోషి ఎన్నికైన విషయం తెలిసిందే. ఇక సుప్రీం నియమించిన బీసీసీఐ పరిపాలకుల కమిటీ రాజస్థాన్ బోర్డు ఏర్పాటు చేసిన అడహక్ కమిటీని రద్దు చేయడంతో నిషేదం ఎత్తివేయడానికి మార్గం సుగమమైంది. ఈ నిషేదంతో ఇప్పటి వరకు రాజస్థాన్‌లో ఎలాంటి అంతర్జాతీయ, దేశావాళి మ్యాచ్‌లను నిర్వహించలేదు. ఆఖరికి ఐపీఎల్ మ్యాచ్‌లను సైతం జైపూర్‌కు తరలించారు. -
సుష్మా ఇంటిని ముట్టడించేందుకు యత్నం
న్యూఢిల్లీ: మాజీ ఐపిఎల్ చీఫ్ లలిత్ మెదీ వీసా వివాదంలో విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు శనివారం హస్తినలో ఆందోళనకు దిగారు. ఢిల్లీలోని సుష్మా ఇంటిని ముట్టడిం చేందుకు ఆప్ శ్రేణులు ప్రయత్నించాయి. భారీ ర్యాలీగా వెళ్లిన కార్యకర్తలు సుష్మా ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించాయి. ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గత ఆందోళనల నేపథ్యంలో సుష్మా ఇంటి వద్ద బందోబస్తు పెంచిన పోలీసులు బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ బారికేడ్లను తోసుకొని సుష్మా ఇంటి ముట్టడికి ఆప్ కార్యకర్తలు ప్రయత్నించారు. మంత్రి పదవికి సుష్మా స్వరాజ్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. లలిత్ మోదీ వీసా వ్యవహారంలో చిక్కుల్లో పడిన కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ మానవతా దృక్పథంతోనే ఈ సాయం చేశానని వివరణ ఇచ్చినా.. ఈ వ్యవహారంలో ఆమెకు లబ్ధి చేకూరిందని కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శిస్తున్నాయి. తక్షణమే ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. మరోవైపు సుష్మా స్వరాజ్ న్యూయార్క్ బయల్దేరి వెళ్లిపోయారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ఆమె న్యూయార్క్ వెళ్లారు. లలిత్ మోదీ వివాదం మరింత ముదురుతున్న నేపథ్యంలో ఆమె న్యూయార్క్ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.