వార్ వన్‌సైడేనా.. | war one side... | Sakshi
Sakshi News home page

వార్ వన్‌సైడేనా..

Published Sun, Mar 30 2014 2:41 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

war one side...

 సాక్షి ప్రతినిధి, అనంతపురం : మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్‌సైడేనా..? అధిక శాతం డివిజన్‌లు, వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు టీడీపీ, కాంగ్రెస్‌లు కనీసం పోటీ ఇచ్చే స్థాయిలో కూడా లేవా? అనంతపురం నగర పాలక సంస్థసహా సింహ భాగం మున్సిపాల్టీలు, నగర పంచాయతీలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోవడం ఖాయమా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. ఇంటెలిజెన్స్ నివేదికలూ అదే సూచిస్తున్నాయి. టీడీపీ, కాంగ్రెస్‌లు అంతర్గతంగా చేయించుకున్న సర్వేల ఫలితాలు సైతం రాజకీయ పరిశీలకుల విశ్లేషణలకు బలం చేకూర్చేలా ఉన్నాయని సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో చావుదెబ్బ తింటే.. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమని టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.


వివరాల్లోకి వెళితే.. జిల్లాలో అనంతపురం నగరపాలక సంస్థతోపాటు 11 పురపాలక, నగర పంచాయతీలకు ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు.. ఫలితాలను ప్రకటించనున్న విషయం విదితమే. టీడీపీ ఆవిర్భావం నుంచి మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటూ వస్తోంది. 1985, 1990, 1995, 2000, 2005 మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ చావు దెబ్బ తినడమే అందుకు తార్కాణం. జిల్లాలో 2005 మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క మున్సిపాల్టీని కూడా దక్కించుకోకపోవడమే అందుకు తార్కాణం. వీటిని పరిగణనలోకి తీసుకుంటే నగరాల్లోనూ పట్టణాల్లోనూ టీడీపీ అత్యంత బలహీనంగా ఉందన్నది విస్పష్టమవుతోంది. ఇటీవలి కాలంలో టీడీపీ మరింత బలహీనపడింది.

 తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన టీడీపీ..

 పదేళ్లుగా అధికారానికి దూరమైన టీడీపీ ఏనాడూ ప్రజా సమస్యల పరిష్కారంపై పోరాటం చేసి నిర్మాణాత్మక ప్రతిపక్షపాత్ర పోషించిన దాఖలాలు లేవు. పైగా రాష్ట్ర విభజనలో ప్రజల మనోభిప్రాయాలను దెబ్బతీసేలా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రవచించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మద్దతుగా కేంద్రానికి లేఖ ఇచ్చారు. ఆ లేఖ ఆధారంగా కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంపై సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఈ ఉద్యమానికి ‘అనంత’ చుక్కానిలా నిలిచింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో సమైక్యవాదులు టీడీపీ శ్రేణులను ఎక్కడికక్కడ అడ్డుకుని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.


కాంగ్రెస్ శ్రేణులను ఉద్యమంలో పాల్గొననివ్వకుండా తరిమికొట్టారు. ప్రజల మనోభిప్రాయాలను గౌరవించిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమబావుటా ఎగుర వేశారు. జైల్లో ఉన్నప్పుడు ఒకసారి.. హైదరాబాద్‌లో మరోసారి సమైక్యాంధ్ర నినాదంతో ఆమరణ దీక్ష చేశారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి జాతీయ స్థాయిలో నేతల మద్దతు కూడగట్టారు. తమ మనోభిప్రాయాలను గౌరవించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజానీకం బాసటగా నిలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో నగరాలు, పట్టణాల్లో టీడీపీ పూర్తిగా బలహీనపడింది. తెలుగుజాతి ఆత్మగౌరవం నినాదంతో ఎన్‌టీ రామారావు టీడీపీని స్థాపిస్తే.. ఆయనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో తెలుగు ప్రజలను వంచించారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.

 అభివృద్ధికి బాటలు వేసిన వైఎస్..

 అనంతపురం నగర పాలక సంస్థతోపాటు తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, కదిరి, ధర్మవరం, హిందూపురం మున్సిపాల్టీల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఉండేది. వేసవిలో పానీపట్టు యుద్ధాలు తప్పేవి కాదు. కానీ.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.1,075 కోట్ల వ్యయంతో తాగునీటి పథకాలు చేపట్టి నగర, పట్టణ ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చారు. కళ్యాణదుర్గం, పుట్టపర్తి, గుత్తి, పామిడి, మడకశిర నగర పంచాయతీ ప్రజల దాహార్తిని కూడా వైఎస్ తీర్చారు. అనంతపురం కార్పొరేషన్ సహా 11 మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో ఇళ్లులేని నిరుపేదలకు 4.15 లక్షల పక్కా గృహాలను నిర్మించి, సొంతింటి కలను సాకారం చేశారు. 2.50 లక్షల మంది వృద్ధులు, వితంతవులు, వికలాంగులకు పెన్షన్లను మంజూరు చేశారు.

 స్వయం సహాయక సంఘాల మహిళలకు వందలాది కోట్లను రుణాల రూపంలో పంపిణీ చేశారు. పట్టణాల్లో అధికంగా నివాసం ఉంటోన్న మైనార్టీ వర్గాల ప్రజలు వైఎస్ రాజశేఖరరెడ్డి కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్‌తో అధిక శాతం లబ్ధి పొందారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను మళ్లీ తెచ్చే శక్తి ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇదే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం ఏకపక్షం కావడానికి దారితీస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిర్వహించిన రోడ్‌షోలకు నగరాలు, పట్టణాల్లో పోటెత్తిన జనసంద్రమే అందుకు తార్కాణం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement