మూగనోము!
సాక్షి, కర్నూలు: పురపాలక సంఘాలు.. నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రచారానికి తెర పడింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయానికి మైకులన్నీ మూగబోయాయి. నాయకులు రహస్య భేటీలు.. చర్చల్లో తలమునకలవుతున్నారు. నగదు, వస్తువులు, మద్యం తదితరాల పంపిణీని గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చేస్తున్నారు. పార్టీలోని అసంతృప్తి నేతలు.. ముఖ్య కార్యకర్తలను బుజ్జగించేందుకు చివరి ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలను బుట్టలో వేసుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. నంద్యాల, డోన్, ఆదోని, ఎమ్మిగనూరు పురపాలక సంఘాలు.. ఆళ్లగడ్డ, ఆత్మకూరు, బనగానపల్లె, నందికొట్కూరు, గూడూరు నగర పంచాయతీల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారంలో విస్తృతంగా పాల్గొనగా.. విభజన భయంతో కాంగ్రెస్, టీడీపీ నేతలు అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జిల్లాలో నాలుగు రోజుల పాటు చేపట్టిన ప్రచారం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. ఇదే సమయంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనకు.. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలను పోల్చి చూపడం ప్రజలను ఆలోచింపజేసింది. ప్రజల్లోకి వెళ్లలేకనే చంద్రబాబు కర్నూలు నగరంలో మాత్రమే ప్రజాగర్జన చేపట్టారనే చర్చ జరుగుతోంది. ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి.. ప్రచార కమిటీ సారథి, సినీ నటుడు చిరంజీవి గురువారం కర్నూలుకు వచ్చినా నాయకులు, శ్రేణుల్లో కనీస ఉత్సాహాన్ని నింపలేకపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీదారులు అంతంత మాత్రమే కావడం కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. బీజేపీ, సీపీఎం, సీపీఐ తమదైన శైలిలో ప్రచారం చేపట్టాయి.
వైఎస్‌ఆర్‌సీపీ తరఫున నంద్యాలలో ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, నందికొట్కూరులో పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త గౌరు చరిత.. డోన్, ఆత్మకూరు, ఆదోని, గూడూరులో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు బుగ్గన రాజారెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, వై.సాయిప్రసాద్‌రెడ్డి, మణిగాంధీ తదితరులు విస్తృత ప్రచారం నిర్వహించారు. బనగానపల్లె నగర పంచాయతీ ఏర్పాటు నిబంధనలకు విరుద్ధమంటూ హైకోర్టు తీర్పునివ్వడంతో ఇక్కడ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకుండాపోయింది. ఇదిలాఉండగా టీడీపీలోకి విభజనకు కారణమైన కాంగ్రెస్ నేతలు చేరడంతో.. ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారోననే చర్చ జరుగుతోంది.
ప్రలోభాలపర్వం
ప్రచారపర్వం ముగియడంతో ప్రలోభాలకు తెరలేచింది. పోలింగ్‌కు ఒక్క రోజు మాత్రమే గడువు ఉండటంతో ఓటర్లను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కొన్ని మున్సిపాలిటీల్లో అభ్యర్థులు పోటీ పడి పంపకాలకు సిద్ధమయ్యారు. ఎమ్మిగనూరులో రియల్‌ఎస్టేట్ వ్యాపారులు బరిలో ఉండటంతో డబ్బు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు.
ఒక్కో ఓటుకు రూ.500 చొప్పున చెల్లించినట్లు తెలుస్తోం ది. డోన్ బరిలోని అభ్యర్థులు కొం దరు పరస్పర అవగాహనతో రూ.300 చొప్పున పంపిణీ చేసేందుకు ఒప్పందం చేసుకోవడం గమనార్హం. ఆత్మకూరులోనే ఇదే తంతు కొనసాగింది. ఆదోనిలో శుక్రవారం నలుగురు వ్యక్తులు ఓటర్లకు పంచుతున్న రూ.33వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల, బనగానపల్లెలో 16 మంది సారా విక్రేతలపై బైండోవర్ కేసులు నమోదు చేశారు.