సమరం షురూ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అసలు పోరు మొదలైంది. ఎన్నికల ప్రక్రియలో ప్రధాన పార్టీలకు ప్రచా రం ఒక్కటే మిగిలింది. గ్రామగ్రామాని కి తిరిగి ప్రచారం చేసేందుకు ప్రధాన పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. నిజామాబాద్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాలతోపా టు, తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్, వై ఎస్‌ఆర్ సీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ కూట మి ప్రధాన పార్టీలుగా అభ్యర్థులను బరిలో దింపాయి.
ఆమ్‌ఆద్మీ పార్టీ, బీఎస్‌పీ, సీపీఐ, లోక్‌సత్తా, స్వతంత్రులు కూడ పలుచోట్ల పోటీలో ఉన్నారు. మొదటిసారిగా వైఎస్‌ఆర్ సీపీ లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను పోటీకి దించిం ది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీల కూటమి నుంచి పలుచోట్ల రెబల్స్ నామినేషన్లు వేశారు. రెండు రోజుల వ్యవధిలో బుజ్జగింపులు, బేరసారాల తరువాత కొందరు ఉపసంహరించుకున్నారు.
జు క్కల్‌లో మాత్రం కాంగ్రెస్ నుంచి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అరుణతార,టీఆర్‌ఎస్‌కు మాజీ ఎమ్మెల్యే పండరి, బోధన్‌లో టీడీపీ అమర్‌నాథ్ బాబులు రెబల్స్‌గా ఉన్నారు. నా మినేషన్ల ఉపసంహరణ వరకు బిజీబిజీగా ఉన్న ప్రధాన పార్టీలు, ఇక నేటి నుంచి ప్రచార వ్యూహాలకు పదును పెట్టనున్నాయి. ఇప్పటికే కొందరు ప్రచారం ప్రారంభించారు.
ప్రచారం కోసం పార్టీల అగ్రనేతలు
సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు ప్రధాన పార్టీలు అగ్రనేతలను రంగంలోకి దించనున్నాయి. పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా వచ్చిన ఎన్ని కలలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను దింపిన వైఎస్‌ఆర్ సీపీ జిల్లాలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన రైతు దీక్షకు వచ్చిన స్పందనను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించిన ఈ పార్టీ దివంగత నేత డాక్టర్ వైఎస్‌ఆర్ పథకాలతో ముందుకు వెళ్లనుంది. తెలంగాణ జిల్లాల పర్యటనలో భాగంగా వైఎస్ షర్మిల తదితరులు పర్యటించే అవకాశం ఉంది.
15న కేసీఆర్ రాక
ఈ నెల 15న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జిల్లా కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కమిటీ కేసీఆర్ పర్యటన ఖరారైనట్లు ప్రకటన కూడా చేసింది. కాంగ్రెస్ పార్టీ తరపున జిల్లాలో ప్ర చారం నిర్వహించేందుకు సోనియా గాని, రాహుల్ గాని వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. జైరాంరమేష్‌తో పాటు పలువురు నాయకులు టీపీసీసీ పక్షాన పర్యటించే అవకాశం ఉంది.
టీడీపీ, బీజేపీ కూటమి తరపున ప్రకాశ్ జవదేకర్, సుష్మాస్వరాజ్, చంద్రబాబునాయుడు, బాలకృష్ణ ప్రచారం చేసే అవకాశం ఉందంటున్నారు.ఏదైమైనా ఎన్నికలకు ఇంకా 17 రోజులే గడువుండటంతో ప్రచారం ఆదివారం నుంచి హోరెత్తనుండగా.. ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్న పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు అగ్రనేతలను ప్రచారం కోసం వాడుకునే ప్రయత్నంలో ఉన్నాయి.