మనమే విజేతలం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘జిల్లాలో అత్యధిక స్థానాలు మనవే. కనిష్టంగా సగం సీట్లన్నా గెలుచుకుంటాం. అధికారంలోకి రాబోయేది మనమే. మంత్రి పదవులపై అందరం ఆలోచిద్దాం’. తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్‌ఎస్, తెలుగుదేశం పార్టీల అంతర్గత చర్చల సారాంశం ఇది. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికలపై ఏ పార్టీకి ఆ పార్టీ అంతులేని ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నాయి. జిల్లాలో అత్యధిక స్థానాలు మావంటే మావేనని ధీమాను వ్యక్తపరుస్తున్నాయి.
ఆయా పార్టీలు నిర్వహిస్తున్న అంతర్గత సమీక్షల్లో పోలింగ్ సరళిని సూక్ష్మంగా విశ్లేషిస్తున్నాయి. విజయావకాశాలున్న స్థానాలెన్ని.. గెలిచేదెవరు అనే అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్న పార్టీలు... ఓటింగ్ జరిగిన తీరును క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నివేదికలతో పోల్చుకుంటున్నాయి. సోమవారం టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య నిర్వహించిన సమీక్షా సమావేశంలో మెజార్టీ స్థానాలు మనవేనని కాంగ్రెస్ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేయగా, టీఆర్‌ఎస్ నేత పి.మహేందర్‌రెడ్డి ఇంట్లో మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలోనూ జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకుంటామనే విశ్వాసం వ్యక్తమైంది.
ఎవరికి వారు..
కారు జోరుతో ఒడిదుడుకులు ఎదుర్కొన్న కాంగ్రెస్... సార్వత్రిక సమరంలో పైచేయి మాదేననే గట్టినమ్మకంతో ఉంది. టీఆర్‌ఎస్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, ఆ పార్టీ విజయతీరాలకు చేరడం కష్టమని.. దాదాపు ఏడు సీట్లు తమ ఖాతాలో పడతాయని భరోసాతో ఉంది. ఇదే విషయాన్ని గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ పొన్నాల సమక్షంలో జరిగిన సమావేశంలో సైతం జిల్లా నేతలు కుండబద్దలు కొట్టారు. మరిన్ని సీట్లు గెలుచుకునేందుకు అవకాశమున్నప్పటికీ, తిరుగుబాటు అభ్యర్థులు, వెన్నుపోటు దారులతో పార్టీకి నష్టం వాటిల్లిందనే అభిప్రాయం వ్యక్తమైంది. అదేసమయంలో కేంద్రంలో మోడీ హవా, బలమైన అభ్యర్థులను బరిలోకి దింపకపోవడంతో పార్లమెంటు స్థానాల్లో క్రాస్ ఓటింగ్‌కు దారితీసినట్లు తెలుస్తోందని స్పష్టం చేశారు. ఇదిలావుండగా, మంగళవారం టీఆర్‌ఎస్ కూడా పోలింగ్ సరళిపై విశ్లేషించింది. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు తొలిసారి భేటీ అయి.. విజయావకాశాలను బేరీజు వేసుకున్నారు.
జిల్లాలో వికారాబాద్, తాండూరు, చేవెళ్ల, పరిగి, మల్కాజ్‌గిరి, మేడ్చల్, ఉప్పల్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయాకాశాలు మెండుగా ఉన్నాయని, హీనపక్షంగా ఆరు స్థానాలు తథ్యమనే విశ్వాసం వ్యక్తమైంది. గ్రామీణ నియోజకవర్గాల్లో అధిక పోలింగ్ శాతం నమోదవడం పార్టీకి అనుకూలమైన పరిణామంగా చెప్పుకొచ్చారు. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి విజయం ఖాయమని, మల్కాజ్‌గిరిలోను గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయని విశ్లేషించారు. ఇక తెలంగాణలో అధికారంపై ఏ మాత్రం విశ్వాసం లేని తెలుగుదేశం కూడా జిల్లాలో మాత్రం తమ ఆధిపత్యం కొనసాగుతుందని భావిస్తోంది. ఆది నుంచి పార్టీకి కంచుకోటగా భావిస్తున్న స్థానాల్లో పార్టీ ప్రాభవాన్ని నిలబెట్టుకుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధినేతకు జిల్లా నాయకులు వివరించారు. కనీసం 6 స్థానాలైన జిల్లాలో గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇలా ఎవరికివారు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. ఓటర్లు ఎవరి వైపు మొగ్గారో తేలాలంటే మరో తొమ్మిది రోజులు ఆగాల్సిందే..!