సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయ ఢంకా మోగిద్దామని ఆ పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బీజేపీతో టీడీపీ అనైతిక పొత్తు
వైఎస్సార్ సీపీ ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలపు సురేష్
చీమకుర్తి, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయ ఢంకా మోగిద్దామని ఆ పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చీమకుర్తిలోని బూచేపల్లి కల్యాణ మండపంలో సోమవారం మధ్యాహ్నం వైఎస్సార్ సీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేష్ మాట్లాడుతూ.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ముందుకు సాగుదామని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రాన్ని విభజించడానికి సహకరించిన మతతత్వ పార్టీ బీజేపీతో టీడీపీ అనైతిక పొత్తు పెట్టుకుందని విమర్శించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు టీడీపీలోని కార్యకర్తలు అసంతృప్తితో రగిలిపోతున్నారని, అలాంటి వారిని మన పార్టీలోకి ఆహ్వానించి వారిని కలుపుకుపోవాలని కోరారు. కార్యకర్తల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని సురేష్ భరోసా ఇచ్చారు.
వైఎస్సార్ సీపీ చేపట్టనున్న పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మారం వెంకారెడ్డి, నాయకులు కూరాకుల రాఘవరెడ్డి, మేదరమెట్ట శ్రీనివాసులు, గంగిరెడ్డి ఓబుల్‌రెడ్డి, గంగిరెడ్డి వెంకటరెడ్డి, సూడిదేల సుబ్బరామిరెడ్డి, దుడ్డు మార్కు, కంఠా ఆంజనేయులు, గోపిరెడ్డి ఓబుల్‌రెడ్డి, మేడగం రామకృష్ణారెడ్డి, క్రిష్టిపాటి శేఖరరెడ్డి, బండ్ల కొండలు, బడే దశర థరామిరెడ్డి, ఏలూరి సుబ్బారావు, దాసరి లక్ష్మినారాయణ, ఇజ్జగిరి కోటయ్య, మేకల సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.