పగలు ప్రచారం.. రాత్రి ప్రలోభం
ఎల్లారెడ్డి టౌన్, న్యూస్‌లైన్ : ఎన్నికల సమరానికి ఆరురోజులే సమయం ఉండటంతో అభ్యర్థలంతా బిజీబిజీగా మారారు. పగలు.. రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నారు. ఇంటింటి ప్రచారాలు, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంతో పాటు పార్టీలోని అసంతృప్తివాదులను బుజ్జగిస్తున్నారు.
పొద్దున లేసింది మొదలు పొద్దుగూకే దాకా ఎల్లారెడ్డి నియోజకవర్గ అభ్యర్థులు ఆరు మండలాల్లో పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇక రాత్రుళ్లు పలు గ్రామాల్లో పార్టీకి చెందిన నాయకులను, గ్రామ పెద్దలను తమవైపు తిప్పుకునే మంత్రాంగం చేస్తున్నారు. ప్రధాన పార్టీలైన వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీడీ పీ, బీజేపీ పొత్తు ఖరారు కావడంతో ఈ సీటును బీజేపీకి కేటాయించారు.టీడీపీకి చెందిన మండల, గ్రామ స్థాయి నాయకులను ఒకతాటిపైకి తేవడానికి అభ్యర్థి తరపున పలువురు బడా నేతలు రంగంలోకి దిగి, వారిని తమ దారికి తెచ్చుకుంటున్నారు.
ఇటు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో సైతం చాలా గ్రామాల్లో అసంతృప్తులు ఉండటంతో వారిని బుజ్జగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పగలంతా ఎండ వేడితో అల్లాడుతూ ప్రచారం నిర్వహిస్తున్నా రాత్రిళ్లు బుజ్జగింపులు, ప్రలోభాల పర్వం మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు.
నాలుగు పార్టీలు ఎలాగైనా గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పలు ప్రాంతాల్లో అసంతృప్తులు అడ్డు పడుతున్నారు. దీంతో వారికి కావాల్సిన తాయిలాలు అందజేస్తూ.. హామీలు ఇస్తూ అభ్యర్థులు దారికి తెచ్చుకుంటున్నారు. నెలరోజులుగా ఎన్నికల హడావిడితో తలమునకలై ఉన్న అభ్యర్థులు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఒత్తిడికి గురవుతున్నారు.