మాట తప్పినవారికి ఓటుతో బుద్ధి చెప్పండి
ప్రజలకు గౌరు వెంకటరెడ్డి పిలుపు
వైఎస్సార్‌సీపీని ఆదరించాలని విజ్ఞప్తి
నందికొట్కూరు, న్యూస్‌లైన్: కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు అన్నదమ్ముల్లా ఉండే తెలుగువారిని నిలువునా విభజించాయని, మాట తప్పి ప్రవ ర్తించిన ఆ పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించి రాష్ట్రంలో రైతు రాజ్యాన్ని తెస్తుందని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి అన్నారు.
ఐజయ్య వైఎస్సార్‌సీపీ నందికొట్కూరు అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమానికి గౌరు వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులనుద్దేశించి ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమం జగనన్నతోనే సాధ్యమవుతుందన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో గౌరు చరితారెడ్డి పాలనలో ఎత్తిపోతల పథకాలు మంజూరయ్యాయని ఆయన గుర్తుచేశారు.
ఆ పథకాలను లబ్బి వెంకటస్వామి పూర్తి చేయలేక బురదజల్లే మాట లు మాట్లాడడం హస్యాస్పదంగా ఉందన్నారు. అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసే రకమని లబ్బిని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులతో జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేగా పదవులను అలంకరించిన లబ్బికి సార్వత్రిక ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బలపరిచిన అభ్యర్థి ఐజయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.
వైఎస్సార్ ఆశయ సాధనకు కృషి చేస్తా : ఐజయ్య వైఎస్సార్ ఆశయ సాధనకు కృషి చేస్తానని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఐజయ్య అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి పెండింగ్ ప్రాజెక్ట్‌లు, పనులు పూర్తి చేయిస్తామన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఐజయ్యను అఖండ మెజార్టీతో గెలిపించాలని పార్టీ నాయకుడు మాండ్ర శివానందరెడ్డి పిలుపునిచ్చారు.
బ్రాహ్మణకొట్కూరు గ్రామానికి చెందిన లబ్బి వెంకటస్వామి ముఖ్య అనుచరుడు మద్దూరు నరహరిరెడ్డి గౌరు వెంకటరెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు.కార్యక్రమానికి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కస్వా శంకర్‌రెడ్డి, శ్రీనాథరెడ్డి, జిల్లా నాయకులు గౌరు మురళీధర్‌రెడ్డి, మాండ్ర ఉమ, నందికొట్కూరు, మిడుతూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, పాములపాడు, కొత్తపల్లి మండలాల కన్వీనర్లు అబ్దుల్ మునాఫ్, ఓబుల్‌రెడ్డి, పలుచాని మహేశ్వరరెడ్డి, పురుషోత్తంరెడ్డి, కాతా రమేష్‌రెడ్డి, గోవిందగౌడ్, పల్లె శివానందరెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్ మురళీమోహన్‌రెడ్డి, నాయకులు ఎల్.నరసింహారెడ్డి, శెట్టి వీరన్న, జయసింహారెడ్డి, తిమ్మారెడ్డి, లింగస్వామిగౌడ్, జయరామిరెడ్డి, బుడగజంగాల మధు తదితరులున్నారు.
నామినేషన్ వేసిన ఐజయ్య
నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా ఐజయ్య గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన జనసందోహం మధ్య ఆయన ర్యాలీగా తరలివచ్చి తహశీల్దార్ కార్యాలయంలో 11.40గంటలకు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి జయకుమార్‌కు అందజేశారు. ఆయనతో పాటు పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, నాయకులు మాండ్ర శివానందరెడ్డి తదితరులు ఉన్నారు.