నీతి, నిజాయతీతో వ్యవహరిస్తాం
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు నీతి, నిజాయతీతో పనిచేసి ఉత్తమ సేవలు అందిస్తామని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ అన్నారు. మంగళవారం పట్టణంలోని పద్మశాలి భవన్‌లో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీల ప్రజా వ్యతిరేక పాలనకు విసిగిపోయి ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటామని పేర్కొన్నారు. అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను తీర్చడానికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామన్నారు. ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులు నిర్వహిస్తామని తెలిపారు.
రహదారులు, వాగులపై వంతెనలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను రద్దుకు తోడ్పడతానన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేయిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇద్దరు పేద బిడ్డలను గెలిపించి గుండెలకు హద్దుకున్నారని పేర్కొన్నారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన 1200 మంది విద్యార్థి యువజనుల త్యాగఫలితంగానే తాము ఎన్నికల్లో విజయం సాధించామని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారిగా బెల్లంపల్లికి వచ్చిన ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్.ప్రవీణ్, రాష్ట్ర నాయకులు ఎస్.నర్సింగం, జెడ్పీటీసీ సభ్యులు ఎం.సురేశ్‌బాబు, కొడిపె భారతి, అల్లి మోహన్, ఆర్.సత్తయ్య, బెల్లంపల్లి పట్టణ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు పి.సురేశ్, బి.అర్జయ్య పాల్గొన్నారు.