వర్సిటీ ప్రిన్సిపాల్ నియామకంపై నీలినీడలు
Published Sun, Jan 12 2014 2:02 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్ : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ నియామకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కారణాలేంటో గానీ అంతులేని జాప్యం జరుగుతోంది. దీనిపై వర్సిటీ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది. ప్రిన్సిపాల్‌గా ఉన్న మిర్యాల చంద్రయ్యను గత నెల 23న రెక్టార్‌గా నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త ప్రిన్సిపాల్ నియామకం మాత్రం ఇంతవరకు చేపట్టలేదు. ఈ బాధ్యతలను కూడా చంద్రయ్యకే అప్పగించారు. వాస్తవానికి, సీనియర్ ప్రొఫెసర్‌ను ప్రిన్సిపాల్‌గా నియమించాలి.
కానీ వర్సిటీ అధికారులు సీనియారిటీని గౌరవించటం లేదని పలువురు విమర్శిస్తున్నారు. 2008 జూన్ 25న యూనివర్సిటీ ఏర్పడ్డాక కీలకమైన పోస్టులను భర్తీ చేయకుండా అప్పటి వీసీ ఎస్వీ సుధాకర్, రిజిస్ట్రార్ జి.జ్ఞానమణి, అనంతరం ప్రస్తుత రిజిస్ట్రార్ వడ్డాది కృష్ణమోహన్‌లు అన్నీ తామై వ్యవహరించారు. తర్వాత ఇన్‌చార్జి వీసీగా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ ఆర్‌జీబీ భగవత్‌కుమార్ మాత్రం విమర్శలకు తావులేకుండా 2012 మార్చిలో సీనియారిటీ ప్రాతిపదికన పోర్టు ఫోలియోలను కేటాయించారు. ప్రిన్సిపాల్‌గా చంద్రయ్య, సీడీసీ డీన్‌గా గుంట తులసీరావు, ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్‌గా పెద్దకోట చిరంజీవులు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌గా తమ్మినేని కామరాజు, చీఫ్ వార్డెన్‌గా బిడ్డిక అడ్డయ్యలను నియమించారు.
వాస్తవానికి ప్రిన్సిపాల్ మినహా మిగతా పోర్టుఫోలియోలను వీసీ తన విచక్షణ మేరకు కేటాయించవచ్చు. ప్రిన్సిపాల్‌గా మాత్రం సీనియర్‌నే నియమించాలి. అలా కాకుండా చంద్రయ్యకే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించటాన్ని సీనియర్లు తప్పుపడుతున్నారు. రెక్టార్ పోస్టులో ఉన్న వ్యక్తికి అదనపు బాధ్యతలు ఇవ్వటం ఏమిటని అంటున్నారు. అయితే నిబంధనల్లో ఉన్న వెసులుబాటును వర్సిటీ అధికారులు ఉపయోగించుకుంటున్నారు. మూడేళ్లపాటు కొనసాగే రెగ్యులర్ ప్రిన్సిపాల్‌ను నియమిస్తే సీనియర్‌కు అవకాశం ఇవ్వాలి, అదే ఇన్‌చార్జిగా నియమిస్తే ప్రొఫెసర్ హోదాలో ఉన్న ఎవరికైనా ఇచ్చి ఆరు నెలల వరకు కొనసాగించవచ్చు, అవసరమనుకుంటే మళ్లీ రెన్యువల్ చేయవచ్చు. వర్సిటీ అధికారులు ఇదే చేస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు.
తప్పేం లేదు..
ఈ విషయమై రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వడ్డాది కృష్ణమోహన్‌ను న్యూస్‌లైన్ వివరణ కోరగా ఇన్‌చార్జి బాధ్యతలను ఏ ప్రొఫెసర్‌కైనా ఇవ్వవచ్చని చెప్పారు. పుర్తి స్థాయి నియామకం అయితే సీనియారిటీని గౌరవించాలన్నారు. ప్రస్తుతం సీనియర్లందరూ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నారు. వర్సిటీ పాలన సజావుగా సాగేందుకు ఇన్‌చార్జిలను నియమించటంలో తప్పులేదన్నారు.
Advertisement
Advertisement