
న్యూకాలనీ వివాహిత హత్య కేసు ఛేదన
పథకం ప్రకారం హత్య చేసిన నిందితుడు శరత్‌కుమార్
హత్య చేశాక ఒంటిపై బంగారం తీసుకుని పరారీ
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన వివాహిత హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. పొందూరు (Ponduru) మండలం మొదలవలస (Modalavalasa) గ్రామానికి చెందిన పూజారి కళావతి (53) ఒంటిపై ఉన్న బంగారు నగల కోసమే నగరానికి చెందిన అండలూరి శరత్‌కుమార్ (31) పథకం ప్రకారం హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. శనివారం (Saturday) మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.వి.రమణ, టౌన్ డీఎస్పీ సీహెచ్ వివేకానందలు వివరాలు వెల్లడించారు.
నిండా అప్పులు.. ఆపై వ్యసనాలు
శ్రీకాకుళానికి చెందిన అండలూరి శరత్‌కుమార్ (31) తల్లిదండ్రులతో తగువులాడుకుని ఇంటి నుంచి బయటకొచ్చేశాడు. సరస్వతీ మహల్ ఎదురుగా ఏవీఆర్ జనరేటర్ రిపేర్ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తూ.. న్యూకాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. వ్యసనాలకు తోడు జల్సాలు ఎక్కువగా చేసేవాడు.
పథక రచన చేశాడిలా..
నగరంలోని డీసీసీబీ కాలనీలో సూరిబాబు సుందర సత్సంగానికి పొందూరు నుంచి కళావతి భజనలు, కీర్తనలు వినడానికి వచ్చేవారు. ఏడాది కిందట శరత్‌కుమార్‌కు కళావతి పరిచయమైంది. సత్సంగానికి ఎప్పుడొచ్చినా ఒంటి నిండా బంగారు ఆభరణాలతో కళావతి కనిపించేవారు. దీంతో తన అప్పులు తీర్చేందుకు ఆమెను హతమార్చి బంగారాన్ని కాజేయాలని శరత్‌కుమార్ పథక రచన చేశాడు. ఈ క్రమంలో ఈ నెల 18న కళావతి రూమ్‌కి వస్తున్నట్లు శరత్‌కుమార్‌కు ఫోన్ చేయడంతో హత్య చేయడానికి సరైన సమయమిదేనని భావించాడు.
కళావతి మధ్యాహ్నం మూడు గంటలకు గదికి వచ్చారు. ఇదివరకు శరత్‌కుమార్ ఆమెకు వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి ఉంది. కానీ అతడు రూ.500 మాత్రమే ఇవ్వడంతో మిగతా రూ.500 కోసం వాదులాడుకున్నారు. ఈ క్రమంలో కళావతి శరత్‌కుమార్ తల్లినుద్దేశించి అనరాని మాట అనడంతో కోపోద్రిక్తుడైన శరత్‌కుమార్ వైరుతో ఆమె గొంతు బిగించి తలగడతో గట్టిగా ముఖాన్ని అదిమి చంపేశాడు. వెంటనే ఆమె ఒంటిపై ఉన్న బంగారు గాజులు రెండు, పుస్తెలతాడు, నాలుగు ఉంగరాలు, ఓ చెవిదిద్దు, సెల్‌ఫోన్లు రెండు తీసుకున్నాడు. శవాన్ని పక్కనే ఉన్న బాత్‌రూమ్‌లోకి ఈడ్చుకువెళ్లి అక్కడ పడేశాడు. గాజులు రెండూ తన వద్ద ఉంచుకుని మిగతా వస్తువులను ఒక పాలిథీన్ కవర్‌లో కట్టి ఇంటి మెట్ల కింద పెట్టి రూమ్‌కి తాళాలు వేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
తన స్నేహితుడి ఇంటిలో ఓ రాత్రి, ఆదిత్య పార్క్‌లో రెండు రాత్రులు గడిపాడు. సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్ చేసి అక్కడే ఆగి ఉన్న లారీపైకి విసిరేశాడు. తానే చంపానని బయటకు తెలిసిపోవడంతో 24న బాకర్ సాహెబ్‌పేట వీఆర్వో స్పందన అనూష వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పి ఆమె సమక్షంలో పోలీసులకు లొంగిపోయాడు. వేరే వ్యక్తికి అమ్మజూపిన రెండు గాజులనే కాక మెట్లపై దాచి ఉన్న మిగతా బంగారు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: శరత్ అనే వ్యక్తితో కళావతి సన్నిహితంగా..!