సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘సేనానీ లేడు... సైన్యమూ లేదు’అన్నట్టుగా తయారైంది జిల్లా కాంగ్రెస్ పరిస్థితి. అది కూడా పార్టీ అధికారంలో ఉండగా ఇంతటి దుస్థితికి దిగజారిపోవడం విస్మయపరిచే వాస్తవం. అధికార పార్టీ అంటేనే ఎక్కడలేని దర్పం... హోదా... సందడి కనిపిస్తుంది. ఇక అధికార పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడి వైభవం అంతా ఇంతా కాదు.. డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే కూడా అయితే ఇక చెప్పేదేముందీ!... కానీ జిల్లా కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. జిల్లా కాంగ్రెస్(డీసీసీ) అధ్యక్షుడు ఆమంచి కృష్ణమోహన్ పార్టీ కార్యాలయంవైపు కన్నెత్తి చూడటం లేదు. బోర్డు తిప్పేసిన కంపెనీలా తయారైన జిల్లా కాంగ్రెస్ .
తాజా పరిస్థితి ఇలా ఉంది... ఆమంచి ఆమడదూరం
ఆమంచి కృష్ణమోహన్ తాను డీసీసీ అధ్యక్షుడిననే విషయాన్నే మరచిపోయినట్టున్నారు. కొన్ని నెలలుగా ఆయన డీసీసీ కార్యాలయానికే రావడం లేదు. నిజం చెప్పాలంటే ఆరు నెలల క్రితం డీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన కేవలం రెండుసార్లే కార్యాలయానికి వచ్చారు. మొదటి సారి డీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి... మరోసారి ఓ సమావేశానికి హాజరయ్యారు. అంతే!... ఆ తరువాత ఇంత వరకు పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూడనే లేదు. జూన్ నుంచి ఇంతవరకు ఆయన డీసీసీ కార్యాలయానికి రానే లేదు. జులైలో పంచాయతీ ఎన్నికల కోసం కూడా డీసీసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించ లేదు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతలు తీసుకోవడానికి ఆమంచి ఇష్టపడ లేదు. పార్టీ ఓడిపోతే అందుకు మంత్రి మహీధర్‌రెడ్డిని బాధ్యుడిని చేయాలన్నది ఆయన ఉద్దేశం. చివరి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ రోజే(జులై 30) రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రకటించింది. దాంతో ఒక్కసారిగా పరిస్థితి చేయిదాటిపోయింది. దాంతో డీసీసీ కార్యాలయానికి రావాలన్న ఉద్దేశాన్ని ఆమంచి పూర్తిగా పక్కనపెట్టేశారు.
రాజీనామా ప్రహసనం
రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్ష పదవులకు రాజీనామా చేసినట్టు ఆమంచి ప్రకటించారు. కానీ ఆ రెండు రాజీనామాలు ఆమోదం పొందలేదు. దాంతో ఆమంచి ఎమ్మెల్యేగా ఎంచక్కా కొనసాగుతున్నారు. గన్‌మెన్‌తోపాటు ఎమ్మెల్యేగా అన్ని హోదాలు అనుభవిస్తున్నారు. డీసీసీ అధ్యక్ష పదవికి వచ్చేసరికి మాత్రం ఆమంచి మాటమారుస్తున్నారు. తాను రాజీనామా చేశానని చెబుతూ తప్పించుకుంటున్నారు. ఆయన అసలు ఉద్దేశం వేరుగా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
‘ప్రత్యామ్నాయం’ కోసం అర్రులు
రాష్ట్రంలో కాంగ్రెస్ దాదాపు కనుమరుగైపోయే తరణంలో డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగడానికి ఆమంచి ససేమిరా అంటున్నారు. మంత్రి మహీధర్ రెడ్డితో ఆయనకు తీవ్ర విభేదాలు ఎలాగూ ఉన్నాయి. కాబట్టి జిల్లా పార్టీ బాధ్యతలు మంత్రే స్వయంగానో తన అనుచరుల ద్వారానో చూసుకుంటారులే అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పనైపోయిందని నిర్ధారించుకున్న ఆమంచి ప్రత్యామ్నాయ అవకాశాలపై కన్నేశారు. రానున్న ఎన్నికల్లో సమైక్యాంధ్ర నినాదంతో పోటీ చేస్తానని బీరాలు పలికిన ఆమంచి తరువాత ఆ ఊసే ఎత్తడం మానేశారు. మళ్లీ సీఎం కిరణ్‌కు సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇతరత్రా అవకాశాల కోసం అర్రులు చాస్తూ విఫలయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ వ్యవహారాలను పూర్తిగా గాలికొదిలేశారు.
పార్టీ ఊసే ఎత్తని మంత్రి
మంత్రి మహీధర్ రెడ్డి తీరు కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఆయన కూడా జిల్లా కాంగ్రెస్ వ్యవహారాలను పట్టించుకోవడం లేదు. పంచాయతీ ఎన్నికల సమయంలోనే ఆయన పార్టీ వ్యవహారాల బాధ్యత తీసుకోలేదు. సాధారణంగానే పార్టీ బాధ్యతలను పట్టించుకునే అలవాటులేని ఆయన... ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ పార్టీ ఊసే ఎత్తడం లేదు. దాంతో జిల్లా కాంగ్రెస్‌లో కాస్తో కూస్తో మిగిలిన కాంగ్రెస్ శ్రేణులకు పెద్ద దిక్కులేకుండాపోయింది. కనీసం ఎన్నికల వరకైనా బండిని లాక్కురావాలన్న ధ్యాసే తమ నేతలకు లేకుండాపోయిందని విమర్శిస్తున్నారు. జిల్లాలో పార్టీని దాదాపుగా చాపచుట్టేసినట్టేనని కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.
‘సేనానీ లేడు... సైన్యమూ లేదు’
Published Sat, Nov 9 2013 4:39 AM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM
Advertisement
Advertisement