కర్నూలు(రాజ్‌విహార్): ‘బల్క్ బయ్యర్’ పేరుతో ఇకపై డీజిల్ కొనుగోలు చేసేందుకు రోడ్డు రవాణ సంస్థ కసరత్తు చేస్తోంది. ఎక్కువ మొత్తంలో డీజిల్‌ను కొనుగోలు చేస్తే తక్కువ ధరకే లభిస్తుందని భావించిన అధికారులు అందుకు కార్యచరణ మొదలుపెట్టారు. లీటరుపై సాధారణ ధర కంటే 50 పైసలు మిగులుతుందని, దీంతో ఏటా రూ.1.63 కోట్లకుపైగా ఇంధన ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేసుకోవచ్చని నివేదికలు సిద్ధం చేశారు. ఈనివేదికలను సోమవారం రీజినల్ మేనేజరు కృష్ణమోహన్ ఉన్నతాధికారులకు పంపించారు.
2013 జనవరి వరకు బల్క్ బయ్యర్ పేరుతో ఎక్కువ మొత్తంలో డీజిల్ కొనుగోలు చేసే సంస్థగా ఆర్టీసీ ఉండేది. కానీ అదే ఏడాది జనవరి 30న బల్క్ బయ్యర్ కొనుగోలుదారులపై లీటరుకు రూ.11.40ల చొప్పున పెంచింది. దీనికి తోడు మరో 40పైసల పన్ను అదనంగా చెల్లించాల్సి వస్తుంది. డీజిల్ బంకుల్లో చిల్లరగా కొనుగోలు చేసే వాటి ధర పెంచకుండా అధిక మొత్తంలో కొనుగోల చేసే సంస్థల (బల్క్ బయ్యర్)పైన మాత్రమే ఈ పెంచిన భారాన్ని అప్పట్లో వేశారు. దీంతో ఆర్టీసీ ఈ సమస్యలను అధిగమించేందుకు బల్క్ బయ్యర్‌కు బదులు చిల్లర కొనుగోలు సంస్థగా మారింది.
అప్పటి నుంచి డీజిల్‌ను ఆయా డిపోలకు సమీపంలోని డీజిల్ బంకుల వద్ద నుంచే కొనుగోలు చేసుకోవాల్సిందిగా అప్పటి వైస్‌చైర్మన్, మేనేజింగ్ డెరైక్టరు ఏకే ఖాన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈక్రమంలో స్థానిక డిపో మేనేజర్లు ఆచరణలో పెట్టారు. అప్పట్లో చిల్లరగా కొనుగోలు చేస్తే లీటరు డీజిల్ రూ.51.14లకే లభిస్తుండగా బల్క్ బయ్యర్ భారం రూ.11.40తో కలిపి లీటరు రూ.62.54 చొప్పున చెల్లించాల్సి వచ్చేది. దీంతో చిల్లర వ్యాపారిగా మారింది.
గత యూపీఏ ప్రభుత్వం డీజిల్ ధరల పెరుగుదలపై నియంత్రణ ఎత్తివేయడంతో ప్రతి నెల 1న 50 పైసల చొప్పున పెంచుతూ పోవడంతో గతంలో పెంచిన బల్క్ బయ్యర్ ధరను మించిపోయింది. ప్రస్తుతం చిల్లర కోనుగోలుపై లీటరు డీజిల్ రూ.63.70కు లభిస్తుండగా బల్క్ సంస్థలకు రూ.63.20 పడుతోంది. దీంతో ఇప్పుడు తిరిగి చిల్లర కొనుగోలుదారు నుంచి బల్క్ సంస్థగా మారేందుకు సిద్ధం అవుతోంది. ఇలా చేయడంతో ఏడాదికి రూ.1.37కోట్లు ఇందన ఖర్చులు పొదుపు అవుతాయి.
నివేదికలు పంపించాం: కృష్ణమోహన్, ఆర్‌ఎం, కర్నూలు
ప్రస్తుతం చిల్లరగా కొనుగోలు చేస్తుండటంతో లీటరు డీజిల్ రూ.63.70కి లభిస్తోంది. బల్క్ బయ్యర్‌గా ఎక్కువ మొత్తంలో కొంటే లీటర్ రూ.63.20కే వస్తుంది. దీంతో లీటరుపై 50పైసలు మిగులుతుంది. ఇదే విషయాన్ని నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు పంపించాం. అనుమతులు వస్తే ఆచరణలో పెడతాం.
‘బల్క్’ వైపు ఆర్టీసీ అడుగు
Published Tue, Sep 2 2014 2:14 AM | Last Updated on Thu, Aug 30 2018 5:54 PM
Advertisement