
కర్నూల్,సాక్షి: కర్నూలు నగరంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. బర్డ్ ప్లూ సోకి బాతులు మృతి చెందడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కర్నూలు నగరంలోని ఎన్ ఆర్ పేటను రెడ్ అలర్ట్ జోన్‌గా ప్రకటించింది.
ఎన్ఆర్ పేటలోని బెస్త రాజుకు చెందిన 15 బాతులు మృతి చెందడం, అందుకు బర్డ్ ఫ్లూ కారణమని ల్యాబ్ నుంచి నివేదిక రావడంతో చుట్టూ కిలోమీటర్ మేర రెడ్ అలర్ట్ జోన్ ప్రకటించారు. ఈ ప్రాంతంలో చికెన్, గుడ్లు అమ్మకాలు చేపట్టకుండా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఆరుగురు పశు సంవర్థక శాఖ అధికారులతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. కోళ్లు, బాతులు, ఇతర పక్షులు అకస్మాత్తుగా మరణిస్తుంటే వెంటనే తగిన సమాచారం ఇవ్వాలని పశుసంవర్థక శాఖ అధికారులు కోళ్లు, బర్డ్స్ పెంపకందారులకు సూచించారు
వేగంగా సోకుతున్న బర్డ్‌ఫ్లూ
రాష్ట్రంలో కోళ్లకు ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా (హెచ్5ఎన్1–బర్డ్ ఫ్లూ) వేగంగా సోకుతోంది. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందనే వార్త కలవరానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు మనుషులకు బర్డ్ ఫ్లూ నమోదైన ఘటనలు చోటు చేసుకోలేదని వైద్య శాఖ స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు భరోసా ఇస్తున్నారు.
పక్షుల నుంచి మనుషులకు బర్డ్ ఫ్లూ సోకే అవకాశం అత్యంత అరుదుగా ఉంటుందని స్పష్టం చేశారు. వ్యాధి బారినపడిన పక్షులకు దగ్గరగా ఉండే వ్యక్తులకు అరుదుగా ఈ వైరస్ సోకే అవకాశం ఉంటుందని, మనుషుల నుంచి మనుషులకు సోకిన సందర్భాలు లేవన్నారు. ఇక మనుషుల్లో బర్డ్ ఫ్లూ ఔట్ బ్రేక్స్ ఇప్పటి వరకూ సంభవించలేదని తెలిపారు. మనుషులకు వ్యాధి సోకినట్లైతే జ్వరం, దగ్గు, గొంతు మంట, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయన్నారు.
ఈ వ్యాధి నుంచి రక్షణ కోసం పౌల్ట్రీ ఉత్పత్తులను బాగా ఉడికించిన తర్వాతే ఆహారంగా తీసుకోవాలని, వ్యాధి బారినపడిన కోళ్లు, జంతువులకు దూరంగా ఉండాలని వైద్య శాఖ సూచిస్తోంది. ఈ తరహా కేసులు వ్యక్తుల్లో ఇప్పటి వరకు రాష్ట్రంలో వెలుగు చూడలేదు. గత పదేళ్లలో దేశ వ్యాప్తంగా రెండు హెచ్5ఎన్1, రెండు హెచ్9ఎన్2 కేసులు వెలుగు చూశాయి. 2019లో మహారాష్ట్రలో ఒకటి, 2021 జూలైలో హర్యానాలో ఒకటి, గతేడాది ఏప్రిల్, మే నెలల్లో పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్కటి చొప్పున రెండు కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment