కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: రోడ్డు రవాణా సంస్థపై డీజిల్ రేటు పెంపు రూపంలో పిడుగు పడింది. దీంతో అసలే నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీకి ధర పెంపు మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది. అన్ని రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు ముగియగానే కేంద్ర ప్రభుత్వం డిజిల్ ధరలు పెంచింది.
పెరిగిన ఈ ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈనెల 12వ తేదీ వరకు లీటరు డీజిల్ రూ.60.56కు లభిస్తుండగా ప్రస్తుతం లీటరుపై రూ.1.34 పెరిగి రూ.61.90కి చేరింది. కర్నూలు రీజియన్ (జిల్లా )లోని 11డిపోల్లో మొత్తం 970 బస్సులున్నాయి. ఇందులో అద్దెబస్సులు పోను 855 సంస్థ బస్సులున్నాయి. ఇవి రోజుకు దాదాపు 4 లక్షల కిలో మీటర్లు తిరిగి 3.90లక్షల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేస్తున్నాయి. ఇందుకు 78వేల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నారు.
పెరిగిన ధరలతో రోజుకు రూ. 1,04,520 కాగా నెలకు రూ.31,35,600 అవుతుంది. ఏడాదికి సంస్థపై రూ. 1.67 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. అంతేకాక శ్రీశైలం బ్రహ్మోత్సవాలు, ఉగాది, అహోబిలం, ఊరుకుంద జాతర, సంక్రాంతి ఇతర సందర్భాల్లో ఇతర జిల్లాల నుంచి తెప్పించే బస్సులకు సైతం డీజిల్‌ను కొనుగోలు చేయాల్సి రావడంతో ఈ భారం మరింత అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇంధన పొదుపునకు చర్యలు చేపట్టామని డిప్యూటి చీఫ్ మెకానికల్ ఇంజినీర్ శ్రీనివాసులు తెలిపారు.
ఆర్టీసీపై డీజిల్ పిడుగు
Published Wed, May 14 2014 2:05 AM | Last Updated on Fri, Sep 28 2018 3:22 PM
Advertisement