![road accident in kurnool](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/road-accident-in-kurnool.jpg.webp?itok=qVpEOJwf)
చేబ్రోలు/వెల్దుర్తి : ఒక్కొగానొక్క కుమారుడు. బాగా చదివి ప్రయోజకుడై కుటుంబానికి ఆసరాగా ఉంటాడని తల్లిదండ్రులు కలలుగన్నారు. వారి కలలను మృత్యువు పొట్టన పెట్టుకుంది. ఉన్నత విద్య చదువుకునేందుకు వెళ్లిన కుమారుడు విగతజీవిగా తిరిగిరావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామ పరిధిలోని గుంటూరు – తెనాలి రహదారిలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలుకు చెందిన ఓ యువకుడు దుర్మరణం చెందాడు.
కర్నూలుకు చెందిన లక్ష్మీరెడ్డి, ఊర్మిల దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సొంతూరు వెల్దుర్తి కాగా ఉపాధి నిమిత్తం కర్నూలుకు చేరుకుని అక్కడే స్థిర పడ్డారు. వీరి కుమారుడు మణికంఠేశ్వరరెడ్డి(25) గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం రాత్రి యూనివర్సిటీ సమీపంలో రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో మణికంఠేశ్వరరెడ్డి దుర్మరణం చెందాడు. మృతుడి తండ్రి లక్ష్మీరెడ్డి కర్నూలు నగరంలోని బళ్లారి చౌరస్తా ఏరియాలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమార్తెకు వివాహం చేశారు.
కుమారుడు మణికంఠేశ్వరరెడ్డి బీఎస్సీ అగ్రికల్చర్ డెహ్రాడూన్‌లో పూర్తి చేశాడు. ఎంబీఏ కోసం చేబ్రోలు వచ్చాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెల్దుర్తి వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బొమ్మన రవిరెడ్డి, పలువురు నేతలు, కుటుంబసభ్యులు చేబ్రోలు చేరుకున్నారు. చేబ్రోలు ఎస్‌ఐ డి.వెంకట కృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment