ముస్లింల స్థితిగతులపై అధ్యయనం
ఆత్మకూరు(పరకాల) : రాష్ట్రంలోని ముస్లింల స్థితిగతులపై బీసీ కమిషన్ అధ్యయనం చేస్తుండగా.. కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్ మంగళవారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మండలంలోని కటాక్షపూర్‌లోని కాశీ(రాళ్లు కొట్టి జీవనం గడుపుకునే) పనిచేసే కుటుంబాలను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌తో కలిసి కృష్ణమోహన్‌రావు కలుసుకున్నారు. కుటుంబాలు ఏ స్థితిలో ఉన్నాయనే వివరాలు తెలుసుకునేందుకు పలువురి గృహాలకు వెళ్లి జీవనశైలి, ఆరోగ్య స్థితిగతులు, కుటుంబపోషణ, పిల్లల చదువుల పై ఆరా తీశారు. అలాగే కటాక్షపూర్ గుట్టల్లో పనిచేసే కార్మికులను కలిసి వారి పరిస్థితులు తెలుసుకున్నారు.
తిండికీ కష్టమవుతోంది..
బీసీ కమిషన్ పర్యటన సందర్భంగా కాశీ కుటుంబాలకు చెందిన పలువురు కమిషన్ సభ్యుడు కృష్ణమోహన్, కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ ముందు తమ గోడు వెల్ల బోసుకున్నారు. తినడానికి తిండి కష్టమవుతోందని, రాళ్ల పనితో అనారోగ్యం బారిన పడుతున్నామని వాపోయారు. తమకు శాశ్వత జీవనోపాధి కల్పించడంతో పాటు పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ కుటుంబాల స్థితిగతులపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందచేస్తామని తెలిపారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ మాట్లాడుతూ కాశీ కుటుంబాలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, కార్మికులు సొసైటీ ఏర్పడితే పథకాలు అందుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహేందర్‌జీ, తహసీల్దార్ వెంకన్న, ఎంపీడీఓ నర్మద, సీఐ శ్రీనివాస్, డాక్టర్ రేష్మ, సర్పంచ్ రజిత, ఎంపీటీసీ గోరీబీ, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి నర్సింహస్వామి, సహాయ అభివృద్ధి అధికారి రమేష్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.