ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకించటం తగదు
బీజేపీకి బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు సూచన
హైదరాబాద్: ముస్లింలలో అత్యంత వెనుకబడిన వర్గాల కోసం రిజర్వేషన్ ప్రవేశపెడితే బీజేపీ వ్యతిరేకించటం సరైంది కాదని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు అన్నారు. బీసీ ‘ఇ’గ్రూపులో ఉన్న ముస్లింలలో ఫకీర్, ధోబీ, ముస్లిం, తురక చాకలి, తురక కాశ, పాములు పట్టేవారు తదితర 14 కులాలవారు అత్యంత వెనుకబడి ఉన్నారని, వీరి కోసమే రిజర్వేషన్లు ప్రవేశపెట్టారన్నారు. ‘ముస్లింలల్లో వెనుకబడిన తరగతుల కోటా పెంపు’ అంశంపై ముస్లిం ఆలోచనాపరుల వేదిక ఆధ్వర్యంలో ఆదివార మిక్కడ జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో బీసీ కమిషన్ వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. వృత్తులు కోల్పోయినవారికి జీవనోపాధి కల్పించేందుకు కమిషన్ పరంగా తోడ్పాటు కల్పిస్తామన్నారు. చాలా ఏళ్లుగా అసమానతలకు గురైన కులాలను గుర్తించి అవి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామన్నారు. 6 నెలల్లో ముస్లిం మైనార్టీల అభివృద్ధిపై సమగ్ర సర్వే చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్‌ను కోరిందని, పూర్తిగా సర్వే చేసి వాటి వివరాలను ఆన్‌లైన్ కూడా పెడతామని రాములు అన్నారు. ముస్లిం ఆలోచనాపరుల వేదిక కన్వీనర్ డానీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్కైబాబా,, వాహెద్, కవి యాకూబ్, సాంబశివరావు, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ఖుర్షీద్, హుస్సేన్, షాజహానా, దాసోజు లలిత, షేక్ ఫకీర్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ కమిషన్ చైర్మన్ దూదేకుల కులానికి క్షమాపణ చెప్పాలి: సత్తార్ సాహెబ్
బీఎస్ రాములు దూదేకుల కులానికి క్షమాపణ చెప్పాలని దూదేకుల సంఘం నాయకుడు సత్తార్ సాహెబ్ సమావేశంలో డిమాండ్ చేశారు. అంతకు ముందు బీఎస్ రాములు మాట్లాడుతూ బి.సి. ‘బి’గ్రూపులో ఉన్న దూదేకుల కులస్తులను బీసీ ‘ఈ’గ్రూపులో కలపాలనే డిమాండ్‌ను కొంతమంది వ్యతిరేకిస్తున్నారని, దీనిపై ఫిర్యాదు లు, వినతి పత్రాలు కూడా అందుతున్నాయని అనటంతో సత్తార్ సాహెబ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఎస్ రాములుకు, సత్తార్ సాహెబ్‌కు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.