సాక్షి, న్యూఢిల్లీ : అస్సాంలో నిజమైన భారత పౌరులు ఎవరో తేలుస్తూ ఎన్‌ఆర్‌సీ సోమవారం విడుదల చేసిన జాబితా వివాదాస్పదమైన నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేసిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జాతీయ ప్రయోజనాలను పణంగా పెడుతోందంటూ ప్రతిపక్షాన్ని విమర్శించారు. జాతీయ భద్రత కోసమే తామీ కసరత్తు చేయాల్సి వచ్చిందంటూ సమర్థించుకున్నారు. తన ప్రభుత్వం శరణార్థులను గౌరవంగా చూస్తుందని, అయితే శరణార్థులకు, చొరబాటుదారులకు తేడా ఉంటుందని అన్నారు.
ఆయన దష్టిలో శరణార్థులంటే హిందువులని, చొరబాటుదారులంటే ముస్లింలనే విషయం తెల్సిందే. ఆయన పార్టీ బీజేపీ కూడా మొదటి నుంచి అనుసరిస్తున్న వైఖరి ఇదే. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ దేశాల నుంచి వచ్చిన భారతీయులను శరణార్థులుగానూ, ఆ దేశాల నుంచి వచ్చిన ముస్లింలను చొరబాటుదారులుగా బీజేపీ పరిగణించడం పరిపాటే. ఇందుకోసమే మోదీ ప్రభుత్వం 2016లో భారత పౌరసత్వ చట్టంలో మార్పులు తేలేదా! 1971లో జరిగిన బంగ్లాదేశ్ విమోచన యుద్ధం సందర్భంగా బంగ్లా నుంచి ప్రజల వలసలను భారత ప్రభుత్వం స్వచ్ఛందంగా ఆహ్వానించింది. కేవలం హిందువులను మాత్రమే అనుమతిస్తామంటూ ఆ నాడు భారత ప్రభుత్వం ఎలాంటి షరతు విధించకపోవడంతో హిందూ కుటుంబాలతోపాటు ముస్లిం కుటుంబాలు కూడా వలసవచ్చి అస్సాంలో స్థిరపడ్డాయి. కాలక్రమంలో పశ్చిమ బెంగాల్ నుంచి కూడా అనేక ముస్లిం కుటుంబాలు వచ్చి అస్సాంలో స్థిరపడ్డాయి. వలసవచ్చారు కనుక వారి వద్ద కూడా ఎలాంటి డాక్యుమెంట్లు ఉండవు. అయినంత మాత్రాన వారు చొరబాటుదారులు అయిపోతారా?
వలసవచ్చిన వారో లేదా చొరబాటుదారులో ఏదైతేనేమీ 1971, మార్చి 24 తర్వాత వచ్చిన వారిని విదేశీయులుగా, అంతకుముందు నుంచే దేశంలో స్థిరపడిన వారిని దేశ పౌరులుగా గుర్తించేందుకు పెద్ద కసరత్తే చేశారు. అనంతరం విడుదల చేసిన జాబితాలో 95 శాతం హిందువులకు చోటు లభించి 90 శాతం ముస్లిలకు చోటు లభించకపోవడానికి కారణం ఏమిటీ? 1971 బంగ్లా యుద్ధం సందర్భంగా ముస్లింలే భారత దేశంలోకి ఎక్కువ వచ్చారా? భారత్‌కు పటిష్టమైన సరిహద్దులు లేకపోవడం వల్ల అస్సాంలో చొరబడిన కుటుంబాలు కూడా ఎక్కువే ఉండొచ్చు.
మనుషులంతా భూమి మీద పుట్టిన వారే. ప్రకతి వైపరీత్యాలు, జీవితంలోని సంక్లిష్టతలు, ఆకలిదప్పులు మనుషులను ఒకచోటు నుంచి మరో చోటుకు తరుముతాయి. అలాంటప్పుడు కొండ కోనలు కూడా దాటి మనుషులు వలస వస్తారు. అలా ఒకప్పుడు వలసవచ్చి స్థిరపడిన వారి వారసులే భారతీయులు కూడా. సరిహద్దులు కూడా మనం నిర్ణయించుకున్నవే. సరిహద్దులను బార్లా తెరచి విశ్వమానవులను ఆహ్వానించాలని ఎవరు చెప్పడం లేదు. సరిహద్దులు పటిష్టంగా లేకనో, గత ప్రభుత్వాల తప్పిదాల వల్లనో దేశంలోకి వచ్చి స్థిరపడిన వారిని మానవతా హదయంతో పరిగణించాల్సి ఉంటుంది. ‘ఏ ఒక్క చొరబాటుదారుడిని దేశంలో ఉండేందుకు అనుమతించం’ అంటూ అమిత్ షా హెచ్చరించడం ఓటు బ్యాంకు రాజకీయాల కిందకు రాదా? ఇది 2019 సార్వత్రిక ఎన్నికల కోసం పన్నుతున్న వ్యూహంలో భాగం కాదా?
- ఓ సెక్యూలరిస్ట్ కామెంట్
Comments
Please login to add a commentAdd a comment