బంగ్లాదేశ్‌తో మరింత సహకారం | PM Modi holds talks with Bangladesh PM Sheikh Hasina | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌తో మరింత సహకారం

Published Sun, Oct 6 2019 3:39 AM | Last Updated on Sun, Oct 6 2019 5:03 AM

PM Modi holds talks with Bangladesh PM Sheikh Hasina - Sakshi

బంగ్లాదేశ్‌లోని ప్రాజెక్టులను వీడియో లింకేజిద్వారా ఢిల్లీలో మీట నొక్కి ప్రారంభిస్తున్న మోదీ, హసీనా

న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తృతం చేసుకునేందుకు భారత్, బంగ్లాదేశ్‌ అంగీకరించాయి. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాతో సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం రెండు దేశాల అధికారులు ఏడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. తీరం ప్రాంతంలో ఉమ్మడి గస్తీ సహా మూడు ప్రాజెక్టుల ప్రారంభానికి అంగీకరించారు. కాగా, చర్చల సందర్భంగా అస్సాం ఎన్నార్సీ అంశాన్ని బంగ్లాదేశ్‌ ప్రధాని ప్రస్తావించారు. నాలుగు రోజుల పర్యటనకు ఈ నెల 3వ తేదీన భారత్‌ చేరుకున్న ప్రధాని హసీనా 3, 4 తేదీల్లో ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొన్నారు.

చర్చల సందర్భంగా ఇద్దరు ప్రధానులు వీడియో లింకేజీ ద్వారా.. బంగ్లాదేశ్‌ నుంచి ఎల్‌పీజీ గ్యాస్‌ను ఈశాన్య రాష్ట్రాలకు తరలించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టును, బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో నిర్మించిన వివేకానంద భవన్‌ను, ఖుల్నాలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించారు. అనంతరం ఇద్దరు ప్రధానులు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.  ఏడాది కాలంలో రెండు దేశాలు 12 ఉమ్మడి ప్రాజెక్టులను ప్రారంభించడం మైత్రీబంధాన్ని ప్రతిఫలిస్తోందని వారు పేర్కొన్నారు.

ఎన్నార్సీపై ప్రధాని హసీనా ఆరా
అక్రమంగా వలస వచ్చిన బంగ్లా దేశీయులను గుర్తించేందుకు ఉద్దేశించిన అస్సాం ఎన్నార్సీ విషయాన్ని ప్రధాని మోదీతో చర్చల సందర్భంగా హసీనా ప్రస్తావించారు. అయితే, అస్సాంలో ఎన్నార్సీ ప్రచురణ ప్రక్రియ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సాగుతున్న కార్యక్రమమని, దీనిపై తుది ఫలితం ఏమిటనేది తేల్చాల్సి ఉందని ప్రధాని వివరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే, మయన్మార్‌లోని రఖైన్‌ రాష్ట్రం నుంచి వచ్చిన రొహింగ్యా శరణార్థుల సమస్యను కూడా ప్రధానులిద్దరూ చర్చించారు.

శరణార్థులను వీలైనంత ఎక్కువ మంది, సత్వరమే, సురక్షితంగా వెనక్కి పంపించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. తీస్తా జలాల పంపిణీపై 2011లో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంపై తొందరగా సంతకాలు తాము కోరుకుంటున్నామని హసీనా పేర్కొనగా ఇందుకు సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారని అధికారులు వెల్లడించారు. భారత్‌ నుంచి సరుకు రవాణాకు వీలుగా చట్టోగ్రామ్, మోంగ్లా నౌకాశ్రయాలను వాడుకునేందుకు బంగ్లాదేశ్‌ అంగీకరించింది.

త్రిపురలోని సబ్రూమ్‌ పట్టణానికి అవసరమైన 1.82 క్యూసెక్కుల తాగు నీటిని బంగ్లా దేశంలోని ఫెని నది నుంచి తీసుకునేందుకు కూడా ఒప్పందం కుదిరింది. తీరప్రాంత భద్రతకు సంబంధించిన ఒప్పందం కీలకమైందని, ఇందులో భాగంగా భారత్‌ తీరం వెంబడి 25 వరకు రాడార్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్, బంగ్లాదేశ్‌ మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకునే విషయమై అధ్యయనం చేసేందుకు కమిషన్‌ ఏర్పాటు చేయాలని కూడా అంగీకారానికి వచ్చారని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement