న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య దైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేలా కీలక చర్చలు జరిపారు.
రక్షణ సంబంధాలు, రక్షణ ఉత్పత్తి, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సహకారం, సరిహద్దు నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. పరస్పర వృద్ధి ప్రాంతీయ సహకారంపై దృష్టి సారించే ఉమ్మడి కార్యక్రమాలు, ఒప్పందాలపై చర్చించారు. ఈ మేరకు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు..
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ భారతదేశానికి అతి పెద్ద అభివృద్ధి భాగస్వామని తెలిపారు. బంగ్లాతో తమ సంబంధాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, రక్షణ ఉత్పత్తి నుండి సాయుధ బలగాల ఆధునీకరణ వరకు వివరణాత్మక చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు.
బంగ్లాదేశీయులు వైద్య చికిత్స కోసం భారతదేశానికి రావడానికి వీలుగా ఈ-మెడికల్ వీసా సౌకర్యాన్ని భారతదేశం ప్రారంభిస్తుందని మోదీ ప్రకటించారు. బంగ్లాదేశ్‌లోని వాయువ్య ప్రాంత ప్రజల సౌలభ్యం కోసం రంగ్‌పూర్‌లో కొత్త అసిస్టెంట్ హైకమిషన్‌ను ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని ఆయన తెలిపారు. అదే విధంగా నేడు సాయంత్రం జరగనున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో తలబడబోయే భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ జట్లకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.
ఉగ్రవాదం, ఛాందసవాదం సరిహద్దు వద్ద శాంతియుత నిర్వహణపై తమ సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరువురు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. హిందూ మహాసముద్ర ప్రాంతం పట్ల తమ రెండు దేశాల దృష్టి కూడా ఒకటేనని.. ఇండో-పసిఫిక్ మహా సముద్రాల చొరవలో చేరాలన్న బంగ్లాదేశ్ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. తాము BIMSTEC, ఇతర ప్రాంతీయ, అంతర్జాతీయ వేదికలపై మా సహకారాన్ని కొనసాగిస్తామని చెప్పారు.
#WATCH | Delhi: PM Narendra Modi says, "India will start e-medical visa facility for people coming from Bangladesh to India for medical treatment. We have taken the initiative to open a new Assistant High Commission in Rangpur for the convenience of the people of the North West… pic.twitter.com/qNXwEWrcpl
— ANI (@ANI) June 22, 2024
గతేడాది మేలో సమావేశమై.. అనేక ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు తెలిపారు, అందులో భారత్-బంగ్లాదేశ్ మద్య గంగా నదిపై ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ ప్రారంభించి రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేసినట్లు పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా రెండు రోజుల భారత పర్యటనకు శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. ఆమెకు విమానాశ్రయంలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి కీర్తివర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత్‌లో అధికారిక పర్యటనకు వచ్చిన తొలి విదేశీ నేత హసీనాయే కావడం గమనార్హం. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి కూడా ఆమె హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment