అభివృద్ధి భాగస్వామి బంగ్లాదేశ్‌ | India, Bangladesh agree to start talks on comprehensive trade pact | Sakshi
Sakshi News home page

అభివృద్ధి భాగస్వామి బంగ్లాదేశ్‌

Jun 23 2024 5:32 AM | Updated on Jun 23 2024 5:32 AM

India, Bangladesh agree to start talks on comprehensive trade pact

సంబంధాలు బలపడాలి: మోదీ 

బంగ్లా ప్రధాని హసీనాతో భేటీ  

సమగ్ర ఆర్థిక ఒప్పందంపై మళ్లీ చర్చలకు నిర్ణయం 

న్యూఢిల్లీ:  సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సీఈపీఏ)పై చర్చలు ప్రారంభించాలని, ఇరు దేశాల మధ్య  సంబంధాలను మరింత బలోపేతం చేసుకొనే దిశగా ప్రణాళిక రూపొందించుకోవాలని భారత్, బంగ్లాదేశ్‌ నిర్ణయించుకున్నాయి. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌ వచ్చిన బంగ్లా ప్రధానమంత్రి షేక్‌ హసీనాతో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

 ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార వాణిజ్యపరమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు. మయన్మార్‌ పరిణామాలతోపాటు రోహింగ్యా కాందిశీకుల అంశంపై అభిప్రాయాలు పంచుకున్నారు. అనంతరం సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. భారత్‌కు బంగ్లాదేశ్‌ అతిపెద్ద అభివృద్ధి భాగస్వామి అని మోదీ అన్నారు. 

బంగ్లాదేశ్‌తో సంబంధ బాంధవ్యాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా సీఈపీఏపై చర్చలు ప్రారంభించామని నిర్ణయించినట్లు తెలిపారు. రక్షణ రంగంలో పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించామన్నారు. రక్షణ ఉత్పత్తుల తయారీ, సైనిక దళాల ఆధునీకరణ విషయంలో ఇరుదేశాలు సహకరించుకోవాలని ఆకాంక్షించారు.

భారత్‌ విశ్వసనీయ మిత్రదేశం: హసీనా  
ఇండో–పసిఫిక్‌ కార్యక్రమంలో చేరాలన్న బంగ్లాదేశ్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మోదీ చెప్పారు. ‘‘ఇరు దేశాల బంధానికి పౌరుల మధ్య సంబంధాలే పునాది. వైద్య సేవల కోసం వచ్చే బంగ్లా పౌరులకు ఈ–మెడికల్‌ వీసా కలి్పస్తాం. బంగ్లాదేశ్‌లోని రంగపూర్‌లోని కొత్తగా అసిస్టెంట్‌ హైకమిషన్‌ కార్యాలయం ఏర్పాటు చేయనున్నాం. 1996 నాటి గంగా నది నీటి ఒప్పందాన్ని నవీకరించడానికి సాంకేతిక చర్చలు ప్రారంభిస్తాం. 

తీస్తా నది పరిరక్షణ, నిర్వహణపై చర్చించడానికి బంగ్లాదేశ్‌కు టెక్నికల్‌ టీమ్‌ను పంపుతాం’’ అని ప్రధాని వివరించారు. సుస్థిరమైన, సౌభాగ్యవంతమైన, ప్రగతిశీల బంగ్లాదేశ్‌ను బంగబంధు షేక్‌ ముజిబుర్‌ రెహా్మన్‌ కలలుగన్నారని, ఆ కలను నిజం చేయడానికి తమవంతు సహకారం అందిస్తామని నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్‌ తమకు అతిపెద్ద పొరుగు దేశమని, తమకు అత్యంత విశ్వసనీయ మిత్రదేశమని షేక్‌ హసీనా పునరుద్ఘాటించారు. భారత్‌తో సంబంధాలకు అత్యధిక విలువ ఇస్తున్నామని ఆమె పునరుద్ఘాటించారు.

10 ఒప్పందాలపై సంతకాలు  
డిజిటల్, సముద్రయానం, సముద్ర వనరుల వినియోగం, రైల్వే, అంతరిక్షం, పర్యావరణ పరిరక్షణకు గ్రీన్‌ టెక్నాలజీ, ఆరోగ్యం, వైద్య వంటి కీలక రంగాల్లో సహకారం పెంపొందించుకోవడమే లక్ష్యంగా భారత్, బంగ్లాదేశ్‌ శనివారం 10 ఒప్పందాలపై సంతకాలు చేశాయి.  

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో షేక్‌ హసీనా భేటీ 
న్యూఢిల్లీ:  వేర్వేరు రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకొనే దిశగా భారత్, బంగ్లాదేశ్‌ వేగంగా ముందుకు సాగుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. నూతన రంగాల్లో సహకారం పెంపొందించుకుంటున్నాయని, రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలను ఈ సహకారమే నిర్ణయిస్తుందని చెప్పారు. శనివారం రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్ముతో బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా సమావేశమయ్యారు. భారత్, బంగ్లాదేశ్‌ మధ్య సంబంధాలను బలోపేతం చేసుకొనేలా కలిసి పనిచేయాలని నిర్ణయానికొచ్చారు. షేక్‌ హసీనాను కలవడం సంతోషంగా ఉందని ముర్ము పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement