
పాకిస్తాన్ అణు స్థావరాలు ఇక్కడ ఉన్నట్లు గతంలో కథనాలు
కిరానాపై దాడులను తోసిపుచ్చిన భారత వైమానిక దళం
న్యూఢిల్లీ/ ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌లోని కిరానా హిల్స్ కొండప్రాంతంపై బాంబులు వేశారనే వార్తలను భారత్ పూర్తిగా తోసిపుచ్చింది. పాకిస్తాన్ అణు స్థావరాల జోలికి వెళ్లలేదని ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి సోమవారం స్పష్టంచేశారు. ‘‘ ఆ కొండలో అణుస్థావరం ఉన్నట్లు మాకైతే తెలీదు. ఇప్పుడు మీరు చెప్తేనే తెల్సింది. రహస్యం చెప్పినందుకు థాంక్యూ’’ అని ఏకే భారతి సరదాగా మాట్లాడారు. తర్వాత సీరియస్‌గా సమాధానం చెప్పారు.
‘‘ పాక్ అణుస్థావరాలపై భారత్ ఎలాంటి దాడులు చేయలేదు. ముఖ్యంగా మీరు చెబుతున్న కిరానా న్యూక్లియర్ బేస్‌పై బాంబులు వేయలేదు’’ అని సోమవారం మీడియా ప్రతినిధులకు ఏకే భారతి స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో ఈ కిరానా కొండల గురించి చర్చ మొదలైంది. పాకిస్తాన్ అణుస్థావరాలు భద్రంగా ఉన్నాయా?. వాటిపై నిజంగానే భారత్ దాడులు చేసిందా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కిరానా హిల్స్ విశేషాల కోసం నెటిజన్లు ఆన్‌లైన్‌లో తెగ వెతికేస్తున్నారు.
కొండల్లో అణుబాంబులు!?
పాకిస్తాన్ తన అణువార్‌హెడ్‌లను పంజాబ్ ప్రావిన్స్‌లోని సర్గోదా జిల్లాలోని కిరానా కొండల్లో దాచిందని దశాబ్దాల క్రితం వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఆపరేషన్ సిందూర్ పేరిట భారత వాయుసేన ఇక్కడ కూడా కొన్ని క్షిపణులు, బాంబులను పడేసిందని సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ కొండల్లో పేలుళ్లు వినిపించాయని, కనిపించాయంటూ కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. రక్షణ శాఖ పరిధిలోని అణు విభాగానికి సంబంధించిన స్థావరం ఈ కొండల్లో ఉందని తెలుస్తోంది.
ఆపరేషన్ సిందూర్ కొనసాగింపులో భాగంగా పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ దాడులుచేయడం తెల్సిందే. రావల్పిండి సమీపంలోని నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌పైనా క్షిపణులు వేసింది. ఈ ఎయిర్‌బేస్‌కు అత్యంత సమీపంలోనే పాక్ ‘స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్’ ఉంది. పాక్ అణు వార్‌హెడ్‌ల నిర్వహణ బాధ్యతలను ఇదే చూసుకుంటుంది. ఎయిర్‌బేస్‌పై దాడిచేసినప్పుడే స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్‌పైనా భారత్ దాడి చేసిందని వార్తలొచ్చాయి. అదీగాక ముషాఫ్ ఎయిర్‌బేస్‌పైనా భారత్ దాడిచేసింది.
ఈ బేస్ అడుగుభాగంలోనే అణువార్‌హెడ్‌ల నిల్వకేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. సర్గోదా ఎయిర్‌బేస్‌కు రోడ్డుమార్గంలో కిరానా హిల్స్ కేవలం 20 కి.మీ.ల దూరంలో ఉంది. కుషాబ్ అణుకేంద్రానికి 75 కి.మీ.ల దూరంలో ఉంది. అణ్వాయుధంలో వాడే ప్లుటోనియం తయారీకోసం నాలుగు భారజల రియాక్టర్లు కుషాబ్‌లో పనిచేస్తున్నట్లు 3 నెలల క్రితం వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ నివేదించింది.
68 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఆ కొండప్రాంతంలో 39 కి.మీ.ల పరిధిని మిలటరీ జోన్‌గా పాక్ ఏనాడో ప్రకటించింది. ఇక్కడ బహుళ అంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటుచేసింది. ఇక్కడ స్పెషల్ వర్క్స్ శాఖ 10 సొరంగాలను తవ్వింది. పొరపాటున లోపల పేలుళ్లు జరిగినా సమీప జనావాసాల్లో ప్రాణనష్టం జరక్కుండా సొరంగాల గోడలను అత్యంత మందంగా నిర్మించారని భారత ఆర్మీలో రిటైర్డ్ కల్నల్ వినాయక్ భట్ ఎనిమిదేళ్ల క్రితం ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.