
సోమవారం ఉదయం నుంచే కార్యకలాపాలు ప్రారంభం
ఆదివారం రాత్రి ఎలాంటి ఘర్షణ లేకపోవడంతో నిషేదాజ్ఞలు రద్దు చేసిన ఏఏఐ
న్యూఢిల్లీ: భారత్–పాక్ ఉద్రిక్తతల కారణంగా మే 9 నుంచి మూసివేసిన విమానాశ్రయాలన్నింటినీ భారత్ సోమవారం తిరిగి ప్రారంభించింది. కాల్పుల విరమణ చర్చల మధ్య పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు తగ్గడంతో 32 విమానాశ్రయాలు తిరిగి తెరిచారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి కేంద్రం సోమవారం ఉదయం నోటామ్ (ఎయిర్‌మెన్‌కు నోటీసు) జారీ చేసింది.
‘‘15 మే 2025 ఉదయం 05:29 గంటల వరకు తాత్కాలికంగా పౌర విమాన కార్యకలాపాల కోసం మూసివేసిన 32 విమానాశ్రయాలు ఇప్పుడు తక్షణమే సేవల్లోకి వస్తాయి’’అని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులు విమాన స్థితిని నేరుగా ఎయిర్‌లైన్స్‌తో తనిఖీ చేసుకోవాలని, మార్పుచేర్పులకోసం ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్లను పరిశీలించాలని సిఫార్సు చేసింది. దీంతో చండీగఢ్, శ్రీనగర్ సహా ప్రభావిత ప్రాంతాల్లోని విమానాశ్రయాలు తెరుచుకున్నాయి. క్రమంగా విమాన కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యాయి.
3 గంటల ముందే విమానాశ్రయానికి...
విమానాశ్రయాలలో కఠినమైన భద్రతా ప్రోటోకాల్ కోసం గురువారం జారీ చేసిన ఉత్తర్వులు మే 18 వరకు అమలులో ఉంటాయి. విమానాశ్రయాలలోకి సందర్శకులకు అనుమతి ఉండదు. చెక్–ఇన్, బోర్డింగ్ సజావుగా జరిగేందుకు ప్రయాణికులు విమానం షెడ్యూల్ చేసిన సమయానికి కనీసం మూడు గంటల ముందే సంబంధిత విమానాశ్రయాలకు చేరుకోవాల్సి ఉంటుంది.
క్రమంగా రాకపోకల పెరుగుదల
ఆదేశాన్ని అనుసరించి మే 12 నుంచి ఉదయం 10 గంటలకు చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయం విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. శ్రీనగర్, అమృత్‌సర్, లూథియానా, భుంటార్, కిషన్‌గఢ్, పాటియాలా, సిమ్లా, కాంగ్రా–గగ్గల్, భటిండా, జైసల్మేర్, జోధ్‌పూర్, బికనీర్, హల్వారా, పఠాన్‌కోట్, జమ్మూ, లేహ్, ముంద్రా, జామ్‌నగర్, హిరాసర్, భుందార్, పోర్‌బందర్, రాజ్‌కోట్, సర్సావా, సిమ్లా, థోయిస్, ఉత్తరలై విమానాశ్రయాలు కూడా తమ కార్యకాలాపాలను ప్రారంభించాయి. తమ విమానాల రాకపోకలు క్రమంగా పెరుగుతాయని ఇండిగో తెలిపింది. విమానాల షెడ్యూలింగ్‌లో కొంత జాప్యం ఉంటుందని, వివరాల కోసం ప్రయాణికులు తమ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించింది. ప్రయాణికులు ప్రయాణ ప్రణాళికలను పునఃపరిశీలించాలనుకుంటే.. మే 22 వరకు మార్పు, రద్దు రుసుము మినహాయింపులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.