
మార్గాల పరిశీలనకు భారత్, పాక్ అంగీకారం
సైనిక చర్యకు తెర దించడంపై డీజీఎంఓల చర్చ
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: సరిహద్దుల వెంబడి బలగాల మోహరింపును కనీస స్థాయికి తగ్గించే అంశాన్ని పరిశీలించేందుకు భారత్, పాకిస్తాన్ అంగీకరించాయి. ఇరుదేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) మధ్య సోమవారం ఈ అంశంపై కీలక చర్చలు జరిగాయి. పాక్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా, భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ హాట్‌లైన్‌లో 45 నిమిషాలకు పైగా సంప్రదింపులు జరిపారు. సైనిక చర్యకు తెర దించే మార్గాలపైనా చర్చ జరిపారు.
ఇరువైపుల నుంచీ ఒక్క తూటా కూడా కాల్చకుండా సంయమనం పాటించాలని గత భేటీలో తీసుకున్న నిర్ణయం అమలు దిశగా చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాక జరిగిన తొలి ఉన్నతస్థాయి సమావేశం ఇదే. తొలుత నిర్ణయించినట్టు మధ్యాహ్నం 12 గంటలకు బదులు భేటీ సాయంత్రం ఐదింటికి జరిగింది. మే 10న కాల్పుల విరమణకు డీజీఎంఓ స్థాయిలోనే సూత్రప్రాయంగా అంగీకారం కుదరడం తెలిసిందే. అనంతర పరిణామాలు తదితరాలపై తాజా భేటీలో డీజీఎంఓలు ఎవరి వాదన వారు వినిపించినట్లు తెలుస్తోంది. భేటీపై అధికారికంగా ప్రకటన రాలేదు. వివరాలను త్వరలో వెల్లడిస్తామని సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.