
ఎవరికీ ఎటువంటి అపాయం వాటిల్లలేదన్న రాస్‌కాస్మోస్
న్యూఢిల్లీ: సోవియట్ యూనియన్ హయాంలో 53 ఏళ్ల క్రితం ప్రయోగించిన అంతరిక్ష నౌక తన ప్రస్థానాన్ని ముగించుకుంది. విఫలమైన ‘కాస్మోస్ 482’శనివారం ఉద యం భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అండమాన్ దీవికి పశ్చిమాన 560 కిలోమీటర్ల దూరంలో హిందూ మహా సముద్రంలో పడిపోయింది. కాస్మోస్ కారణంగా ఎవరికీ ఎటువంటి అపాయం కలగలేదని రష్యా అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ ప్రకటించింది.
దీని గమనాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఈయూ స్పేస్ సర్వైలెన్స్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సహా పలు అంతరిక్ష సంస్థలు దగ్గర్నుంచి పరిశీలిస్తూ వస్తున్నాయి. ఇటీవల ఇది భూ వాతావరణంలో ప్రవేశించినట్లు జర్మన్ రాడార్ స్టేషన్ గుర్తించిన విషయాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. అత్యంత వేడి వాతావరణంతో ఉండే శుక్రగ్రహం లక్ష్యంగా ప్రయోగించిన గోళా కార 500 కిలోల ‘కాస్మోస్’కు టైటానియంతో కూడిన రక్షణ కవచం ఉంది.
అందుకే ఇది భూవాతావరణంలో ప్రవేశించాక మండిపోకుండా యథాతథంగా పడిపోయింది. అంతర్జాతీయ అంతరిక్ష నిబంధనల ప్రకారం.. కాస్మోస్ శకలాలు రష్యాకే చెందుతాయి. ఒక వేళ భూమిపై పడినా దీనితో ప్రమాదం కలిగే అవకాశాలు చాలా తక్కువని నిపు ణులు తెలిపారు. కాస్మోస్‌తో భూమ్మీదున్న ప్రతి 10 లక్షల మందిలో ఒక్కరికి మాత్రమే ప్రమాదం సంభవిస్తుందని ఏరోస్పేస్ కార్పొరేషన్ అంచనా వేసింది.