ముస్లిం పురుషుల పార్టీ కాంగ్రెస్‌! | Congress is a party for Muslim men: PM Modi | Sakshi
Sakshi News home page

ముస్లిం పురుషుల పార్టీ కాంగ్రెస్‌!

Published Sun, Jul 15 2018 2:31 AM | Last Updated on Fri, Mar 29 2019 6:00 PM

Congress is a party for Muslim men: PM Modi - Sakshi

వారణాసిలో జరిగిన సభలో మోదీ, యూపీ గవర్నర్‌ రామ్‌ నాయక్, సీఎం యోగి

ఆజంగఢ్‌: కాంగ్రెస్‌ పార్టీ కేవలం ముస్లిం పురుషుల పక్షానే నిలుస్తుందని ప్రధాని మోదీ∙విమర్శలు చేశారు. ట్రిపుల్‌ తలాక్‌పై వీరు అనుసరిస్తున్న ధోరణే ఇందుకు నిదర్శనమన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో–ఘాజీపూర్‌లను అనుసంధానించే 340 కిలోమీటర్ల పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేకు (రూ.23వేల కోట్లు విలువైన) ఆజంగఢ్‌లో మోదీ శంకుస్థాపన చేశారు. అక్కడ ఏర్పాటుచేసిన సభలో కాంగ్రెస్‌ సహా విపక్షాలపై నిప్పులు చెరిగారు.

రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మోదీ విమర్శలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘ముస్లిం మహిళల కష్టాలపై విపక్ష పార్టీల అసలు రంగు బయటపడింది. మహిళల జీవితాల్లో వెలుగు తేవాలని మేం చూస్తుంటే విపక్ష పార్టీలు  ముస్లిం మహిళల జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. ట్రిపుల్‌ తలాక్‌ కారణంగా ముస్లిం మహిళలు ఇబ్బందులు పడకుండా చూసుకుంటానని భరోసా ఇస్తున్నా’ అని అన్నారు.

ట్రిపుల్‌ తలాక్‌ను అడ్డుకుంటూ..
‘కాంగ్రెస్‌ ముస్లింల పార్టీ అని ఆ పార్టీ అధ్యక్షుడు చెప్పినట్లు వార్తాపత్రికల్లో చదివాను. దీనిపై చర్చ జరుగుతోంది. సహజవనరులపై ముస్లింలకే తొలి హక్కు ఉంటుందని ప్రధానిగా మన్మోహన్‌ ఆనాడు అన్నారు. కాంగ్రెస్‌ ముస్లిం పురుషుల కోసమేనా?  ముస్లిం మహిళల హక్కులను గౌరవించే అవకాశం మీ పార్టీలో ఉందా? ట్రిపుల్‌ తలాక్‌ను అడ్డుకునేందుకు రాజ్యసభ జరగకుండా చేస్తున్నారు’ అని మండిపడ్డారు. లోక్‌సభలో ఆమోదం పొందిన తలాక్‌ బిల్లును రాజ్యసభలో విపక్షాలు అడ్డుకోవడం తెల్సిందే. కాంగ్రెస్,  విపక్షాలు బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా.. బీజేపీ మాత్రం ఆ పార్టీలు బిల్లును అడ్డుకోవాలని చూస్తున్నాయంది. ‘ట్రిపుల్‌ తలాక్, నిఖా హలాలా బాధితులను కలవండి. వారి బాధలేంటో అర్థం చేసుకోండి’ అని విపక్షాలను ప్రధాని కోరారు.  

నాలుగేళ్ల కృషికి ఫలితమిది
వారణాసి దుస్థితికి గత ప్రభుత్వాల విధానాలే కారణమని మోదీ విమర్శించారు. వారణాసిలో జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడారు. ‘వారణాసిలో మార్పు ఇప్పుడిప్పుడే కనబడుతోంది. మా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతోనే ఈ మార్పు సాధ్యమైంది. గత ప్రభుత్వాలు వారణాసిని పూర్తిగా విస్మరించాయి’ అని అన్నారు. ‘గతంలో బద్ధశత్రువులైన పార్టీలు (పరోక్షంగా బీఎస్పీ, ఎస్పీలను పేర్కొంటూ) ఇప్పుడు ఒక్కటయ్యాయి. దళితులు, వెనుకబడిన వర్గాలకు మాయమాటలు చెప్పి ఓట్లు అడిగిన వీరు గెలిచాక తమ జేబులు నింపుకుంటున్నారు’ అని విమర్శించారు. వారణాసితోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు లబ్ధి చేకూర్చే దాదాపు రూ.వెయ్యికోట్ల పనులను మోదీ ప్రారంభించారు.

అది మా ఆలోచనే: అఖిలేశ్‌
తమ ప్రభుత్వం చేసిన ఆలోచనకు ప్రతిరూపమే ఈ పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వే అని యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ అన్నారు. తమ ప్రాజెక్టులనే బీజేపీ అమల్లోకి తెస్తోందన్నారు. ‘ఈ ప్రాజెక్టుకు మేం సమాజ్‌వాదీ పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ అని పేరుపెట్టాం. కానీ సమాజ్‌వాదీని పక్కనపెట్టిన బీజేపీ ఇది తన ఘనతగా చెప్పుకుంటోంది’ అని లక్నోలో విమర్శించారు. ఈ విమర్శలను సీఎం యోగి తిప్పికొట్టారు. ఎస్పీ ప్రభుత్వం భూసేకరణ, పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే టెండర్లకు పిలిచి చేతులు దులుపుకుందని ఆయన వెల్లడించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement