![Dedicated BC Commission report in two days: Telangana](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/telangaan-logo_0.jpg.webp?itok=QteRQDd0)
క్షేత్రస్థాయి కసరత్తు, అర్జీలు, ఫిర్యాదుల పరిశీలన పూర్తి
రేపు లేదా ఎల్లుండి ప్రభుత్వానికి సమర్పించే అవకాశం
ఈ నివేదిక ఆధారంగానే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన తుది నివేదికపై కసరత్తును డెడికేటెడ్ బీసీ కమిషన్ దాదాపుగా పూర్తి చేసింది. తుది మెరుగులు అనంతరం రెండ్రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు సిద్ధమవుతోంది. ఈ నివేదిక ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయనుండడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. కోర్టు తీర్పునకు లోబడి రిజర్వేషన్ల సీలింగ్‌లో మార్పు లేకుండా ఈ కమిషన్ సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లుసమాచారం. నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం స్థానిక రిజర్వేషన్లు ఖరారు చేస్తుందని, ఆ తర్వాత స్థానిక ఎన్నికలకు నగారా మోగే అవకాశం ఉందని తెలుస్తోంది.
మూడు నెలలు కసరత్తు
డెడికేటెడ్ కమిషన్ దాదాపు మూడు నెలలు బీసీ రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు చేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన, దానికి అనుగుణంగా ప్రభుత్వానికి సూచనలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ 4వ తేదీన డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్‌కు చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావును, సభ్య కార్యదర్శిగా బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి బి.సైదులను నియమించింది. నెలరోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని పేర్కొంది.
ప్రణాళిక శాఖ నుంచి గణాంకాల సేకరణ
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే గణాంకాలను రాష్ట్ర ప్రణాళిక శాఖ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బీసీ జనాభా, ఇతర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రణాళిక శాఖ డెడికేటెడ్ కమిషన్‌కు సమర్పించినట్లు సర్వేకు సంబంధించి ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కాగా ఆ గణాంకాలను నివేదిక రూపకల్పనలో డెడికేటెడ్ కమిషన్ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటనలు, బహిరంగ విచారణలు చేపట్టడంతో పాటు కమిషన్ కార్యాలయంలో పలు దఫాలుగా వినతులు, ఆర్జీలు, అభ్యంతరాలను స్వీకరించింది. అవన్నీ లోతుగా పరిశీలించింది. అదే విధంగా తెలంగాణ బీసీ కమిషన్ చేపట్టిన అధ్యయనాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించి విశ్లేషించినట్లు తెలిసింది. అన్ని అంశాలు, గణాంకాలు క్రోడీకరించిన కమిషన్ తుది నివేదికను కొలిక్కి తీసుకు వచ్చినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment