మార్చండి.. మా కులాన్నీ చేర్చండి | Petitions to BC Commission: Telangana | Sakshi
Sakshi News home page

మార్చండి.. మా కులాన్నీ చేర్చండి

Published Sun, Nov 3 2024 6:01 AM | Last Updated on Sun, Nov 3 2024 6:01 AM

Petitions to BC Commission: Telangana

బీసీ కమిషన్‌కు వినతుల వెల్లువ

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ‘బీసీల్లోని ఏబీసీడీఈ వర్గాలను పునర్‌వర్గీకరణ చేయాలి. బీసీ కులాలను అవమాన పరిచేవారిని కట్టడి చేసేందుకు ‘బీసీ అట్రాసిటీ యాక్ట్‌’ను తీసుకు రావాలి. దూదేకుల కులం వారిని బీసీ–డీ నుంచి బీసీ–సీలోకి, సగర ఉప్పర కులçస్థులను బీసీ–డీ నుంచి బీసీ–ఏ లోకి, ముదిరాజ్‌లను బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి, ఒడ్డెర కులస్థులను బీసీ–ఏ నుంచి షెడ్యూల్‌ తెగ (ఎస్‌టీ)లోకి మార్చాలి’అని శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో రాష్ట్ర బీసీ కమిషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆయా వర్గాల నుంచి వినతులు వెల్లు్లవెత్తాయి.

 స్థానిక సంస్థల్లో కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాను ఖరారు చేసే అంశంపై బీసీ కమిషన్‌ ఆయా వర్గాలనుంచి అభిప్రా యాలను సేకరిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కులాలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని, ఇంతవరకు రాజకీయ ప్రాతినిధ్యంలేని కులాలకు అవకాశం ఇవ్వాలని, వీరముష్టి పదం తొలగించి ఆ కులం వారికి ‘వీరభద్ర’పదాన్ని వాడాలని కమిషన్‌కు విన్నవించుకు న్నారు. రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ గోపిశెట్టి నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మిలు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, బీసీ కులసంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించారు.

ఇది బృహత్తర కార్యక్రమం: గోపిశెట్టి నిరంజన్‌
తెలంగాణలో స్థానిక సంస్థల వారీగా రిజర్వేషన్‌ దామాషాను ఖరారు చేసేందుకు ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని బీసీ కమిషన్‌ చైర్మన్‌ గోపిశెట్టి నిరంజన్‌ అన్నారు. బహిరంగ విచారణలో మొత్తం 235 అభ్యర్థనలు కమిషన్‌కు అందాయని తెలిపారు. హనుమకొండలోని బాలికల హాస్టల్‌లో వసతులు సరిగా లేవని ఫిర్యాదు అందిందని ఆ సమస్యలకు పరిష్కారం చూపుతామని నిరంజన్‌ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్‌ అమలుపై హైకోర్టు ఏ నిర్ణయం తీసుకున్న గౌరవిస్తామన్నారు. కానీ, ఇప్పటివరకు హైకోర్టు తీసుకున్న నిర్ణయాలు, ఆదేశాలు తమకు అందలేదన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement