బెనిఫిట్‌ షో అవసరమేముందో చెప్పండి | Telangana High Court hears petitions challenging Game Changer ticket price hike | Sakshi
Sakshi News home page

బెనిఫిట్‌ షో అవసరమేముందో చెప్పండి

Published Fri, Jan 10 2025 2:07 AM | Last Updated on Fri, Jan 10 2025 2:07 AM

Telangana High Court hears petitions challenging Game Changer ticket price hike

సినిమా టికెట్ల ధరల పెంపుపై హైకోర్టు అసహనం.. అలా మెమోలు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్న

వేకువజాము, అర్ధరాత్రి అనుమతులు ఇస్తారా?

ప్రజల భద్రతపై ఆలోచించాలి కదా అని వ్యాఖ్య

‘గేమ్‌ఛేంజర్‌’ టికెట్ల ధర పెంపుపై పిటిషన్‌

నేడు విచారణ చేపడతామన్న జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇవ్వడంలో సర్కార్‌ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రముఖ చిత్రాలకు బెని ఫిట్‌ షోలకు, ఇష్టం వచ్చిన సమయాల్లో ప్రదర్శనకు ఎందుకు అనుమతి ఇస్తున్నారని, వాటి అవసరం ఏముందని ప్రశ్నించింది. ప్రజల భద్రత గురించి కనీసం అలోచించాల్సిన అవస రం లేదా అని నిలదీసింది. 16 ఏళ్లలోపు పిల్ల లను అర్ధరాత్రి, తెల్లవారుజాము ప్రదర్శనలకు అను మతించకూడదని సూచించింది. ఇలాంటి అంశాల్లో ఒక్క చిత్రంపై ఇలా పిటిషన్‌ దాఖలు చేయడం కాకుండా.. ప్రజా ప్రయో జన వ్యాజ్యంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. దిల్‌ రాజు నిర్మాతగా శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ నటించిన గేమ్‌ ఛేంజర్‌ సినిమా టికెట్‌ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 

జనవరి 10న మల్టీప్లెక్స్‌ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై అదనంగా రూ. 150, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో ఒక్కో టికె ట్‌పై అదనంగా రూ. 100 చొప్పున పెంచుకునేందుకు వెసులు బాటు కల్పించింది. జనవరి 11 నుంచి రోజూ 5 షోల నిర్వహణకు అనుమతిస్తు న్నట్లు పేర్కొన్నారు. 11 నుంచి 19 వరకూ మల్టీ ప్లెక్సులలో టికెట్‌పై అదనంగా రూ. 100, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో టికె ట్‌పై అదనంగా రూ. 50 రూపాయల చొప్పున ధరలు పెంచు కోడానికి సర్కార్‌ అనుమతిచ్చింది. అర్ధరాత్రి బెనిఫిట్‌ షోలకు మాత్రం సర్కార్‌ నిరాకరించింది. ఇదిలా ఉండగా, ఈనెల 8న ఇచ్చిన టికెట్‌ ధరల పెంపు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ హైద రాబాద్‌కు చెందిన కూరగాయల వ్యాపారి గొర్ల భరత్‌రాజ్‌ లంచ్‌ మోషన్‌ రూపంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖ లు చేశారు. జనవరి 10న ఉదయం 4.30 గంటల నుంచి సిని మా ప్రదర్శనకు అనుమతివ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

పిల్‌గా విచారణ చేయాల్సిన అంశం...: ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. టికెట్‌ ధరల పెంపు నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. గేమ్‌ఛేంజర్‌ సినిమా టికెట్‌ ధరల పెంపు ఉత్తర్వులను నిలుపుదల చేసే లా ఆదేశాలివ్వాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయం సినిమా రెగ్యులేషన్స్‌ రూల్స్‌ 1970, సినిమాస్‌ లైసెన్సింగ్‌ షరతులకు విరుద్ధమని తెలిపారు. పుష్ప–2 బెనిఫిట్‌ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి తర్వాత.. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్‌ షోలకు అనుమతి ఉండదని డిసెంబర్‌ 21న అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారన్నారు.

 కనీసం పక్షం రోజులైనా కాకముందే వేకువజామున 4 గంటలకే షో నిర్వహించుకునేలా అనుమతులు ఇచ్చారన్నారు. ప్రజలకు చెప్పేదొకటి.. చేసేదొకటి అన్న తీరుగా సర్కార్‌ వ్యవహారం ఉందని వెల్లడించారు. వాదనలు విన్న న్యాయ మూర్తి.. ఈ అంశంపై పిల్‌ వేస్తే మరింత అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. పిటిషనర్‌ న్యాయవాది కోర డంతో విచారణ నేటికి వాయిదా వేశారు. కాగా, తగినంత పార్కింగ్‌ లేకపోవడం, స్క్రీనింగ్‌ల మధ్య తక్కువ సమయం వంటి ఇబ్బందులపైనా న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజల తొక్కిసలాటకు దారితీస్తుందని పేర్కొన్నారు.

హక్కులు హరించడమే..: హైకోర్టు
‘సినిమా ప్రదర్శనకు సమయపాలన ఉండాలి. అర్ధరాత్రి, వేకువజామున అనుమతులు ఇవ్వడం మానవ హక్కుల ఉల్లంఘన లాంటిదే. ఇది ప్రజల నిద్రపోయే హక్కును హరించడమే అవుతుంది. ఇలా ఎప్పటికప్పుడు చిత్రాలకు వెళ్లే వాడి ఆరోగ్యం ఏమవుతుంది?’ ‘పిటిషనర్లు కూడా చిత్రం విడుదలకు ముందు పిటిషన్‌ వేసి ఇక తర్వాత పట్టించుకోవడం లేదు. వేళాపాళా లేని షోలకు 16 ఏళ్లలోపు చిన్నారులను కూడా రద్దీ ఉండే చిత్రాలకు తీసుకొస్తున్నారు.. సర్కార్‌ కూడా అనుమతిస్తోంది. ఇది సమంజసం కాదు. ప్రజలు బయటకు వెళ్లడానికి, లోనికి రావడానికి స్క్రీనింగ్‌ల మధ్య సమయం ఉండాలి’ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement