benefit show
-
ఎవడబ్బ సొమ్మని బెనిఫిట్ షోలు వేస్తున్నారు?
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): పుష్ప2 సినిమాతో రికార్డులు బద్దలు కొట్టిన అల్లు అర్జునే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుట్రలు పన్నుతున్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు. గత కొంతకాలంగా టీడీపీ, జనసేన నేతలు అల్లు అర్జున్‌పై చేస్తున్న వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమని గుర్తు చేస్తున్నారు. తాజాగా మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు దీన్నే ధ్రువీకరిస్తున్నాయని అంటున్నారు. ఎవడబ్బ సొమ్మని సినిమాలకు బెనిఫిట్ షోలు వేస్తున్నారని సినీ నిర్మాతల మండలిని టీడీపీ ఎమ్మెల్యే బండారు ప్రశ్నించారు.ఎవరి బెనిఫిట్ కోసం ఈ షోలు వేస్తున్నారని, ఎందుకు ప్రభుత్వం నుంచి అదనంగా అనుమతులు తీసుకుంటున్నారని అన్నారు. మీ లాభాల కోసం బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతులివ్వాలా అని ప్రశ్నించారు. కూటమి నేతలతో కలిసి ఆయన సోమవారం విశాఖపట్నంలో మాట్లాడుతూ.. సినిమాల బెనిఫిట్ షోలు, హీరోల ఆదాయంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్కో హీరో సినిమాకు రూ.100 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని చెప్పారు. గతంలో బెనిఫిట్ షోలు చారిటీ కోసం వేసేవారని, ఇప్పుడు సినీ నిర్మాతల లబ్ధి కోసం వేస్తున్నారని అన్నారు. నిర్మాత కోసమో, డబ్బులున్న వాళ్ల కోసమో వీటికి ప్రభుత్వం ఎందుకు అనుమతివ్వాలని ఆక్షేపించారు.సినిమాలకు రూ.వేల కోట్ల ఆదాయం వస్తుంటే జీఎస్టీ, ఇన్‌కం ట్యాక్స్ అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇంతకు ముందు బ్లాక్‌లో టికెట్లు అమ్మితే పోలీసులు అడ్డుకునేవారని, కానీ ఇప్పడు సినిమా నిర్మాతలే అమ్ముతున్నారని ఆరోపించారు. ఇది మోసం కాదా అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలకు వచ్చే డబ్బును ప్రజా శ్రేయస్సు కోసం, సమాజం కోసం వినియోగిస్తేనే అనుమతులివ్వాలని కోరారు. చిన్న ఉద్యోగిని ట్యాక్స్ కట్టలేదని లెక్కలడుగుతున్నారని, సినిమాలకు ఇన్ని వేల కోట్లు కలెక్షన్స్ వస్తుంటే ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, బెనిఫిట్ షోలను రద్దు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్పారు. బెనిఫిట్ షోలతో ఎవరికి లాభం కలుగుతోందని ప్రశ్నించారు. ఒకవేళ అనుమతించినా వీటిపై నియంత్రణ ఉండాలన్నారు.బాబు కుట్రే.. నిదర్శనమిదే..హీరో అల్లు అర్జున్‌పై చంద్రబాబు అండ్ కో కుట్ర చేసిందనడానికి టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే ప్రబల నిదర్శనం. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ను అరెస్టు చేసినా, ఆయన ఇంటిపైన దాడి జరిగినా ఇంతవరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం ఖండించలేదు. పైగా, ఇటీవల టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, నేతలు పలువురు అల్లు అర్జున్‌పై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ‘అల్లు అర్జున్ ఏమైనా పుడింగా’ అంటూ ఇటీవల తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నోటికొచ్చినట్లు మాట్లాడారు. పుష్ప2 సినిమా విడుదలకు ముందు గన్నవరం జనసేన పార్టీ ఇన్చార్జి చలమలశెట్టి రమేష్‌బాబు ‘నువ్వు హీరో అనుకుంటున్నావా..? నువ్వొక కమెడియన్.చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకుంటే కానీ నువ్వు చేసిన తప్పు సరికాదు. పుష్ప సినిమా మా నియోజకవర్గంలో ఎలా ఆడుతుందో చూస్తా’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక నంద్యాల టీడీపీ ఎంపీ శబరి ‘ఎక్స్’లో అర్జున్‌పై ఎగతాళి వ్యాఖ్యలు చేశారు. ‘మీరు నంద్యాలలో చేసిన ఎన్నికల ప్రచారం ఇక్కడి ప్రజలకు ఇప్పటికీ మరువలేనిది. నంద్యాలలో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. మీ సెంటిమెంట్ మాకు చాలా బాగా పనిచేసింది. ఆ సెంటిమెంట్ మాదిరిగానే మీ పుష్ప 2 చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాం’ అంటూ శబరి ఎద్దేవా చేశారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పరోక్షంగా అల్లు అర్జున్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
ప్రాణాలు తీసే అభిమానం సరికాదు!
పుష్ప-2 సినిమా విడుదలై సంచలనం సృష్టిస్తోంది. కానీ బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి (39) అనే మహిళ మరణించడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉండటం మనసును కలచివేస్తోంది.అసలెందుకిలా జరుగుతోంది? సినిమాల పట్ల ఇంత వేలంవెర్రి ఎందుకు? టికెట్ల ధరలు వేల రూపాయల్లో ఉండటమేంటి? అందుకు ప్రభుత్వాలు అనుమతించడమేంటి? వేలకు వేలు పెట్టి టికెట్లు కొనడమే కాకుండా, ప్రాణాలకు తెగించి మరీ బెనిఫిట్ షో చూడాలనే ఇంత పిచ్చి అభిమానం ఎందుకు ఏర్పడుతోంది? దీన్ని ఎలా నివారించాలి? అని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది.మనదేశంలో సినీ పరిశ్రమ కేవలం వినోదంగా మాత్రమే కాకుండా ఒక మతంలా మారిపోయింది. సినిమా హీరోలను దేవుళ్లుగా భావించడం, వారి సినిమా అందరికంటే ముందుగా చూడటం గొప్పగా భావించే మైండ్ సెట్ గా మారిపోయింది.ఫ్యాన్స్ మానసిక స్థితిఅభిమానుల్లో చాలామంది తమ అభిమాన నటులతో మానసికంగా అనుబంధం ఏర్పరచుకుంటారు. వారితో మమేకమవుతారు. వారిలో తమను చూసుకుంటారు. అభిమాన హీరో సినిమా విజయాన్ని తమ విజయంగా భావిస్తారు. అది వారి వ్యక్తిగత జీవితంలోని లోటుపాట్లనుంచి తాత్కాలిక ఉపశమనాన్నిస్తుంది. అంటే సామాన్య వ్యక్తి నిజ జీవితంలో సాధించలేని విజయాన్ని తమ హీరో విజయంలో చూసుకుని సంతృప్తి చెందుతాడు. ముఖ్యంగా పిల్లలు ఆ హీరోలకు అనుకరిస్తారు. ఈ దుర్ఘటనలో గాయపడిన శ్రీతేజ్ తనను తాను పుష్పలా భావించుకునేవాడని, అతన్ని అందరూ పుష్ప అని పిలిచేవారని తండ్రి చెప్పడం మనం గుర్తించాలి.మరోవైపు మొదటి రోజు మొదటి షో చూడటం వల్ల వచ్చే థ్రిల్, ఎక్సయిట్మెంట్ మనలో ఆనందాన్ని కలిగించే డోపమైన్ అనే రసాయనం ఎక్కువగా స్రవించేందుకు కారణమవుతుంది. దాంతో ఆ అనుభవం ఎక్సయిటింగ్ గా అనిపిస్తుంది. అందుకే ప్రతీ మూవీ మొదటిరోజు చూసేందుకు, అందుకోసం ఎన్ని వేల రూపాయలైనా ఖర్చుపెట్టేందుకు ఉర్రూతలూగుతుంటారు.మొదటిరోజు మొదటి షో చూసిన ఫ్యాన్స్ తమను తాము ప్రత్యేక వ్యక్తులుగా, ఇతరుల కంటే గొప్పగా భావిస్తుంటారు. అలా తమ గ్రూప్ లో ఒక గుర్తింపును పొందాలనుకునే కోరికను ఇది తెలియపరుస్తుంది. అంతేకాదు, ఫ్యాన్స్ గ్రూప్ లో ఉన్నవారిపై కనిపించని ఒత్తిడి ఉంటుంది. మొదటి రోజు మొదటి షోను మిస్ అవ్వకుండా చూడటం తప్పనిసరి బాధ్యతగా ఫీలవుతుంటారు. ఇది గుంపు ప్రవర్తన (Herd Behaviour)తో ముడిపడి ఉంటుంది.గుంపులో ఉన్న వ్యక్తులు వారి వ్యక్తిగత బాధ్యతను కోల్పోతారు. అభిమానుల ఆసక్తి, ఉత్తేజం వేగంగా పాకిపోతుంది, చిన్న అవాంతరాలు కూడా పెద్ద సంఘటనలుగా మారతాయి. తొక్కిసలాట జరిగినప్పుడు భయాందోళనలు పెరిగి అందరూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది ప్రమాదాలకు కారణమవుతుంద. సంధ్య ధియేటర్ వద్ద జరిగింది ఇదే.నిర్మాతల వ్యాపారాత్మక ధోరణి... బాహుబలితో మొదలైన పాన్ ఇండియా మూవీల హవా పుష్ప-2తో ఒక మేనియాగా మారింది. దీన్ని వీలైనంతగా సొమ్ము చేసుకునేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా వారిని ప్రోత్సహిస్తూ భారీగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇస్తున్నాయి. ప్రజల భావోద్వేగాలను వీలైనంతగా సొమ్ము చేసుకునే కమర్షియల్ ఆపర్చునిజానికి ఇది నిలువెత్తు నిదర్శనం.వ్యాపారాత్మక ధోరణి తప్ప, అభిమానుల బలహీనతలను సొమ్మి చేసుకోవడం నిర్మాతల నైతికలోపంగా భావించవచ్చు. కానీ టికెట్ ధరలు విపరీతంగా పెంచడం సినిమాను సామాన్య ప్రజలకు దూరం చేస్తుందన్న విషయాన్ని వారు గుర్తించడం లేదు.ఇదీ చదవండి: బన్నీ నట విశ్వరూపం.. ‘పుష్ప 2’ హిట్టా? ఫట్టా?మరోవైపు, భారీ రద్దీగా ఉండే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్‌కు రావడం అల్లు అర్జున్ చేసిన తప్పని చెప్పక తప్పదు. ఆ సమయంలో తాను కనిపిస్తే తనను చూసేందుకు అభిమానులు ఎగబడతారని, తొక్కిసలాట జరగవచ్చని గుర్తించి ఉండాల్సింది. ఆయనా పని చేయలేదు. సరే ఆయన వచ్చారు. ధియేటర్ యాజమాన్యం, పోలీసులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేకపోయారు. ఫలితంగా ఒక నిండుప్రాణం బలయ్యింది. అందరూ బాధ్యత తీసుకోవాలి.. • ఇలాంటి సంఘటనలు చూశాకైనా ఫ్యాన్స్ మేల్కోవాల్సిన అవసరం ఉంది. తమ ప్రాధాన్యతలను పునరాలోచించుకోవాలి. ప్రాణాలకంటే సినిమా ఎక్కువ కాదని గుర్తించి మసలు కోవాల్సిన అవసరం ఉంది. • పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు తమ అభిమానుల ఆలోచనలపై ప్రభావం చూపించగలగాలి. వాళ్ళ అభిమానులు జవాబుదారీతనం కలిగి ఉండేలా చేసే ప్రయత్నాలు చేయాలి.• నిర్మాతలు ఆర్థిక ప్రయోజనాలకు మించిన బాధ్యతను గుర్తించాలి, మెరుగైన వినోదం సరసమైన ధరలకు అందించేందుకు ప్రయత్నించాలి. • మీడియా కూడా సినిమా ప్రచార కార్యక్రమాల ప్రసారం విషయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది.-సైకాలజిస్ట్ విశేష్8019 000066www.psyvisesh.com -
సూర్య భారీ బడ్జెట్ చిత్రం.. ఆ రాష్ట్రంలో ఆలస్యంగా మార్నింగ్ షోలు!
కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య నటించిన భారీ యాక్షన్ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ మరికొద్ది గంటల్లో బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ మూవీపై సూర్య అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పాన్ ఇండియా చిత్రం అభిమానుల భారీ అంచనాల మధ్య నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే మొదటి రోజు తమిళనాడు ప్రభుత్వం ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతులిచ్చింది. అయితే మొదటి షో ఉదయం 9 గంటల నుంచి ప్రారంభించేందుకు ఓకే చెప్పింది. చివరి ఐదో షోను అర్ధరాత్రి 2 గంటలకు ముగించాలని ఆదేశించింది. ప్రేక్షకులకు అవసరమైన భద్రతా చర్యలను పాటించాలని తమిళనాడు ప్రభుత్వం థియేటర్ల యాజమాన్యాలను కోరింది.అయితే తమిళనాడు వ్యాప్తంగా ఉదయం 9 గంటలకు కంగువా షోలు మొదలు కానున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్,కేరళ రాష్ట్రాల్లో అందుకు భిన్నంగా మార్నింగ్ షోలు ప్రదర్శించనున్నారు. ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళలో మాత్రం తెల్లవారుజామున 4 నుంచే బెనిఫిట్ షోలు ప్రారంభం అవుతాయని మేకర్స్ వెల్లడించారు.కాగా.. సూర్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. అంతేకాదు ఈ సినిమాని దాదాపు ఏడు దేశాల్లో చిత్రీకరించారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటాని, నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, యోగి బాబు, కోవై సరళ, ఆనంద కీలక పాత్రల్లో నటించారు. -
ఏలూరులో నకిలీ సినిమా టిక్కెట్లు! కళ్లు కాయలు కాచేలా వేచి చూసి మూవీకెళ్తే..
ఏలూరు టౌన్ (పశ్చిమ గోదావరి): ఏదైనా పెద్ద హీరో సినిమా వచ్చిందంటే చాలు.. అభిమానుల ఉత్సాహం, సినిమా చూడాలనే ఆతృత అంతా ఇంతా కాదు. దీనిని ఆసరాగా చేసుకొని వారికి నకిలీ టిక్కెట్లు విక్రయించి మోసం చేస్తూ డబ్బు దోచేస్తున్నారు ఓ థియేటర్ సిబ్బంది. తీరా సినిమా చూద్దామని థియేటర్‌కి వెళితే.. నకిలీదంటూ బయటికి గెంటేస్తున్నారు. దీంతో డబ్బూ పోయి, సినిమా చూడలేకపోయామనే ఆవేదనతో పాటు అవమానానికి గురవుతున్నారు అభిమానులు. జిల్లా కేంద్రమైన ఏలూరులో ఈ ఘటనలు జరుగుతుండటం గమనార్హం. ఇటీవల రిలీజ్ అయిన ఓ పెద్ద హీరో సినిమాకు వెంకటకుమార్ అనే ఒక ప్రేక్షకుడు వెళ్లాడు. ముందురోజే థియేటర్ వద్ద రూ.300 పెట్టి టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. కళ్లు కాయలు కాచేలా వేచి చూసి ఉదయం ఐదు గంటలకు బెనిఫిట్ షోకు వెళ్లాడు. టిక్కెట్‌పై ఉన్న తన సీట్ నంబర్ చూసుకుని కూర్చున్నాడు. ఈలోగా మరో వ్యక్తి వచ్చి తన సీట్ నంబర్ కూడా అదేనంటూ టిక్కెట్ చూపించాడు. ఈలోగా థియేటర్ సిబ్బంది వచ్చి అతన్ని కూర్చోబెట్టి.. రాత్రంతా వేచిచూసి అధిక ధరకు టిక్కెట్ కొన్న వెంకట కుమార్‌ను బయటకు నెట్టేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. నీది నకిలీ టిక్కెట్.. మాకు సంబంధం లేదని చెప్పారు. తీరా అభిమాని తనకు ఈ టిక్కెట్ ఎలా వచ్చిందో చెప్పాలంటూ పట్టుబట్టడంతో థియేటర్ యాజమాన్యం, సిబ్బంది కంగుతిన్నారు. అతను వెళ్లి ఏలూరు వన్‌టౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి👉 తిరుపతి, అరకుకు స్పెషల్ టూర్స్ భారీగా దోపిడీ సినిమా థియేటర్లోని సిబ్బంది చాకచక్యంగా టిక్కెట్లను నకిలీవి తయారు చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఫ్యామిలీతో కలిసి వెళితే నకిలీ టిక్కెట్ కొన్నారు మాకు సంబంధం లేదంటూ బయటకు పంపేస్తున్నారు. వారంతా అవమానంగా ఫీలవుతూ ఎవరికీ చెప్పుకోలేక ఆవేదనకు గురవుతున్నారు. రోజూ ఒక్కో షోకు ఈ విధంగా పది టిక్కెట్ల వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. ఒక్కో టిక్కెట్ ధర రూ.300 అనుకుంటే షోకు రూ.3 వేలు సంపాదిస్తున్నారు. నాలుగు షోలకు రూ.12 వేల వరకు జేబుల్లో వేసుకుంటున్నారు. వీరిపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సినిమా అభిమానులు కోరుతున్నారు. చదవండి👉🏻 నా కారునే ఆపుతావా అంటూ ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి -
వకీల్ సాబ్ బెనిఫిట్ షో.. టికెట్ ధర ఎంతో తెలుసా?
‘పవన్ కల్యాణ్ సినిమా ఫస్ట్ డే.. ఫస్ట్ షో టికెట్ దొరికాలి కానీ నా కంటే అదృష్టవంతుడు ఎవడూ ఉండదు’ పవర్ స్టార్ అభిమానుల అందరి ఫీలింగ్ ఇది. పవన్ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనేది చాలా మంది అభిమానుల కలలు కంటుంటారు. టికెట్ దొరికితే చాలు.. ఆస్కార్ అవార్డు్ గెలిచినంత పొంగిపోతారు. నా అభిమానా హీరో ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ దొరికింది అంటూ గర్వంగా చెప్పుకుంటారు. ఆ టికెట్‌ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. ప్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజీ అది. పవన్ అన్న, ఆయన సినిమాలన్న పడి చచ్చేవారు లక్షల్లో ఉన్నారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ నుంచి మూడేళ్ల తర్వాత సినిమా వస్తే తొలి రోజు టికెట్ రేట్స్ ఎలా ఉంటాయి? ఒక వేళ వేలల్లో ఉన్నా కూడా ఫ్యాన్స్ కొనక ఊరుకుంటారా? చాన్సే లేదు. డబ్బులు ఎంతైనా టికెట్ కొనడం ఖాయం. ఈ విషయం వకీల్ సాబ్ నిర్మాతలకు కూడా తెసులు. అందుకే తొలి మూడు రోజుల్లోనే వీలైనంత పిండుకోవాలని మెంటల్‌గా ఫిక్స్ అయిపోయారు. ఏప్రిల్ 9న విడుదల కాబోతున్న వకీల్ సాబ్ సినిమాటికెట్ ధరలను అమాంతం పెంచారని ప్రచారం జరుగుతుంది. నార్మల్ టికెట్ ధర రూ.200గా ఫిక్స్ చేశారట. ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలో వకీల్ సాబ్ బెనిఫిట్ షో వేయాలని చిత్ర బృందం భావిస్తుందట. ఏప్రిల్ 8 అర్థరాత్రి నుంచే ప్రీమియర్ షోలు పడతాయి. దీని కోసం టికెట్ ధరను రూ.1500గా ఫిక్స్ చేశారని సమాచారం. మూడేళ్ల తర్వాత తమ అభిమాన హీరో నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ టికెట్ ధరను ఎంత పెంచినా ఆలోచించరు. రూ.200 కాదు..2000 అయినా థియేటర్లలో తమ అభిమాన హీరో సినిమా చూడడానికి రెడీగా ఉన్నారు. ఇక వకీల్ సాబ్ విషయానికి వస్తే.. బాలీవుడ్లో సూపర్ హిట్ అయినా పింక్ మూవీకి రీమేక్ ఇది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. చదవండి: వకీల్ సాబ్ ట్రైలర్‌పై రామ్ చరణ్ కామెంట్ నితిన్ బర్త్‌డే వేడుకల్లో సింగర్ సునీత దంపతులు -
‘వకీల్ సాబ్’ హవా.. అంబరాన్నంటేలా టికెట్ల ధరలు!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ చేస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్ నేడు(మార్చి29) హోలీ సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయనున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు #VakeelSaabTrailerDay హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. వకీల్‌సాబ్ రిలీజ్ విషయంలో చిత్ర నిర్మాత దిల్‌రాజ్ భారీ ప్లాన్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. విడుదల తేదికి ముందు రోజు అర్థరాత్రి వైజాగ్‌లోని కొన్ని థియేటర్లలో 12 గంట నుంచి మూడు మిడ్నైట్ షోలను ఏర్పాటు చేయనున్నారు. అభిమానుల షో గా చెప్పే ఆ షో ఈ టికెట్ ధర విషయంలో భారీ మొత్తంలో ఫిక్స్ చేశాడు నిర్మాత. ఈ నేపథ్యంలో మిడ్నైట్ షోకు సంబంధించి ఒక్కో టికెట్ ధర ఏకంగా 1500 రూపాయలు నిర్ణయించారు. అంతేగాక ఉదయం బెనిషిట్ షో టికెట్ ధర 500 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే అన్ని ప్రాంతాల్లో మొదటి వారం టికెట్ ధర 200గా ఫిక్స్ చేశారు. టికెట్ల రేట్లు అధికంగా పెంచడంతో తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు వకీల్ సాబ్ రికార్డు సృష్టించడం ఖాయం అనిపిస్తుంది. మరోవైపు పెద్ద మొత్తంలో టికెట్ల రేట్లు పెంచడంతో వకీల్ సాబ్ సామాన్య ప్రేక్షకులకు అందనంత దూరంలో ఉన్నట్లుగా ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాకు పవన్ ఇంతకముందు ఎన్నడూ లేని విధంగా 50 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్నాడు. కాగా ఏప్రిల్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్లో హిట్ సాధించిన పింక్ చిత్రాన్ని తెలుగులో వకీల్‌సాబ్‌గా రీమేక్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. పింక్'లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను 'వకీల్ సాబ్'లో పవన్ కల్యాణ్ పోషిస్తుండడంతో సినిమాకు భారీ హైప్ క్రియెట్ అయ్యింది. అలాగే మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ నుంచి వస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ విడుదల కానుంది. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చదవండి: వకీల్ సాబ్ బిగ్ అప్డేట్ వచ్చేసింది -
బ్లాక్ బలి
ఏలూరు (సెంట్రల్): జిల్లావ్యాప్తంగా బాహుబలి–2 ఫీవర్ అభిమానులను ఊపేస్తోంది. జిల్లాలోని 90 శాతం ధియేటర్లలో శుక్రవారం బాహుబలి–2 విడుదల కానుంది. ఏలూరు, భీమవరంలోని అన్ని స్క్రీన్లలో సినిమా విడుదల చేయనున్నారు. మొదటిరోజే సినిమా చూడాలన్న అభిమానుల తాపత్రయాన్ని డిస్ట్రిబ్యూటర్లు సొమ్ము చేసుకుంటున్నారు. పెంచిన ధర ప్రకారం రూ.200కు విక్రయించాలి్స న టికెట్‌ను రూ.900 నుంచి రూ.1,800 వరకు విక్రయిస్తున్నారు. భీమవరంలో రూ.3 వేల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. బెనిఫిట్ షో క్రేజ్‌ను డిస్ట్రిబ్యూటర్లు సొమ్ములు చేసుకుంటున్నారు. 10 రోజుల పాటు ఉదయం 7.30 గంటల నుండి అర్ధరాత్రి 2.30 గంటల వరకు ఆరు షోలు ప్రదర్శించేందుకు జిల్లా అధికారులు అనుమతులు ఇచ్చారు. అయితే గురువారం రాత్రి 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. ఈ షోకు సంబంధించిన టికెట్లను ఒకరోజు ముందుగానే విక్రయించారు. టికెట్ ధర కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నా చర్యలు తీసుకోవాలి్సన సంబంధిత శాఖల అధికారులు సైతం చూసీచూడనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. రూ.1,200 వరకు విక్రయాలు జిల్లాలో సుమారు 125 ధియేటర్లలో సినిమా ప్రదర్శించనున్నారు. పదిరోజుల పాటు ఆరు షోలను ప్రదర్శించేందుకు, రూ.100 టికెట్‌ను రూ.200 విక్రయించేందుకు ఇప్పటికే అధికారులు అనుమతులు ఇచ్చారు. బెనిఫిట్ షోకు ఏలూ రులోని 11 థియేటర్లలో అన్ని విభా గాలకు చెందిన టికెట్లను అభిమాన సం ఘాల నాయకులు థియేటర్ యాజమాన్యం దగ్గర నుంచి వాస్తవ ధరల కంటే అధిక ధరలకు కొనుగోలు చేశారు. అధికారులు పట్టించుకోకపోవడానికి కార ణం పెద్ద ఎత్తున మాముళ్లు తీసుకోవ డమే అని సమాచారం. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందనే వంకతో నగరంలోని అన్ని థియేటర్ల యాజమాన్యాల నుంచి ఓ టీడీపీ నాయకుడు పెద్ద మొత్తంలో నగదును పోలీసు అధికారులకు అందించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. -
తెలంగాణలో బాహుబలి 5 షోలే
-
బాహుబలి బెనిఫిట్ షోలకు అనుమతి లేదు
హైదరాబాద్ : ‘సాక్షి’ ‘బ్లాక్‌బలి’ కథనంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. బాహుబలి-2 బెనిఫిట్ షోలకు అనుమతి లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తాము అయిదు ప్రదర్శనలకు మాత్రమే అనుమతి ఇచ్చామని ఆయన బుధవారమిక్కడ స్పష్టం చేశారు. ఎక్కువ ధరకు టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తప్పవన్నారు. అలాగే కాంబో ఆఫర్ల పేరుతో మోసం చేస్తే ఉపేక్షించేది లేదని తలసాని హెచ్చరించారు. ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా ఉపేక్షించేది లేదన్నారు. మరోవైపు థియేటర్ల యాజమాన్యాలకు వాణిజ్య పన్నుల శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్మితే చర్యలు తప్పవని వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ తెలిపారు. ఎక్కువ రేట్లకు ఎవరు టికెట్లు అమ్మినా 18004253787 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. అయితే పెయిడ్ ప్రీమియం పేరుతో హైదరాబాద్ లో ఈ సినిమాను గురువారం రాత్రి నుంచే ప్రదర్శిస్తున్నారు. కాగా బాహుబలి-2 శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 9వేల స్క్రీన్లపై ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. తమిళనాడు, కేరళలలో 70-75 శాతం బాహుబలి పార్ట్-2 కోసమే బుక్ అవ్వగా.. తెలంగాణ ఆంధ్ర్రప్రదేశ్ లలో 80 శాతం థియేటర్లలో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. మరోవైపు అభిమానులు కూడా తొలిరోజే ఈ సినిమాను చూసేందుకు పోటీలు పడుతున్నారు. పెద్ద మొత్తం వెచ్చించి అయినా టికెట్ కొనేందుకు సిద్ధపడుతున్నారు. -
‘ఖైదీ నంబర్ 150’ టిక్కెట్ దొరకలేదని...
విశాఖలో గొంతుకోసుకున్న యువకుడు చికిత్స పొంది సాయంత్రం సినిమా చూసిన వైనం గుంటూరు జిల్లాలో బెనిఫిట్ షో ఆలస్యం కావడంతో థియేటర్ ధ్వంసం హద్దులు దాటిన అభిమానం సాక్షి, విశాఖపట్నం/కొల్లూరు(వేమూరు): అభిమాన కథానాయకుడు నటించిన చిత్రాన్ని తొలిరోజే చూడాలన్న ఆరాటంతో ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. సినిమా టిక్కెట్ దొరక లేదన్న అసహనంతో గొంతు కోసుకున్నాడు. మరో ఘటనలో.. చెప్పిన సమయానికి సినిమాను ప్రదర్శించలేదని ఆగ్రహించిన అభిమానులు థియేటర్‌పై దాడి చేశారు. దీంతో థియేటర్ స్క్రీన్ చిరిగిపోయింది. కుర్చీలు ముక్కలయ్యాయి. తలుపులు పగిలిపోయాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రం బుధవారం విడుదలైంది. విశాఖపట్నంలో తొలిరోజే సినిమాను చూడాలన్న ఆశతో యువకుడు నాగరాజు స్థానిక రామా టాకీస్‌కు వెళ్లాడు. అయితే అప్పటికే టిక్కెట్లు అయిపోయాయని థియేటర్ నిర్వాహకులు చెప్పారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా టిక్కెట్ దొరక్కపోవడంతో అసహనానికి గురైన నాగరాజు బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. వెంటనే స్థానికులు స్పందించి అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పడంతో చికిత్స అనంతరం మళ్లీ థియేటర్ వద్దకు వచ్చి టిక్కెట్ తీసుకుని సినిమా చూసి వెళ్లాడు. థియేటర్ స్క్రీన్, కుర్చీలు ధ్వంసం గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో స్థానిక శ్రీనివాస టాకీస్ నిర్వాహకులు ‘ఖైదీ నంబరు 150’ బెనిఫిట్ షో ప్రదర్శిస్తామంటూ ముందుగానే టిక్కెట్లు విక్రయించారు. మంగళవారం అర్ధరాత్రి రెండు గంటలకే ప్రదర్శన ఉంటుందని చెప్పారు. టిక్కెట్లు కొనుగోలు చేసిన అభిమానులు తీరా లోపలికి వెళ్లగా, ఖైదీ నంబరు 150కి బదులు వేరే డబ్బింగ్ చిత్ర ప్రదర్శన ప్రారంభించారు. అభిమానులు ఆందోళనకు దిగడంతో నిర్వాహకులు ఆ సినిమా ప్రదర్శన నిలిపివేశారు. చిరంజీవి చిత్ర ప్రదర్శనకు సంబంధించిన డిజిటల్ లాక్ చేరడం ఆలస్యమైందంటూ కాలం గడిపారు. తెల్లవారుజామున నాలుగున్నర వరకూ అభిమానులు ఓపిగ్గా ఎదురుచూశారు. ఈలోగా ఇతర ప్రాంతాల్లో చిత్ర ప్రదర్శన ప్రారంభమైందంటూ సమాచారం అందడంతో సహనం కోల్పోయారు. కుర్చీలు, థియేటర్ తలుపులు, ఫ్యాన్లు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా థియేటర్లోనే టపాసులు పేల్చుతూ, కుర్చీలను స్క్రీన్ పైకి విసురుతూ పూర్తిగా చించివేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి, అభిమానులను చెదరగొట్టారు. ఈ ఘటనలో రూ.లక్షల్లో ఆస్తి నష్టం సంభవించినట్టు థియేటర్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.