ఎవరి కోసం వాటికి అనుమతి ఇస్తున్నారు?
ఒక్కో హీరో రూ.300కోట్ల వరకు తీసుకుంటున్నారు
సినిమాలతో రూ.వేల కోట్లు ఆర్జిస్తున్నారు
జీఎస్టీ, ఆదాయ పన్ను అధికారులు ఏం చేస్తున్నారు?
టీడీపీ ఎమ్మెల్యే బండారు తీవ్ర వ్యాఖ్యలు.. అల్లు అర్జున్‌పై బాబు కుట్రను తేటతెల్లం చేస్తున్న టీడీపీ, జనసేన నేతల వ్యాఖ్యలు
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): పుష్ప2 సినిమాతో రికార్డులు బద్దలు కొట్టిన అల్లు అర్జునే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుట్రలు పన్నుతున్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు. గత కొంతకాలంగా టీడీపీ, జనసేన నేతలు అల్లు అర్జున్‌పై చేస్తున్న వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమని గుర్తు చేస్తున్నారు. తాజాగా మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు దీన్నే ధ్రువీకరిస్తున్నాయని అంటున్నారు. ఎవడబ్బ సొమ్మని సినిమాలకు బెనిఫిట్ షోలు వేస్తున్నారని సినీ నిర్మాతల మండలిని టీడీపీ ఎమ్మెల్యే బండారు ప్రశ్నించారు.
ఎవరి బెనిఫిట్ కోసం ఈ షోలు వేస్తున్నారని, ఎందుకు ప్రభుత్వం నుంచి అదనంగా అనుమతులు తీసుకుంటున్నారని అన్నారు. మీ లాభాల కోసం బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతులివ్వాలా అని ప్రశ్నించారు. కూటమి నేతలతో కలిసి ఆయన సోమవారం విశాఖపట్నంలో మాట్లాడుతూ.. సినిమాల బెనిఫిట్ షోలు, హీరోల ఆదాయంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్కో హీరో సినిమాకు రూ.100 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని చెప్పారు. గతంలో బెనిఫిట్ షోలు చారిటీ కోసం వేసేవారని, ఇప్పుడు సినీ నిర్మాతల లబ్ధి కోసం వేస్తున్నారని అన్నారు. నిర్మాత కోసమో, డబ్బులున్న వాళ్ల కోసమో వీటికి ప్రభుత్వం ఎందుకు అనుమతివ్వాలని ఆక్షేపించారు.
సినిమాలకు రూ.వేల కోట్ల ఆదాయం వస్తుంటే జీఎస్టీ, ఇన్‌కం ట్యాక్స్ అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇంతకు ముందు బ్లాక్‌లో టికెట్లు అమ్మితే పోలీసులు అడ్డుకునేవారని, కానీ ఇప్పడు సినిమా నిర్మాతలే అమ్ముతున్నారని ఆరోపించారు. ఇది మోసం కాదా అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలకు వచ్చే డబ్బును ప్రజా శ్రేయస్సు కోసం, సమాజం కోసం వినియోగిస్తేనే అనుమతులివ్వాలని కోరారు. చిన్న ఉద్యోగిని ట్యాక్స్ కట్టలేదని లెక్కలడుగుతున్నారని, సినిమాలకు ఇన్ని వేల కోట్లు కలెక్షన్స్ వస్తుంటే ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, బెనిఫిట్ షోలను రద్దు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్పారు. బెనిఫిట్ షోలతో ఎవరికి లాభం కలుగుతోందని ప్రశ్నించారు. ఒకవేళ అనుమతించినా వీటిపై నియంత్రణ ఉండాలన్నారు.
బాబు కుట్రే.. నిదర్శనమిదే..
హీరో అల్లు అర్జున్‌పై చంద్రబాబు అండ్ కో కుట్ర చేసిందనడానికి టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే ప్రబల నిదర్శనం. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను అరెస్టు చేసినా, ఆయన ఇంటిపైన దాడి జరిగినా ఇంతవరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం ఖండించలేదు. పైగా, ఇటీవల టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, నేతలు పలువురు అల్లు అర్జున్‌పై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ‘అల్లు అర్జున్ ఏమైనా పుడింగా’ అంటూ ఇటీవల తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నోటికొచ్చినట్లు మాట్లాడారు. పుష్ప2 సినిమా విడుదలకు ముందు గన్నవరం జనసేన పార్టీ ఇన్‌చార్జి చలమలశెట్టి రమేష్‌బాబు ‘నువ్వు హీరో అనుకుంటున్నావా..? నువ్వొక కమెడియన్.
చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకుంటే కానీ నువ్వు చేసిన తప్పు సరికాదు. పుష్ప సినిమా మా నియోజకవర్గంలో ఎలా ఆడుతుందో చూస్తా’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక నంద్యాల టీడీపీ ఎంపీ శబరి ‘ఎక్స్’లో అర్జున్‌పై ఎగతాళి వ్యాఖ్యలు చేశారు. ‘మీరు నంద్యాలలో చేసిన ఎన్నికల ప్రచారం ఇక్కడి ప్రజలకు ఇప్పటికీ మరువలేనిది. నంద్యాలలో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. మీ సెంటిమెంట్ మాకు చాలా బాగా పనిచేసింది. ఆ సెంటిమెంట్ మాదిరిగానే మీ పుష్ప 2 చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాం’ అంటూ శబరి ఎద్దేవా చేశారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పరోక్షంగా అల్లు అర్జున్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment