విదేశీయులకు పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు అమెరికాలో సహజంగా దక్కుతున్న పౌరసత్వ హక్కును రద్దు చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నారు. కానీ, న్యాయస్థానం తాజాగా ఆ ఆదేశాలకు మోకాలడ్డేసింది. దీంతో అప్పీల్‌కు వెళ్లాలని ట్రంప్ నిర్ణయించారు. అయితే.. జన్మతః దక్కే పౌరసత్వం విషయంలో మిగతా దేశాలు ఏం విధానాలు పాటిస్తున్నాయో తెలుసా?.
అమెరికా గడ్డపై పుట్టే ప్రతీ ఒక్కరికీ అక్కడి పౌరసత్వం దక్కేలా అక్కడి రాజ్యాంగం హక్కు కల్పించింది. 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆ హక్కు దక్కాలి కూడా. అయితే ఆ హక్కును తనకున్న విశిష్ట అధికారంతో మార్చేయాలని ట్రంప్ భావించారు.ఈ క్రమంలోనే రాజ్యాంగ సవరణతో సంబంధం లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఇకపై అమెరికా నేలపై విదేశీయులకు పుట్టే పిల్లలను అమెరికా పౌరులుగా పరిగణించకూడదన్నది ఆ ఆదేశాల సారాంశం.
👉పుట్టే పిల్లలకు పౌరసత్వం వర్తింపజేయడమే బర్త్‌రైట్ సిటిజన్‌షిప్. తల్లిదండ్రుల జాతీయత.. అంటే వాళ్లది ఏ దేశం, ఇమ్మిగ్రేషన్ స్టేటస్.. అంటే ఏ రకంగా వలసలు వచ్చారు ఇలాంటివేవీ పరిగణనలోకి తీసుకోకుండా అమెరికాలో ఇంతకాలం పౌరసత్వ గుర్తింపు ఇస్తున్నారు. అయితే ప్రపంచం మొత్తంగా ‘‘జస్ సాన్‌గ్యుఇనిస్, జస్ సోలి’’ అనే రెండు సిద్ధాంతాల ఆధారంగా సిటిజన్‌షిప్‌ను వర్తింపజేస్తున్నారు. అయితే.. ఎక్కువ దేశాలు మాత్రం పౌరసత్వాన్ని ‘‘జస్ సాన్‌గ్యుఇనిస్’’ ఆధారంగానే పౌరసత్వం అందిస్తున్నాయి .
జస్ సాన్‌గ్యుఇనిస్ అంటే.. వారసత్వంగా(రక్తసంబంధంతో) పౌరసత్వ హక్కు పొందడం.
జస్ సోలి అంటే.. ఫలానా దేశంలో పుట్టిన కారణంగా ఆ దేశ పౌరసత్వ హక్కు లభించడం.
👉ఇప్పటిదాకా అమెరికా మాత్రమే కాదు.. మరికొన్ని దేశాలు పుట్టుకతో పౌరసత్వం విషయంలో జస్ సోలి వర్తింపజేస్తున్నాయి. అందులో అమెరికా పొరుగుదేశాలైన కెనడా కూడా ప్రధానంగా చెప్పుకోవాలి. అమెరికా తరహాలోనే ఈ దేశం కూడా తమ గడ్డపై పుట్టే విదేశీయుల పిల్లలకు జన్మతః పౌరసత్వం వర్తింపజేస్తోంది. అయితే అమెరికాలోలానే ఇక్కడా దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
👉అమెరికా రెండు ఖండాల్లో మెక్సికో, అర్జెంటీనాతో సహా చాలాదేశాలే ఈ జాబితాలో ఉన్నాయి. అయితే.. చిలీ, కంబోడియా మాత్రం ఇవ్వడం లేదు. ఆ దేశాలు జస్ సాన్‌గ్యుఇనిస్ ఆధారంగా పౌరసత్వం అందించడంపై ప్రధానంగా దృష్టిసారించాయి.
👉యూరప్, ఆసియా, ఆఫ్రికా.. చాలా దేశాలు జస్ సాన్‌గ్యుఇనిస్ మీదే జన్మతః పౌరసత్వాన్ని అందిస్తున్నాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం షరతులతో కూడిన సడలింపులు ఇచ్చాయి ఉదాహరణకు.. జర్మనీ, ఫ్రాన్స్‌లాంటి దేశాలు తమ దేశాల్లో పుట్టే పిల్లలకు సంబంధించి.. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తమ దేశాల్లో నివాసం ఏర్పాటు చేసుకుని కొన్నేళ్లపాటు(ప్రస్తుతం 8 సంవత్సరాలుగా ఉంది) జీవించి ఉండాలి. అలా ఉంటే ఆ పిల్లలకు ఆ దేశాల పౌరసత్వం వర్తిస్తుంది. అలాగే.. కొన్ని దేశాలు న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని కూడా పౌరసత్వం ఇస్తున్నాయి.
👉భారత్‌లో జన్మతఃపౌరసత్వంపై కఠిన నిబంధనలు ఉన్నాయి. జస్ సాన్‌గ్యుఇని అనుసరిస్తోంది మన దేశం. అంటే.. వారసత్వంగా రక్తసంబంధీకులకు పౌరసత్వం వర్తిస్తుందన్నమాట. అయితే..
1928లో మోతిలాల్ నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ.. జస్ సోలిని భారత్‌లోనూ వర్తింపజేయాలని ప్రతిపాదించింది. అంటే.. భారత గడ్డపై జన్మించే విదేశీయులకు కూడా ఇక్కడి పౌరసత్వం వర్తింపజేయాడన్నమాట. జస్ సాన్‌గ్యుఇని ‘జాతి భావన’ మాత్రమే ప్రతిబింబిస్తుందని, అదే జస్ సోలి అనేది సమాన హక్కుల భావనను చూపిస్తుందని ఈ కమిటీ అభివర్ణించింది. ఈ కమిటీలో నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, తేజ్ బహదూర్ సప్రూ ఉన్నారు.
1949లో రాజ్యాంగం కూడా ఈ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంది. కానీ, కాలక్రమేణా భారత్‌లో వారసత్వ పౌరసత్వానికే ప్రాధాన్యం లభించింది. 1955లో భారత పౌరసత్వ చట్టం.. జన్మతః పౌరసత్వ చట్టాలకు కఠిన నిబంధనలను చేర్చింది. తల్లిదండ్రుల్లో ఒకరు కచ్చితంగా భారత పౌరసత్వం ఉన్నవాళ్లు ఉండాలి. మరొకరు చట్టపరంగా వలసదారు అయి ఉంటే సరిపోతుంది.
👉జపాన్‌లోనూ కఠిన నిబంధనలే అమలు అన్నాయి. అయితే ఏ జాతీయత లేని స్థితిలో ఆ పిల్లలకు అక్కడి పౌరసత్వం ప్రసాదిస్తారు. స్పెయిన్‌లో పేరెంట్స్‌లో ఎవరో ఒకరికి కచ్చితంగా పౌరసత్వం ఉండాలి. లేదంటే ఎలాంటి జాతీయత లేని పిల్లలైనా అయి ఉండాలి.
👉ఇటలీలో బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై పరిమితులున్నాయి. పేరెంట్స్‌లో ఎవరో ఒకరికి ఇటలీ పౌరసత్వం ఉండాలి. లేదంటే.. ఆ బిడ్డకు 18 ఏళ్లు నిండేదాకా ఆ దేశంలోనే ఉండాలి. అప్పుడే పౌరసత్వం ఇస్తారు.
👉యూకే, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మలేషియా.. ఇలా మరికొన్ని దేశాల్లోనూ తల్లిదండడ్రులు కచ్చితంగా ఆ దేశ పౌరులై ఉంటేనే, లేదంటే శాశ్వత నివాసుతులై ఉంటేనే అక్కడి పౌరసత్వం సంక్రమిస్తుంది.
👉జన్మతః పౌరసత్వ హక్కుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సమానత్వం, ఏకీకరణలతో పాటు జాతీయత విషయంలో న్యాయపరమైన చిక్కులేవీ తలెత్తకుండా ఉంటాయి. అయితే.. అభ్యంతరాలు కూడా అదే స్థాయిలో వినిపిస్తున్నాయి. అక్రమ వలసదారుల్నిప్రొత్సహించడంతో పాటు దేశంపై ఆర్థికపరమైన భారాన్ని మోపుతుంది. ఈ క్రమంలోనే పౌరుల జాతీయత-వలసవిధానం గురించి పెద్ద ఎత్తునే చర్చ నడుస్తోంది. మరోవైపు ఇది ‘‘బర్త్ టూరిజం’’గా మారే ప్రమాదం లేకపోలేదని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమెరికాలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య బానిసత్వం, హక్కుల సాధనగా మొదలైన అంతర్యుద్ధం 1861-65 మధ్య కొనసాగింది. దాదాపు 6,20,000 మంది ఈ యుద్ధంలో మరణించారు. ఆ తర్వాత రాజ్యాంగంలోని 14వ సవరణ ద్వారా బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ అమల్లోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అమెరికా గడ్డపై పుట్టే ప్రతీ చిన్నారికి అక్కడి పౌరసత్వం లభిస్తోంది. ఈ 157 ఏళ్ల చరిత్రను రాజ్యాంగ సవరణ ద్వారా కాకుండా.. తన సంతకంతో మార్చేయాలని ట్రంప్ భావించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment