వాషింగ్టన్: అమెరికాలో జన్మ హక్కు పౌరసత్వాన్ని రద్దు చేయాలన్న కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలను అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా తప్పుబట్టారు. తల్లిదండ్రుల ఇమిగ్రేషన్ హోదాతో నిమిత్తం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ అమెరికా పౌరసత్వం కల్పిస్తోంది. ఈ జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. తాను అధికారం చేపట్టిన తొలి రోజే ఈ మేరకు కార్యనిర్వాహక చర్యలు తీసుకునే ఆలోచన ఉన్నట్టు చెప్పారు.
రాజ్యాంగబద్దమైన జన్మహక్కును మార్చాలనే ఆలోచనే దారుణమని బైడెన్ అన్నారు. అమెరికా జని్మంచినవాళ్లు దేశ పౌరులు కాకుండా ఎలా పోతారని ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సరిహద్దు నిబంధనల అమలును బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ద్వైపాక్షిక ఇమిగ్రేషన్ బిల్లుకు మద్దతుగా ఓటేయొద్దని చట్టసభ సభ్యులను ట్రంప్ కోరడం హాస్యాస్పదమన్నారు.
ట్రంప్‌కు అధికార మార్పిడి ప్రక్రియ సజావుగా సాగుతోందని బైడెన్ అన్నారు. గత అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం బైడెన్‌కు పగ్గాలు అప్పగించేందుకు ట్రంప్ ససేమిరా అనడం, అధికార మార్పిడి ప్రక్రియను అడ్డుకునేందుకు 2021 జనవరి 6న కాపిటల్ హిల్ భవనంపై దాడికి తన మద్దతుదారులను ఉసిగొల్పడం తెలిసిందే. దాన్ని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా బైడెన్ అభివర్ణించారు. శ్వేతజాతి ఆధిపత్య భావన అమెరికాకు పొంచి ఉన్న పెను ముప్పుల్లో ఒకటన్నారు.
‘‘ప్రపంచంలోనే అత్యంత బహుళ సాంస్కృతిక దేశం మనది. అదే మన బలం కూడా. కాపిటల్ హిల్‌పై దాడిని మన ప్రజాస్వామ్యం తట్టుకున్నందుకు గర్వపడాలి’’అంటూ బైడెన్ ట్వీట్ చేశారు. 2021 తరహా హింసకు తావు లేకుండా ఈసారి అధికార మార్పిడి ప్రక్రియ శాంతియుతంగా సాగుతుందన్నారు. జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతానని కూడా బైడెన్ చెప్పారు. ‘‘2021లో నా ప్రమాణ స్వీకారానికి ట్రంప్ గైర్హాజరయ్యారు. అయినా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఇటీవల ఆయన్ను వైట్‌హౌస్‌కు ఆహ్వానించా’’అని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment