birth right
-
మరో ట్రంప్ ఉత్తర్వుకు చుక్కెదురు
వాషింగ్టన్: అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ డజన్లకొద్దీ కార్యనిర్వాహక ఉత్తర్వులిస్తూ అన్ని దేశాలను కలవరపరుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో న్యాయస్థానం మొట్టికాయ వేసింది. వలస వచ్చిన వాళ్లకు పిల్లలు పుడితే వారికి దక్కే జన్మతః పౌరసత్వ హోదాను రద్దుచేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులు ఇచ్చిన ట్రంప్‌ను ఇప్పుడు అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ(యూఎస్ఎయిడ్) ఉద్యోగుల విషయంలోనూ మరో కోర్టు కట్టడిచేసింది. వేలాది మంది యూఎస్ఎయిడ్ ఉద్యోగులను ఉద్యోగాలు మానేసి 30 రోజుల్లోపు స్వదేశానికి తిరిగొచ్చేయాలని ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను వారం రోజులపాటు నిలుపుదల చేస్తున్నట్లు యూఎస్ డిస్ట్రిక్ కోర్ట్ జడ్జి కార్ల్ నిఖోల్స్ శుక్రవారం రాత్రి మధ్యంతర తీర్పు వెలువరిచారు. యూఎస్‌ఎయిడ్‌ను శాశ్వతంగా మూసేస్తానంటూ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ పెట్టిన కొన్ని గంటలకే ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా తాత్కాలిక తీర్పు వెలువడటం విశేషం. విదేశాల్లో యూఎస్ఎయిడ్ ఉద్యోగులు, వారి జీవితభాగస్వాములు, చదువుకుంటున్న వారి పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైన వేళ కోర్టు ఉత్తర్వులతో తాజాగా వారికి భారీ ఊరట లభించింది. అయితే ఈ విభాగానికి నిధులు ఆపేయాలంటూ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేయాలంటూ ది అమెరికన్ ఫారెన్ సర్విస్ అసోసియేషన్, ది అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంస్థలు చేసిన విజ్ఞప్తిని జడ్జి తిరస్కరించారు. ట్రంప్ ప్రభుత్వం ఆదేశించడంతో యూఎస్ఎయిడ్లో ఇప్పటికే 500 మంది ఉద్యోగులు సెలవులపై వెళ్లగా మరో 2,200 మంది శనివారమే సెలవుపై వెళ్లాల్సి ఉంది. యూఎస్ఎయిడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో సహాయక, అభివృద్ధి, దాతృత్వకార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రతి ఏటా వందల కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు. 2016 గణాంకాల ప్రకారం యూఎస్ఎయిడ్ ప్రభుత్వ విభాగంలో 10,235 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో మూడింట రెండొంతుల మంది విదేశాల్లో పనిచేస్తున్నారు. విదేశాలకు అపరిమిత సాయం అమెరికాకు గుదిబండగా మారిందని, ఉద్యోగుల్లో 90 శాతం మంది తీసేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగానే దశలవారీగా చాలా మంది సెలవుల మీదకు స్వదేశానికి తిరిగొచ్చేయాలని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది. శాశ్వతంగా తిరిగొస్తున్నందున ప్రయాణఖర్చులు కూడా చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే విధులు నిర్వర్తిస్తున్న దేశంలోనే ఈ సిబ్బంది పిల్లలు చదువుకుంటున్నారు. -
‘జన్మతః పౌరసత్వ రద్దు’ బిల్లు సెనేట్‌కు
వాషింగ్టన్: అక్రమంగా లేదంటే తాత్కాలిక వీసాల మీద వలస వచ్చిన వాళ్లకు అమెరికాలో పిల్లలు పుడితే వారికి సంక్రమించే జన్మతః పౌరసత్వాన్ని రద్దుచేస్తూ రూపొందించిన బిల్లును అమెరికా పార్లమెంట్ ఎగువసభ(సెనేట్)లో అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు గురువారం ప్రవేశపెట్టారు. పుట్టే పిల్లలకు ఎలాగూ పౌరసత్వం వస్తుందన్న ఏకైక కారణంతోనే అక్రమ వలసలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఇది జాతీయ భద్రతను బలహీనపరుస్తోందని ఈ బిల్లును ప్రవేశపెట్టిన రిపబ్లికన్ సభ్యులు లిండ్సే గ్రాహమ్, టెడ్ క్రజ్, కేటీ బ్రిట్‌లు సెనేట్‌లో వ్యాఖ్యానించారు. ‘‘ఇన్నాళ్లూ జన్మతః పౌరసత్వాన్ని ప్రసాదించిన ప్రపంచంలోని 33 దేశాల్లో అమెరికా కూడా ఒకటిగా కొనసాగింది. ఈ విధానం చివరకు ‘పుట్టుకల పర్యాటకం’లా తయారైంది. ఉన్నంతలో స్థితిమంతులైన చైనా, ఇతర దేశాల పౌరులు ఉద్దేశపూర్వకంగా అమెరికాకు వచ్చి ఇక్కడ పిల్లల్ని కనేసి తమ సంతానానికి అమెరికా పౌరసత్వం దక్కేలా చేస్తున్నారు. అమెరికాకు ఇంతమంది రావడానికి జన్మతః పౌరసత్వం కూడా ఒక ప్రధాన కారణం’’ అని రిపబ్లికన్ నేతలు చెప్పారు. జన్మతః పౌరసత్వాన్ని రద్దుచేస్తూ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తుర్వును విపక్ష డెమొక్రటిక్ పాలిత రాష్ట్రాలు ఫెడరల్ కోర్టులో సవాల్ చేసి ఉత్తర్వు అమలుపై స్టే తెచ్చుకున్న వేళ రిపబ్లికన్ సర్కార్ బిల్లును ప్రవేశపెట్టడం గమనార్హం. -
పుట్టుకతో వచ్చే పౌరసత్వం: భారత్ సహా ఏ దేశాల్లో ఎలా ఉందంటే..
విదేశీయులకు పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు అమెరికాలో సహజంగా దక్కుతున్న పౌరసత్వ హక్కును రద్దు చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నారు. కానీ, న్యాయస్థానం తాజాగా ఆ ఆదేశాలకు మోకాలడ్డేసింది. దీంతో అప్పీల్‌కు వెళ్లాలని ట్రంప్ నిర్ణయించారు. అయితే.. జన్మతః దక్కే పౌరసత్వం విషయంలో మిగతా దేశాలు ఏం విధానాలు పాటిస్తున్నాయో తెలుసా?.అమెరికా గడ్డపై పుట్టే ప్రతీ ఒక్కరికీ అక్కడి పౌరసత్వం దక్కేలా అక్కడి రాజ్యాంగం హక్కు కల్పించింది. 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆ హక్కు దక్కాలి కూడా. అయితే ఆ హక్కును తనకున్న విశిష్ట అధికారంతో మార్చేయాలని ట్రంప్ భావించారు.ఈ క్రమంలోనే రాజ్యాంగ సవరణతో సంబంధం లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఇకపై అమెరికా నేలపై విదేశీయులకు పుట్టే పిల్లలను అమెరికా పౌరులుగా పరిగణించకూడదన్నది ఆ ఆదేశాల సారాంశం.👉పుట్టే పిల్లలకు పౌరసత్వం వర్తింపజేయడమే బర్త్‌రైట్ సిటిజన్‌షిప్. తల్లిదండ్రుల జాతీయత.. అంటే వాళ్లది ఏ దేశం, ఇమ్మిగ్రేషన్ స్టేటస్.. అంటే ఏ రకంగా వలసలు వచ్చారు ఇలాంటివేవీ పరిగణనలోకి తీసుకోకుండా అమెరికాలో ఇంతకాలం పౌరసత్వ గుర్తింపు ఇస్తున్నారు. అయితే ప్రపంచం మొత్తంగా ‘‘జస్ సాన్‌గ్యుఇనిస్, జస్ సోలి’’ అనే రెండు సిద్ధాంతాల ఆధారంగా సిటిజన్‌షిప్‌ను వర్తింపజేస్తున్నారు. అయితే.. ఎక్కువ దేశాలు మాత్రం పౌరసత్వాన్ని ‘‘జస్ సాన్‌గ్యుఇనిస్’’ ఆధారంగానే పౌరసత్వం అందిస్తున్నాయి . జస్ సాన్‌గ్యుఇనిస్ అంటే.. వారసత్వంగా(రక్తసంబంధంతో) పౌరసత్వ హక్కు పొందడం. జస్ సోలి అంటే.. ఫలానా దేశంలో పుట్టిన కారణంగా ఆ దేశ పౌరసత్వ హక్కు లభించడం. 👉ఇప్పటిదాకా అమెరికా మాత్రమే కాదు.. మరికొన్ని దేశాలు పుట్టుకతో పౌరసత్వం విషయంలో జస్ సోలి వర్తింపజేస్తున్నాయి. అందులో అమెరికా పొరుగుదేశాలైన కెనడా కూడా ప్రధానంగా చెప్పుకోవాలి. అమెరికా తరహాలోనే ఈ దేశం కూడా తమ గడ్డపై పుట్టే విదేశీయుల పిల్లలకు జన్మతః పౌరసత్వం వర్తింపజేస్తోంది. అయితే అమెరికాలోలానే ఇక్కడా దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.👉అమెరికా రెండు ఖండాల్లో మెక్సికో, అర్జెంటీనాతో సహా చాలాదేశాలే ఈ జాబితాలో ఉన్నాయి. అయితే.. చిలీ, కంబోడియా మాత్రం ఇవ్వడం లేదు. ఆ దేశాలు జస్ సాన్‌గ్యుఇనిస్ ఆధారంగా పౌరసత్వం అందించడంపై ప్రధానంగా దృష్టిసారించాయి. 👉యూరప్, ఆసియా, ఆఫ్రికా.. చాలా దేశాలు జస్ సాన్‌గ్యుఇనిస్ మీదే జన్మతః పౌరసత్వాన్ని అందిస్తున్నాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం షరతులతో కూడిన సడలింపులు ఇచ్చాయి ఉదాహరణకు.. జర్మనీ, ఫ్రాన్స్‌లాంటి దేశాలు తమ దేశాల్లో పుట్టే పిల్లలకు సంబంధించి.. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తమ దేశాల్లో నివాసం ఏర్పాటు చేసుకుని కొన్నేళ్లపాటు(ప్రస్తుతం 8 సంవత్సరాలుగా ఉంది) జీవించి ఉండాలి. అలా ఉంటే ఆ పిల్లలకు ఆ దేశాల పౌరసత్వం వర్తిస్తుంది. అలాగే.. కొన్ని దేశాలు న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని కూడా పౌరసత్వం ఇస్తున్నాయి.👉భారత్‌లో జన్మతఃపౌరసత్వంపై కఠిన నిబంధనలు ఉన్నాయి. జస్ సాన్గ్యుఇని అనుసరిస్తోంది మన దేశం. అంటే.. వారసత్వంగా రక్తసంబంధీకులకు పౌరసత్వం వర్తిస్తుందన్నమాట. అయితే.. 1928లో మోతిలాల్ నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ.. జస్ సోలిని భారత్‌లోనూ వర్తింపజేయాలని ప్రతిపాదించింది. అంటే.. భారత గడ్డపై జన్మించే విదేశీయులకు కూడా ఇక్కడి పౌరసత్వం వర్తింపజేయాడన్నమాట. జస్ సాన్గ్యుఇని ‘జాతి భావన’ మాత్రమే ప్రతిబింబిస్తుందని, అదే జస్ సోలి అనేది సమాన హక్కుల భావనను చూపిస్తుందని ఈ కమిటీ అభివర్ణించింది. ఈ కమిటీలో నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, తేజ్ బహదూర్ సప్రూ ఉన్నారు.1949లో రాజ్యాంగం కూడా ఈ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంది. కానీ, కాలక్రమేణా భారత్‌లో వారసత్వ పౌరసత్వానికే ప్రాధాన్యం లభించింది. 1955లో భారత పౌరసత్వ చట్టం.. జన్మతః పౌరసత్వ చట్టాలకు కఠిన నిబంధనలను చేర్చింది. తల్లిదండ్రుల్లో ఒకరు కచ్చితంగా భారత పౌరసత్వం ఉన్నవాళ్లు ఉండాలి. మరొకరు చట్టపరంగా వలసదారు అయి ఉంటే సరిపోతుంది.👉జపాన్‌లోనూ కఠిన నిబంధనలే అమలు అన్నాయి. అయితే ఏ జాతీయత లేని స్థితిలో ఆ పిల్లలకు అక్కడి పౌరసత్వం ప్రసాదిస్తారు. స్పెయిన్‌లో పేరెంట్స్‌లో ఎవరో ఒకరికి కచ్చితంగా పౌరసత్వం ఉండాలి. లేదంటే ఎలాంటి జాతీయత లేని పిల్లలైనా అయి ఉండాలి.👉ఇటలీలో బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై పరిమితులున్నాయి. పేరెంట్స్‌లో ఎవరో ఒకరికి ఇటలీ పౌరసత్వం ఉండాలి. లేదంటే.. ఆ బిడ్డకు 18 ఏళ్లు నిండేదాకా ఆ దేశంలోనే ఉండాలి. అప్పుడే పౌరసత్వం ఇస్తారు.👉యూకే, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మలేషియా.. ఇలా మరికొన్ని దేశాల్లోనూ తల్లిదండడ్రులు కచ్చితంగా ఆ దేశ పౌరులై ఉంటేనే, లేదంటే శాశ్వత నివాసుతులై ఉంటేనే అక్కడి పౌరసత్వం సంక్రమిస్తుంది. 👉జన్మతః పౌరసత్వ హక్కుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సమానత్వం, ఏకీకరణలతో పాటు జాతీయత విషయంలో న్యాయపరమైన చిక్కులేవీ తలెత్తకుండా ఉంటాయి. అయితే.. అభ్యంతరాలు కూడా అదే స్థాయిలో వినిపిస్తున్నాయి. అక్రమ వలసదారుల్నిప్రొత్సహించడంతో పాటు దేశంపై ఆర్థికపరమైన భారాన్ని మోపుతుంది. ఈ క్రమంలోనే పౌరుల జాతీయత-వలసవిధానం గురించి పెద్ద ఎత్తునే చర్చ నడుస్తోంది. మరోవైపు ఇది ‘‘బర్త్ టూరిజం’’గా మారే ప్రమాదం లేకపోలేదని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య బానిసత్వం, హక్కుల సాధనగా మొదలైన అంతర్యుద్ధం 1861-65 మధ్య కొనసాగింది. దాదాపు 6,20,000 మంది ఈ యుద్ధంలో మరణించారు. ఆ తర్వాత రాజ్యాంగంలోని 14వ సవరణ ద్వారా బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ అమల్లోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అమెరికా గడ్డపై పుట్టే ప్రతీ చిన్నారికి అక్కడి పౌరసత్వం లభిస్తోంది. ఈ 157 ఏళ్ల చరిత్రను రాజ్యాంగ సవరణ ద్వారా కాకుండా.. తన సంతకంతో మార్చేయాలని ట్రంప్ భావించడం విశేషం. -
అమెరికా జన్మతః పౌరసత్వంపై కోర్టుకెక్కిన 22 రాష్ట్రాలు
వాషింగ్టన్: వలసవచ్చిన వారికి అమెరికా గడ్డపై పుడితే వచ్చే జన్మతః పౌరసత్వ హక్కును ట్రంప్ ఒక్క ఉత్తర్వుతో తొలగించడాన్ని విపక్షపాలిత రాష్ట్రాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఈ విషయంపై 22 రాష్ట్రాలు మంగళవారం కోర్టును ఆశ్రయించాయని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. విపక్ష డెమొక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్న 22 రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఫెడరల్ జిల్లా కోర్టుల్లో వేర్వేరుగా రెండు దావాలు వేశాయి. 22 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాలు, శాన్ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ నగరాలు కలిపి మసాచుసెట్స్‌లోని ఫెడరల్ డిస్టిక్ట్ర్ కోర్టులో పిటిషన్ దాఖలుచేశాయి. రాజ్యాంగంలోని 14వ సవరణప్రకారం జన్మతః పౌరసత్వం అనేది ఆటోమేటిక్‌గా అమలవుతుందని వాదించాయి. అధ్యక్షుడిగానీ పార్లమెంట్‌లోని ప్రజా ప్రతినిధులసభ(దిగువ సభ) లేదంటే సెనేట్(ఎగువ సభ)కు కూడా ఈ హక్కు విషయంలో సవరణలు చేసే అధికారం లేదని వాదించాయి. మిగతా నాలుగు రాష్ట్రాలు వాషింగ్టన్‌లోని వెస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశాయి. మీకు ఉన్న ‘తాత్కాలిక నిలుపుదల’, ‘ముందస్తు ఆదేశం’అధికారాలను ఉపయోగించి అధ్యక్షుడి ఉత్తర్వు అమలుకాకుండా అడ్డుకోండి’’అని న్యూజెర్సీ అటార్నీ జనరల్ మాథ్యూ ప్లాట్కిన్ ష్ట్రాలు అభ్యర్థించారు. ‘‘పుట్టగానే పౌరసత్వం రాదు అని ప్రకటించడమంటే మీరంతా అమెరికన్లు కాబోరు అని వివక్షచూపడమే’’అని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా వాదించారు. ట్రంప్ ఉత్తర్వును తప్పుబట్టిన భారతీయ అమెరికన్ చట్టసభ్యులు ట్రంప్ ఉత్తర్వును అమెరికా చట్టసభల్లోని భారతీయమూలాలున్న నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ‘‘ట్రంప్ తీసుకున్న నిర్ణయం అక్రమంగా వలసవచ్చిన వారి పిల్లలను మాత్రమేకాదు చట్టబద్ధంగా హెచ్–1బీ, హెచ్2బీ, బిజినెస్, స్టూడెంట్ వీసాల మీద వచ్చి అమెరికాలో ఉంటున్న వలసదారుల సంతానంపైనా పెను ప్రభావంచూపుతుంది. చట్టబద్ధ వలసవిధానానికి రిపబ్లికన్ పార్టీ వ్యతిరేకం అనే అపవాదు సైతం పడుతుంది. ఏదేమైనా జన్మతః పౌరసత్వం అనేది చట్టబద్ధం. దీని కోసం ఎంతకైనా తెగించి పోరాడతాం’’అని డెమొక్రటిక్ పార్టీ నేత, ప్రతినిధుల సభలో భారతీయ మూలాలున్న నాయకుడు రో ఖన్నా ప్రకటించారు. ‘‘ఒక్క కలంపోటుతో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా రాజ్యాంగవిరుద్ధం. ఇది నిజంగా అమల్లోకి వస్తే దేశంలోని మిగతా చట్టాలను, రాజ్యాంగ నియమాలను అవమానించినట్లే’’అని ప్రతినిధుల సభలో భారతీయ మూలాలున్న నాయకురాలు ప్రమీలా జయపాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే ట్రంప్ ఉత్తర్వుపై వలసదారుల హక్కుల సంఘాల కూటమి కోర్టులో దావావేసింది. -
జన్మతః పౌరసత్వంపై ట్రంప్ వేటు.. ఆర్డర్ జారీ
-
పౌరసత్వ రద్దు యోచన దారుణం: బైడెన్
వాషింగ్టన్: అమెరికాలో జన్మ హక్కు పౌరసత్వాన్ని రద్దు చేయాలన్న కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలను అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా తప్పుబట్టారు. తల్లిదండ్రుల ఇమిగ్రేషన్ హోదాతో నిమిత్తం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ అమెరికా పౌరసత్వం కల్పిస్తోంది. ఈ జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. తాను అధికారం చేపట్టిన తొలి రోజే ఈ మేరకు కార్యనిర్వాహక చర్యలు తీసుకునే ఆలోచన ఉన్నట్టు చెప్పారు. రాజ్యాంగబద్దమైన జన్మహక్కును మార్చాలనే ఆలోచనే దారుణమని బైడెన్ అన్నారు. అమెరికా జని్మంచినవాళ్లు దేశ పౌరులు కాకుండా ఎలా పోతారని ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సరిహద్దు నిబంధనల అమలును బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ద్వైపాక్షిక ఇమిగ్రేషన్ బిల్లుకు మద్దతుగా ఓటేయొద్దని చట్టసభ సభ్యులను ట్రంప్ కోరడం హాస్యాస్పదమన్నారు. ట్రంప్‌కు అధికార మార్పిడి ప్రక్రియ సజావుగా సాగుతోందని బైడెన్ అన్నారు. గత అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం బైడెన్‌కు పగ్గాలు అప్పగించేందుకు ట్రంప్ ససేమిరా అనడం, అధికార మార్పిడి ప్రక్రియను అడ్డుకునేందుకు 2021 జనవరి 6న కాపిటల్ హిల్ భవనంపై దాడికి తన మద్దతుదారులను ఉసిగొల్పడం తెలిసిందే. దాన్ని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా బైడెన్ అభివర్ణించారు. శ్వేతజాతి ఆధిపత్య భావన అమెరికాకు పొంచి ఉన్న పెను ముప్పుల్లో ఒకటన్నారు. ‘‘ప్రపంచంలోనే అత్యంత బహుళ సాంస్కృతిక దేశం మనది. అదే మన బలం కూడా. కాపిటల్ హిల్‌పై దాడిని మన ప్రజాస్వామ్యం తట్టుకున్నందుకు గర్వపడాలి’’అంటూ బైడెన్ ట్వీట్ చేశారు. 2021 తరహా హింసకు తావు లేకుండా ఈసారి అధికార మార్పిడి ప్రక్రియ శాంతియుతంగా సాగుతుందన్నారు. జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతానని కూడా బైడెన్ చెప్పారు. ‘‘2021లో నా ప్రమాణ స్వీకారానికి ట్రంప్ గైర్హాజరయ్యారు. అయినా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఇటీవల ఆయన్ను వైట్‌హౌస్‌కు ఆహ్వానించా’’అని గుర్తు చేశారు. -
సుపరిపాలన మన జన్మహక్కు
న్యూఢిల్లీ: స్వపరిపాలన లాగే.. సుపరిపాలన కూడా భారతీయుల జన్మ హక్కు అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా ఈ దిశగానే పనిచేస్తోందని ఆయన వెల్లడించారు. వినియోగంలోలేని పాత చట్టాలను రద్దుచేసి నవభారతం కోసం కొత్త రూపుతో ముందుకెళ్తున్నామని మోదీ వ్యాఖ్యానించారు. మాసాంతపు రేడియో కార్యక్రమం మన్‌కీ బాత్ ద్వారా ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘బాలాగంగాధర్ తిలక్ ఇచ్చిన స్వరాజ్యం నా జన్మహక్కు అనే పిలుపును గుర్తుచేసుకోవాలి. ఇప్పుడు సుపరిపాలన మన జన్మహక్కు అని కోరే సమయం ఆసన్నమైంది. ప్రతి భారతీయుడు సుపరిపాలన ఫలాలు పొందాలి. సానుకూల అభివృద్ధి ఫలితాల్లో భాగస్వామి కావాలి. నవభారత నిర్మాణం కోసం మేం చేస్తున్న ప్రయత్నాల అంతిమ లక్ష్యం కూడా ఇదే’ అని ప్రధాని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో బాలాగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్‌ల పోరాటాన్ని మన్‌కీబాత్‌లో మోదీ గుర్తుచేశారు. చెత్త ఏరుకునే కుటుంబం నుంచి వచ్చిన ఆశారామ్ చౌదరీ అనే విద్యార్థి ఎయిమ్స్‌లో వైద్యవిద్యకు సీటును సంపాదించడం దేశానికి గర్వకారణమన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల్లో ‘కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలన’ అనే నినాదాన్ని ప్రధాని తరచుగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. పర్యావరణ అనుకూల గణేశ్ ఉత్సవాలు ప్రకృతితో విభేదించే మార్గాలు సరైనవి కావన్న ప్రధాని పర్యావరణ సమతుల్యతను కాపాడటం ద్వారానే మానవ మనుగడను కొనసాగించగలమన్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్నిచోట్ల వర్షాల్లేకపోవడమే సమతుల్యత దెబ్బతినడానికి ఉదాహరణలన్నారు. ప్రకృతిని ప్రేమించడం, కాపాడటం, వన సంరక్షణ వీటన్నింటిలో ప్రజల సామూహిక భాగస్వామ్యం అవసరమన్నారు. ఈ ఏడాది వినాయక ఉత్సవాలను పర్యావరణ హితంగా జరుపుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. ఉత్సవాల అలంకరణ సామగ్రి నుంచి నిమజ్జనం వరకు ప్రతి చోటా పర్యావరణ హితాన్ని గుర్తుంచుకోవాలన్నారు. విద్యార్థుల జీవితంలో పుస్తకాలు, చదువులకు ప్రత్యామ్నాయమేదీ లేదని ప్రధాని అన్నారు. ఒత్తిడిని పక్కనపెట్టి ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలని ఉన్నత చదువులకోసం కాలేజీల్లో చేరిన విద్యార్థులకు మోదీ సూచించారు. ‘యువత తమ జీవితం కొత్త దశలోకి అడుగుపెట్టే నెల జూలై. విద్యార్థుల దృష్టి ఇంటినుంచి హాస్టళ్ల వైపు మళ్లుతుంది. కొత్త స్నేహాలు చిగురిస్తాయి. కానీ సరైన మిత్రులను ఎంచుకోవాలి’ అని ఆయన సూచించారు. లక్నోలో భూమిపూజ కార్యక్రమంలో ఇటుకపై సంతకంచేస్తున్న ప్రధాని మోదీ. -
జనగామ జిల్లా మా జన్మ హక్కు
జిల్లా ఏర్పాటు కోరుతూ కరపత్రాల పంపిణీ బచ్చన్నపేట : జనగామ జిల్లా మా జన్మ హక్కు అని ఉస్మానియా యునివర్సిటీ విద్యార్థి బాల్ లక్ష్మి, జెడ్పీటీసి వేముల స్వప్నసాగర్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి, జనగామ జిల్లా సాధన మా జన్మహక్కు అనే కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడు తూ అన్ని వసతులు ఉన్న జనగామను జిల్లా కేంద్రంగా ప్రకటించకుండా ఉండడంలో అధికారుల నిర్లక్ష్యం ఉందన్నారు. అన్ని రంగాల్లో జనగామ నియోజకవర్గం వెనకబడి ఉన్నదనీ, జిల్లా చేస్తే అభివృద్ధిపథంలో పయనిస్తుందన్నారు. చేర్యాల ప్రాంతంలో నీటి డ్యాములు ఉన్నందున దీనిని సిద్దిపేట జిల్లాలో కలుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేసే ముందు ఆ ప్రాంత ప్రజల అభిప్రాయాలను సేకరించాల్సి ఉంటుందనీ, అయినా ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే అందరినీ కలుపుకుని పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వీరి వెంట నాయకులు రాపెల్లి వెంకటేష్, పందిపెల్లి సిద్దిరాంరెడ్డి, మల్లం లక్ష్మినారాయణ, అట్ల సందీప్, పెండెం నాగేష్, గౌస్, మంత్రి అయిలు మల్లయ్య, మహేందర్, నారాయణరెడ్డి, బొమ్మెన అంజనేయులు, ప్రకాష్, నేరెళ్ల రాజయ్య, నల్లగోని బాలకిషన్, రాగీరు సత్యనారాయణ ఉన్నారు. -
స్వాతంత్య్రం కొందరికే జన్మహక్కు
సందర్భం నేర న్యాయ వ్యవస్థ సాగతీత ఫలితంగా జైలు లోపలి జైలులో (తీహార్ కారాగా రంలోని హైరిస్క్ విభాగం) ఆరేళ్ల నుంచి మగ్గుతున్న నన్ను స్వాతంత్య్రం గురించి రాయమని అడగడం వెటకారమే. జబ్బు పడినప్పుడు ఆస్పత్రికి వెళ్లడానికి గానీ, చివరికి ప్రధాన కారాగార ప్రాంగణం లోకి వెళ్లడానికి గానీ ఇక్కడ ఎంత మా త్రం స్వేచ్ఛ లేదు. ఒక కొసన అరాచకత్వం, మరో కొసన కేంద్రీకృత ప్రజాస్వామ్యాలతో స్వాతంత్య్రం సాపేక్షంగా ఉంటుంది. ప్రస్తుతం అమలులో ఉన్నవాటిలో కొన్ని వ్యవస్థలు ఇతర వ్యవస్థల కంటే ఎక్కువ స్వాతంత్య్రం కలిగి ఉన్నాయి. భార తదేశంలో వెండితెర వేల్పులు, క్రికెట్ తారలు, వాణిజ్య, రాజకీయ రంగ ప్రముఖులు వీలైనంత స్వాతంత్య్రం అనుభవించగలుగు తారు. ఆఖరికి హత్య చేసి కూడా తప్పించుకోగలరు. కానీ పేద రైతులు రెండు పూటలా సరైన తిండికి నోచుకోరు. అస్వస్థులైతే వారి పిల్లలు వైద్యానికి కూడా నోచుకోరు. నా వరకు జైలు జీవితం అంటే, ఒంటరితనపు భీతిని అనుభవిస్తున్న మనిషికిస్వాతంత్య్రా న్ని నిరాకరించడమే. కానీ ఇది సామాన్య నేరగాడికి వర్తించదు. అతడు జైలు జీవితానికి అలవాటు పడిపోతాడు. తన నేర కార్యక లాపాలను సైతం అక్కడ నుంచే నిర్వర్తించుకుంటాడు. జైలులో స్వాతంత్య్రం లేదన్న అంశమే అతడికి పట్టదు. వారిలో చాలామం ది విడుదలైనప్పటికీ కావాలని మళ్లీ జైలుకు తిరిగి వస్తుంటారు. స్వాతంత్య్రం అనేది బాగా వక్రీకరణకు గురైన మాటలలో ఒకటి. పాశ్చాత్య దేశాల పత్రికలు కొన్ని విలువలను సున్నితంగా నూరిపోసి దాన్నే స్వాతంత్య్రమని భ్రమింపజేస్తున్నారు. నియం త్రిత ఆంక్షల మధ్య పనిచేసే చైనా మీడియాలో మాత్రం అలాంటి స్వేచ్ఛ లేదని చెబుతారు. భారత్, అమెరికా దేశాలు ప్రపంచం లోనే గరిష్టంగా స్వాతంత్య్రం అనుభవిస్తున్న అతి పెద్ద ప్రజాస్వా మిక వ్యవస్థలుగా పేరుపొందాయి. అయితే అలాంటి స్వాతం త్య్రాన్ని మీరు అనుభవిస్తున్నారా అని అమెరికాకు చెందిన ఒక నల్ల జాతీయుడిని, లేదా భారతదేశంలో ఒక దళితుడిని అడగండి. ఇప్ప టి బ్రాహ్మణీయ పాలకులకంటే, వెళ్లిపోయిన బ్రిటిష్ వారే ఎంతో మెరుగని దళితులు తరచూ భావిస్తుంటారు. బ్రిటిష్ కాలంలో కుల అణచి వేతలు మరీ బరితెగించలేదు. ఆ విషయంలో అగ్రకులాలు ఎంతో క్రూరంగా, అమానవీయంగా ఉన్నాయి. మరీ దారుణం అనకపోయినా మాటలకు సంబంధించిన ఇలాంటి వక్రీకరణ చాలా కోణాల నుంచి కనిపిస్తుంది. ఉదాహ రణకి పోలీసులనీ, మా ఖైదీలను తీసుకోండి. వేసవిలో ఒక్కరు కూర్చున్నా కూడా ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉండే వ్యాను లో 3/3 కొలతలున్న ప్రదేశంలో కుక్కుతారు. ఇక్కడ ఆరోగ్య పరిస్థితి, వయసు ఏదీ పరిగణనలోనికి రావు. కోర్టు లాకప్ దగ్గరకు వచ్చేసరికి ప్రతి వారిని అవమానకరమైన రీతిలో తనిఖీ చేస్తారు. ఆ తనిఖీలో ఒక పెన్ను దగ్గర ఉన్నా అనుమానించదగినదే (కొన్ని సందర్భాలలో కళ్లజోడు కూడా). ఇక్కడ బంధువులను కలుసుకో వడానికే కాదు, మా న్యాయవాదులను కలుసుకోవడానికి కూడా చాలామంది ఇన్స్పెక్టర్లు మమ్మల్ని అనుమతించరు. కానీ ఇలాంటి సమస్య మాకేదీ ఎదురు కాలేదని జైలులో డాన్లు చెబుతారు. ఆ వ్యాన్లలో వచ్చే పోలీసులు తరచుగా భారతదేశంలో స్వాతం త్య్రం, ప్రజాస్వామ్యాల గురించి అనర్గళంగా ముచ్చట్లాడుకుంటూ ఉంటారు. పలు నిబంధనలు, ఆఖరికి ఎన్నో తీర్పులు శిక్ష పడిన ఖైదీల (రిమాండ్ ఖైదీల సంగతి చెప్పక్కరలేదు) పట్ల మర్యాదగా వ్యవహరించాలనే చెబుతున్నాయి. కానీ ఇది పుస్తకాలకే పరిమి తం. జైలు గోడల మధ్య ఉన్నవారి ఆత్మ గౌరవాన్ని గాయపరచ డం అనేది నేర న్యాయవ్యవస్థకు మామూలైపోయింది. అయితే మీరు ఒక వ్యాపార ప్రముఖుడో, సినిమా నటులో, ఇంకా డాన్ అయితే ఇలాంటిదేమీ జరగదు. మిగిలిన వ్యవస్థలతో పోల్చుకుంటే న్యాయవ్యవస్థ మెరుగ్గానే ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు స్థాయిలో కూడా ఇటీవల కొన్ని ప్రశ్నార్థక మైన తీర్పులు వెలువడడం గమనిస్తాం. నా కేసునే తీసుకోండి. నాది కాని నేరాంగీకారం ఆధారంగా దీనిని నమోదు చేశారు. తెలంగాణ పోలీసుల అధీనంలో ఉండగా నేను సంతకం కూడా చేయని, నేను చదవలేని, రాయలేని, అర్థం చేసుకోలేని భాషలో (తెలుగు) తయారైన నేరాంగీకారం ఆధారంగా ఈ కేసు పెట్టారు. దీనిని నేను కోర్టులో ఖండించినప్పటికీ కేసు నమోదైపోయింది. పది నుంచి పదిహేను కేసుల వరకు నా మీద మోపారు. రెండు కేసులలో చార్జిషీట్లు దాఖలైనప్పటికీ, హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ నా మీద ఇంకా కేసులు పెండింగ్‌లోనే ఉంటాయి. ఢిల్లీ నగరంలో నా మీద నమోదైన కేసు విచారణ పూర్తయ్యే వరకు, ఢిల్లీ బయట నమోదైన కేసులకు సంబంధించి నేను కోర్టులకు హాజరు కాకుండా లెఫ్టినెంట్ గవర్నర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేయ డమే ఇందుకు కారణం. కాబట్టి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తెలం గాణ/ ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానాల మీద కూడా తన వాస్తవ అధి కారాన్ని రూఢీ చేసుకున్నారు. ఇవన్నీ చూస్తే స్వాతంత్య్రం అనేది సాపేక్షమే కాకుండా, సంచలనాత్మకం కూడా అనిపిస్తుంది. నిజా నికి, మానవత్వం, న్యాయం లేకుండా స్వాతంత్య్రానికి అర్థంలేదు. పాశ్చాత్య పదాలలో తప్ప నైరూప్య స్వాతంత్య్రం అనేది లేనేలేదు. ఎవరైనాగానీ స్వా తంత్య్రం గురించి తక్కువ గాను, మానవత, న్యాయాల గురించి ఎక్కువగాను మాట్లాడవలసిన అవసరం ఉంది. వీటి ఫలితం తప్పనిసరిగా స్వాతంత్య్రమే కావాలి. (వ్యాసకర్త మావోయిస్టు నేత. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద తీహార్ జైలులో ఉండి విచారణను ఎదుర్కొంటున్నారు.) - కోబడ్ గాంధీ (ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యంతో...)