చిత్రంలో యూపీ గవర్నర్ రామ్‌నాయక్, సీఎం యోగి, రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: స్వపరిపాలన లాగే.. సుపరిపాలన కూడా భారతీయుల జన్మ హక్కు అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా ఈ దిశగానే పనిచేస్తోందని ఆయన వెల్లడించారు. వినియోగంలోలేని పాత చట్టాలను రద్దుచేసి నవభారతం కోసం కొత్త రూపుతో ముందుకెళ్తున్నామని మోదీ వ్యాఖ్యానించారు. మాసాంతపు రేడియో కార్యక్రమం మన్‌కీ బాత్ ద్వారా ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘బాలాగంగాధర్ తిలక్ ఇచ్చిన స్వరాజ్యం నా జన్మహక్కు అనే పిలుపును గుర్తుచేసుకోవాలి. ఇప్పుడు సుపరిపాలన మన జన్మహక్కు అని కోరే సమయం ఆసన్నమైంది.
ప్రతి భారతీయుడు సుపరిపాలన ఫలాలు పొందాలి. సానుకూల అభివృద్ధి ఫలితాల్లో భాగస్వామి కావాలి. నవభారత నిర్మాణం కోసం మేం చేస్తున్న ప్రయత్నాల అంతిమ లక్ష్యం కూడా ఇదే’ అని ప్రధాని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో బాలాగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్‌ల పోరాటాన్ని మన్‌కీబాత్‌లో మోదీ గుర్తుచేశారు. చెత్త ఏరుకునే కుటుంబం నుంచి వచ్చిన ఆశారామ్ చౌదరీ అనే విద్యార్థి ఎయిమ్స్‌లో వైద్యవిద్యకు సీటును సంపాదించడం దేశానికి గర్వకారణమన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల్లో ‘కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలన’ అనే నినాదాన్ని ప్రధాని తరచుగా వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.
పర్యావరణ అనుకూల గణేశ్ ఉత్సవాలు
ప్రకృతితో విభేదించే మార్గాలు సరైనవి కావన్న ప్రధాని పర్యావరణ సమతుల్యతను కాపాడటం ద్వారానే మానవ మనుగడను కొనసాగించగలమన్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్నిచోట్ల వర్షాల్లేకపోవడమే సమతుల్యత దెబ్బతినడానికి ఉదాహరణలన్నారు. ప్రకృతిని ప్రేమించడం, కాపాడటం, వన సంరక్షణ వీటన్నింటిలో ప్రజల సామూహిక భాగస్వామ్యం అవసరమన్నారు. ఈ ఏడాది వినాయక ఉత్సవాలను పర్యావరణ హితంగా జరుపుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.
ఉత్సవాల అలంకరణ సామగ్రి నుంచి నిమజ్జనం వరకు ప్రతి చోటా పర్యావరణ హితాన్ని గుర్తుంచుకోవాలన్నారు. విద్యార్థుల జీవితంలో పుస్తకాలు, చదువులకు ప్రత్యామ్నాయమేదీ లేదని ప్రధాని అన్నారు. ఒత్తిడిని పక్కనపెట్టి ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలని ఉన్నత చదువులకోసం కాలేజీల్లో చేరిన విద్యార్థులకు మోదీ సూచించారు. ‘యువత తమ జీవితం కొత్త దశలోకి అడుగుపెట్టే నెల జూలై. విద్యార్థుల దృష్టి ఇంటినుంచి హాస్టళ్ల వైపు మళ్లుతుంది. కొత్త స్నేహాలు చిగురిస్తాయి. కానీ సరైన మిత్రులను ఎంచుకోవాలి’ అని ఆయన సూచించారు.
లక్నోలో భూమిపూజ కార్యక్రమంలో ఇటుకపై సంతకంచేస్తున్న ప్రధాని మోదీ.
Comments
Please login to add a commentAdd a comment