![Federal judge blocks Trump administration orders affecting USAID workers](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/u-tr.jpg.webp?itok=E7AHyaA2)
యూఎస్‌ఎయిడ్ ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వును నిలుపుదలచేసిన జడ్జి
వాషింగ్టన్: అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ డజన్లకొద్దీ కార్యనిర్వాహక ఉత్తర్వులిస్తూ అన్ని దేశాలను కలవరపరుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో న్యాయస్థానం మొట్టికాయ వేసింది. వలస వచ్చిన వాళ్లకు పిల్లలు పుడితే వారికి దక్కే జన్మతః పౌరసత్వ హోదాను రద్దుచేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులు ఇచ్చిన ట్రంప్‌ను ఇప్పుడు అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ(యూఎస్‌ఎయిడ్) ఉద్యోగుల విషయంలోనూ మరో కోర్టు కట్టడిచేసింది.
వేలాది మంది యూఎస్‌ఎయిడ్ ఉద్యోగులను ఉద్యోగాలు మానేసి 30 రోజుల్లోపు స్వదేశానికి తిరిగొచ్చేయాలని ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను వారం రోజులపాటు నిలుపుదల చేస్తున్నట్లు యూఎస్ డిస్ట్రిక్ కోర్ట్ జడ్జి కార్ల్ నిఖోల్స్ శుక్రవారం రాత్రి మధ్యంతర తీర్పు వెలువరిచారు. యూఎస్‌ఎయిడ్‌ను శాశ్వతంగా మూసేస్తానంటూ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ పెట్టిన కొన్ని గంటలకే ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా తాత్కాలిక తీర్పు వెలువడటం విశేషం.
విదేశాల్లో యూఎస్‌ఎయిడ్ ఉద్యోగులు, వారి జీవితభాగస్వాములు, చదువుకుంటున్న వారి పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైన వేళ కోర్టు ఉత్తర్వులతో తాజాగా వారికి భారీ ఊరట లభించింది. అయితే ఈ విభాగానికి నిధులు ఆపేయాలంటూ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేయాలంటూ ది అమెరికన్ ఫారెన్ సర్విస్ అసోసియేషన్, ది అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంస్థలు చేసిన విజ్ఞప్తిని జడ్జి తిరస్కరించారు.
ట్రంప్ ప్రభుత్వం ఆదేశించడంతో యూఎస్‌ఎయిడ్‌లో ఇప్పటికే 500 మంది ఉద్యోగులు సెలవులపై వెళ్లగా మరో 2,200 మంది శనివారమే సెలవుపై వెళ్లాల్సి ఉంది. యూఎస్‌ఎయిడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో సహాయక, అభివృద్ధి, దాతృత్వకార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రతి ఏటా వందల కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు. 2016 గణాంకాల ప్రకారం యూఎస్‌ఎయిడ్ ప్రభుత్వ విభాగంలో 10,235 మంది ఉద్యోగులు ఉన్నారు.
వీరిలో మూడింట రెండొంతుల మంది విదేశాల్లో పనిచేస్తున్నారు. విదేశాలకు అపరిమిత సాయం అమెరికాకు గుదిబండగా మారిందని, ఉద్యోగుల్లో 90 శాతం మంది తీసేయాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగానే దశలవారీగా చాలా మంది సెలవుల మీదకు స్వదేశానికి తిరిగొచ్చేయాలని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది. శాశ్వతంగా తిరిగొస్తున్నందున ప్రయాణఖర్చులు కూడా చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే విధులు నిర్వర్తిస్తున్న దేశంలోనే ఈ సిబ్బంది పిల్లలు చదువుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment