
ట్రంప్ బిగ్ షాక్
అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ట్రంప్ సంచలన నిర్ణయాలు
పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు
అక్రమ వలసదార్లను బయటకు పంపించాలని స్పష్టికరణ
టిక్‌టాక్‌పై నిషేధం 75 రోజులపాటు నిలిపివేత
మెక్సికో సరిహద్దుల్లో జాతీయ అత్యవసర పరిస్థితి
క్యాపిటల్ భవనంపై దాడి ఘటనలోని 1,500 మందికి క్షమాభిక్ష
డొనాల్డ్ ట్రంప్ ఆర్డర్లకు కోర్టుల్లో సవాళ్లు ఎదురయ్యే అవకాశం
అమలు కావడం కష్టమే అంటున్న న్యాయ నిపుణులు
ప్రపంచ ఆరోగ్య సంస్థకు గుడ్‌బై
డ్రగ్స్ గ్యాంగ్‌లపై ఉగ్రవాద ముద్ర
వలస నేరగాళ్లకు మరణ శిక్ష
‘పారిస్’ ఒప్పందం నుంచి వెనక్కి
మద్దతుదారులకు క్షమాభిక్ష
వాషింగ్టన్: తాత్కాలిక వీసాలపైనైనా అమెరికాలో ఉద్యోగాలు చేయాలని, సంతానానికి జన్మనివ్వాలని, తద్వారా వారికి అమెరికా పౌరసత్వం దక్కాలని కోరుకొనే భారతీయులతోపాటు ప్రపంచ దేశాల పౌరులకు, అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులకు నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పెద్ద షాక్ ఇచ్చారు. జన్మతః పౌరసత్వం దక్కే విధానానికి మంగళం పాడేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ సంచలన నిర్ణయాలకు తెరతీశారు. అంతా ఊహించినట్లుగానే తనకున్న అసాధారణ అధికారాలు ఉపయోగించుకొని పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు.
స్థానిక కాలమానం ప్రకారం సోమవారం 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన తన కార్యాచరణ ప్రారంభించడం గమనార్హం. గంటల వ్యవధిలోనే పలు కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. తొలుత క్యాపిటల్ వన్ ఎరీనాలో మద్దతుదారుల సమక్షంలో, అనంతరం శ్వేతసౌధం ఓవల్ ఆఫీసులో ఆయన సంతకాలు చేయడం, మరోవైపు ఉత్తర్వులు వెలువడడం వెనువెంటనే జరిగిపోయాయి. వలసలు, వాతావరణ మార్పులు, క్షమాభిక్షలు, జన్మతః పౌరసత్వం రద్దు వంటి కీలక అంశాలపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ అయ్యాయి. పత్రాలపై తన సంతకాన్ని ట్రంప్ బహిరంగంగా ప్రజలకు చూపించారు. ఆ పెన్నులను ఉత్సాహంగా జనంపైకి విసిరేశారు. చరిత్రలోనే అత్యంత అధ్వాన పరిపాలన గత ప్రభుత్వ హయాంలో జరిగిందని ట్రంప్ ఆరోపించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 78 విధ్వంసకర విధానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

అమెరికాకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ ట్రంప్ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు. భారతీయులతోపాటు ప్రపంచదేశాల ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేయగల నిర్ణయాలు సైతం ఉన్నాయి. కానీ, ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లకు చట్టపరమైన రక్షణ కొంతవరకే ఉంటుందని, ఆయన తర్వాత పగ్గాలు చేపట్టబోయే అధ్యక్షులు గానీ, కోర్టులు గానీ వాటిని తిరగదోడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ నిర్ణయాలకు కోర్టుల్లో సవాళ్లు ఎదురుకావడం ఖాయమని అంటున్నారు. నూతన అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఏమిటంటే...
జన్మతః పౌరసత్వం లేనట్లే
అమెరికాలో నివసిస్తున్న అక్రమవలసదార్లకు, వలస వచ్చినవారికి, తాత్కాలిక వీసాలపై ఉంటున్నవారికి అమెరికా గడ్డపై సంతానం జన్మిస్తే.. ఇకపై జన్మతః అమెరికా పౌరసత్వం లభించదు. తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా ఇక్కడ పుట్టిన వారి బిడ్డలకు జన్మతః పౌరసత్వం లభించే వెసులుబాటు గత శతాబ్ద కాలంగా అమలవుతోంది. ఈ మేరకు వందేళ్ల క్రితమే 14వ రాజ్యాంగ సవరణ చేశారు. 1868లో చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని ట్రంప్ ఆదేశించారు. జన్మతః పౌరసత్వం లభించే అవకాశం ఉండొద్దని తేల్చిచెప్పారు. దీనివల్ల లక్షలాది మందికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి.
ప్రధానంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులకు జన్మించే సంతానానికి ఇక్కడి పౌరసత్వం దక్కడం కష్టమే. అయితే, ఈ విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని కొందరు ఫెడరల్ కోర్టులో సవాలు చేసినట్లు తెలిసింది. చట్టపరంగా ఇది చెల్లదని అంటున్నారు. ట్రంప్ జారీ చేసిన ఆర్డర్ ప్రకారం.. అమెరికా గడ్డపై పుట్టినవారికి పౌరసత్వం రావాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒక్కరైనా అమెరికా పౌరులై ఉండాలి. లేదా చట్టపరమైన శాశ్వత నివాసిత హోదా(గ్రీన్‌కార్డు హోల్డర్) ఉండాలి. ఒకవేళ వలసదార్లు అమెరికా సైన్యంలో పని చేస్తూ ఉంటే వారికి జన్మించే పిల్లలకు కూడా పౌరసత్వం లభిస్తోంది.
అక్రమ వలసదారులంతా వెనక్కే
మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ‘రిమెయిన్ ఇన్ మెక్సికో విధానాన్ని ట్రంప్ పునరుద్ధరించారు. ప్రస్తుతం సరిహద్దుల్లో వేచిచూస్తున్న 70 వేల మంది నాన్–మెక్సికన్ శరణార్థులను వెనక్కి పంపించబోతున్నారు. ‘క్యాచ్ అండ్ రిలీజ్’కు శుభంకార్డు వేశారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని గుర్తించి వెనక్కి పంపబోతున్నారు. శరణార్థులుగా గుర్తించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నవారికి కూడా వదిలిపెట్టరు. అక్రమ వలసదార్లంతా అమెరికాను విడచిపెట్టి వెళ్లిపోవాల్సిందే. లేకపోతే బలవంతంగానైనా వెళ్లగొడతారు. ఈ విషయంలో ట్రంప్ నిర్ణయానికి చట్టపరమైన సవాళ్లు ఎదురుకాబోతున్నాయి.
జాతీయ అత్యవసర పరిస్థితి
అమెరికా సార్వభౌమత్వం ప్రమాదంలో పడిందని ట్రంప్ ఎప్పటినుంచో చెబుతున్నారు. అందుకే మెక్సికో సరిహద్దుల్లో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు. దీంతో మెక్సికో సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి, గోడ నిర్మాణానికి స్వేచ్ఛగా నిధులు వాడుకొనే అవకాశం ట్రంప్‌కు లభించింది.

డ్రగ్స్ గ్యాంగ్‌లపై ఉగ్రవాద ముద్ర
అమెరికాలో చెలరేగిపోతున్న మాదక ద్రవ్య ముఠాలు, అంతర్జాతీయ డ్రగ్స్ గ్యాంగ్‌లను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా పరిగణిస్తూ ట్రంప్ ఉత్తర్వు జారీ చేశారు. ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలున్న జాబితాలో ఇవి చేరబోతున్నాయి. అంటే డ్రగ్స్ గ్యాంగ్‌లపై ఇక కఠిన చర్యలు తీసుకోబోతున్నారు.
ఇంధన అత్యవసర పరిస్థితి
ట్రంప్ జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. చమురు నిల్వలు పెంచాలని ఆదేశించారు. శిలాజ ఇంధనాల ఉత్పత్తిని భారీ పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాస్కా నుంచి చమురు, గ్యాస్, ఇతర సహజ వనరులను భారీగా సమీకరించాలని పేర్కొంటూ ఉత్తర్వుపై సంతకం చేశారు. హరిత ఉద్యోగాల(గ్రీన్ జాబ్స్) కల్పనకు జో బైడెన్ తీసుకొచ్చిన గ్రీన్ న్యూ డీల్‌ను నిలిపివేశారు.
టిక్‌టాక్ మరో 75 రోజులు
అమెరికాలో టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తూ తీసుకొచ్చిన చట్టం అమలును ట్రంప్ 75 రోజులపాటు వాయిదా వేశారు. చైనాకు చెందిన టిక్‌టాక్‌కు ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదు. టిక్‌టాక్‌ను తొలుత వ్యతిరేకించిన ట్రంప్ తర్వాత సానుకూలంగా మారిపోయారు. ఎన్నికల ప్రచారంలో ఈ మాధ్యమాన్ని చక్కగా వాడుకున్నారు.
కొత్త నియామకాలకు చెల్లు!
అమెరికా సైన్యంతోపాటు కొన్ని ఇతర విభాగాల్లో తప్ప ప్రభుత్వంలో కొత్త నియామకాలు చేపట్టవద్దని ట్రంప్ తేలి్చచెప్పారు. ప్రభుత్వంపై ట్రంప్ పూర్తి పట్టుసాధించేదాకా నియామకాలు ఉండవు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులంతా ఆఫీసులకు కచ్చితంగా హాజరై విధులు నిర్వర్తించాల్సిందేనని, ఇంటి నుంచి పనిచేసే వెలుసుబాటు ఎవరికీ ఉండదని ట్రంప్ స్పష్టంచేశారు.
భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పునరుద్ధరణ
దేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పునరుద్ధరిస్తూ, ప్రభుత్వ సెన్సార్íÙప్‌ను నియంత్రిస్తూ ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. జో బైడెన్ హయాంలో డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ వంటి సంస్థల సాగించిన కార్యకలాపాలపై విచారణ జరపాలని అటార్నీ జనరల్‌ను ఆదేశించారు.
విదేశాలకు సాయం నిలిపివేత
విదేశాలకు ఆర్థిక సాయం తాత్కాలికంగా నిలిపివేస్తూ మరో నిర్ణయం తీసుకున్నారు. విదేశాలకు సహాయం అందించే కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో సమీక్షిస్తామని తెలిపారు. ‘అమెరికా ఫస్ట్’ విదేశాంగ విధానంలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వెనెజ్‌వెలాపై ఆంక్షలు పునరుద్ధరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాల జాబితాలో క్యూబాను మళ్లీ చేర్చారు.
పౌరుల జీవన వ్యయం తగ్గింపు
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు పౌరుల జీవన వ్యయాన్ని గణనీయంగా తగ్గించాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఇళ్లు, ఆరోగ్య సంరక్షణ, గృహోపకరణాలు, నిత్యావసరాలు, ఇంధనం ధరలు తగ్గించాలన్నారు. దీనిపై వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని చెప్పారు. జీవన వ్యయం ఏ మేరకు తగ్గిందో 30 రోజుల్లోగా తనకు నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు.
ఇకపై గల్ఫ్ ఆఫ్ అమెరికా
గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చాలని ట్రంప్ స్పష్టంచేశారు. అలాస్కాలోని మౌంట్ డెనాలీ పేరును మౌంట్ మెక్‌కిన్లీగా మార్చాలన్నారు. వాస్తవానికి మౌంట్ మెక్‌కిన్లీ పేరును బరాక్ ఒబామా హయాంలో మౌంట్ డెనాలీగా మార్చారు.
కెనడా, మెక్సికో ఉత్పత్తులపై పన్నుల మోత
కెనడా, మెక్సికో నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులు, వస్తువులపై ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పన్ను లు పెంచాలని ట్రంప్ ఆదేశించారు. చైనా, కెనడా, మెక్సికో తదితర దేశాలతో వాణిజ్య సంబంధాల్లో అనైతిక పద్ధతులపై సమీక్ష నిర్వహించాలన్నారు.
ట్రాన్స్‌జెండర్లకు చేదు వార్త
లింగ మార్పిడి చేయించుకున్నవారికి ట్రంప్ చేదువార్త చెప్పారు. అమెరికాలో ఇకపై పురుష, మహిళ అనే రెండు లింగాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని, మూడో లింగాన్ని గుర్తించడం లేదని స్పష్టంచేశారు. మహిళలు గానీ, పురుషులు గానీ లింగ మార్పిడి చేయించుకోవడానికి వీల్లేదని పేర్కొన్నారు. అయితే, ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో ఇక్కట్లు ఎదురయ్యే అవకాశాలున్నాయి.
మద్దతుదారులకు క్షమాభిక్ష
2021 జనవరి 6వ తేదీన క్యాపిటల్ భవనంపై దాడి కేసులో నిందితులైన తన మద్దతుదారులకు ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించేశారు. దోషులుగా తేలినవారికి విముక్తి కల్పించారు. జైలుశిక్షలు సైతం రద్దు చేశారు. మొత్తానికి ట్రంప్ దాతృత్వం వల్ల 1,500 మందికిపైగా నిందితులు/దోషులు కేసుల నుంచి బయటపడ్డారు. పోలీసులతో ఘర్షణకు దిగి బీభత్సం సృష్టించినవారందరిపై ట్రంప్ కరుణ చూపారు. వారిపై నమోదైన కేసులన్నీ ఒక్క కలంపోటుతో రద్ద య్యాయి. ఇప్పటికే జైలుపాలైన వారంతా ఇక బయటకు రాబోతున్నారు.
వలస నేరగాళ్లకు మరణ శిక్ష
ఉద్యోగం, ఉపాధి కోసం అమెరికాకు వలస వచ్చి నేరాలకు పాల్పడివారికి మరణశిక్ష విధించబోతున్నారు. అమెరికాలో ఇటీవల మరణశిక్షలు విధించలేదు. ట్రంప్ వాటిని పునరుద్ధరిస్తున్నా రు. హత్యలు చేసినవారికి మరణశిక్ష విధి స్తారు. అలాగే యూఎస్ శరణార్థి సెటిల్‌మెంట్ ప్రోగ్రామ్‌ను ట్రంప్ రద్దు చేశారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థకు గుడ్‌బై
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు ట్రంప్ గుడ్‌బై చెప్పేశారు. డబ్ల్యూహెచ్‌ఓ నుంచి అమెరికా తప్పుకొనే ప్రక్రియ ప్రారంభమైనట్లే. ఇది చాలా పెద్ద నిర్ణయమని ఆయన అభివర్ణించారు. 2020లో కోవిడ్–19 మహమ్మారి ఉధృతి సమయంలో డబ్ల్యూహెచ్‌ఓ వ్యవహార శైలి పట్ల ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అమెరికా పట్ల ఆ సంస్థ స్పందన సక్రమంగా లేదని విమర్శించారు. చైనా పట్ల పక్షపాతం చూపుతోందని మండిపడ్డారు. ట్రంప్ తాజా నిర్ణయంపై డబ్ల్యూహెచ్‌ఓ విచారం వ్యక్తంచేసింది.
పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వెనక్కి
చరిత్రాత్మక పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుంటోంది. తద్వారా వాతావరణ మార్పులను నియంత్రించడంతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కృషికి భారీ విఘాతం కలగబోతోంది. పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి అమెరికా వైదొలగుతున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ తేల్చిచెప్పారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. 2017లో ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. కానీ, మళ్లీ ఆ ఒప్పందంలో భాగస్వామిగా చేరారు.
ఏమిటీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్?
అమెరికా ప్రభుత్వాన్ని శీఘ్రగతిన సంస్కరించడానికి, పరిపాలనను పరుగులు పెట్టించడానికి డొనాల్డ్ ట్రంప్ ఎంచుకున్న మార్గం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. కాంగ్రెస్ అనుమతి లేకుండానే అధ్యక్షుడు కొన్ని నిర్ణయాలు తీసుకొనే అధికారం ఇలాంటి ఉత్తర్వుల ద్వారా లభిస్తుంది. అయితే, కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రభుత్వం ఎలా వ్యవహరించాలని అధ్యక్షుడు కోరుకుంటాడో ఆ మేరకు కొన్ని స్టేట్‌మెంట్లపై సంతకాలు చేస్తాడు. ఆ స్టేట్‌మెంట్లను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఉంటారు. ఇలాంటి ఆర్డర్లు ఒక రకంగా సలహాలు, విజ్ఞప్తుల్లాంటివే. కొన్ని ఆర్డర్లను సవాలు చేయడానికి వీల్లేదు. కొన్నింటిని కోర్టుల్లో సవాలు చేయొచ్చు. కాంగ్రెస్ లేదా కోర్టులు ఇలాంటి ఉత్తర్వులను నిలిపివేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment