executive order
-
జన్మతః పౌరసత్వం రద్దు
వాషింగ్టన్: తాత్కాలిక వీసాలపైనైనా అమెరికాలో ఉద్యోగాలు చేయాలని, సంతానానికి జన్మనివ్వాలని, తద్వారా వారికి అమెరికా పౌరసత్వం దక్కాలని కోరుకొనే భారతీయులతోపాటు ప్రపంచ దేశాల పౌరులకు, అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులకు నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పెద్ద షాక్ ఇచ్చారు. జన్మతః పౌరసత్వం దక్కే విధానానికి మంగళం పాడేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ సంచలన నిర్ణయాలకు తెరతీశారు. అంతా ఊహించినట్లుగానే తనకున్న అసాధారణ అధికారాలు ఉపయోగించుకొని పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు.స్థానిక కాలమానం ప్రకారం సోమవారం 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన తన కార్యాచరణ ప్రారంభించడం గమనార్హం. గంటల వ్యవధిలోనే పలు కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. తొలుత క్యాపిటల్ వన్ ఎరీనాలో మద్దతుదారుల సమక్షంలో, అనంతరం శ్వేతసౌధం ఓవల్ ఆఫీసులో ఆయన సంతకాలు చేయడం, మరోవైపు ఉత్తర్వులు వెలువడడం వెనువెంటనే జరిగిపోయాయి. వలసలు, వాతావరణ మార్పులు, క్షమాభిక్షలు, జన్మతః పౌరసత్వం రద్దు వంటి కీలక అంశాలపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ అయ్యాయి. పత్రాలపై తన సంతకాన్ని ట్రంప్ బహిరంగంగా ప్రజలకు చూపించారు. ఆ పెన్నులను ఉత్సాహంగా జనంపైకి విసిరేశారు. చరిత్రలోనే అత్యంత అధ్వాన పరిపాలన గత ప్రభుత్వ హయాంలో జరిగిందని ట్రంప్ ఆరోపించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 78 విధ్వంసకర విధానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.అమెరికాకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ ట్రంప్ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు. భారతీయులతోపాటు ప్రపంచదేశాల ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేయగల నిర్ణయాలు సైతం ఉన్నాయి. కానీ, ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లకు చట్టపరమైన రక్షణ కొంతవరకే ఉంటుందని, ఆయన తర్వాత పగ్గాలు చేపట్టబోయే అధ్యక్షులు గానీ, కోర్టులు గానీ వాటిని తిరగదోడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ నిర్ణయాలకు కోర్టుల్లో సవాళ్లు ఎదురుకావడం ఖాయమని అంటున్నారు. నూతన అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఏమిటంటే... జన్మతః పౌరసత్వం లేనట్లే అమెరికాలో నివసిస్తున్న అక్రమవలసదార్లకు, వలస వచ్చినవారికి, తాత్కాలిక వీసాలపై ఉంటున్నవారికి అమెరికా గడ్డపై సంతానం జన్మిస్తే.. ఇకపై జన్మతః అమెరికా పౌరసత్వం లభించదు. తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా ఇక్కడ పుట్టిన వారి బిడ్డలకు జన్మతః పౌరసత్వం లభించే వెసులుబాటు గత శతాబ్ద కాలంగా అమలవుతోంది. ఈ మేరకు వందేళ్ల క్రితమే 14వ రాజ్యాంగ సవరణ చేశారు. 1868లో చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని ట్రంప్ ఆదేశించారు. జన్మతః పౌరసత్వం లభించే అవకాశం ఉండొద్దని తేల్చిచెప్పారు. దీనివల్ల లక్షలాది మందికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి.ప్రధానంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులకు జన్మించే సంతానానికి ఇక్కడి పౌరసత్వం దక్కడం కష్టమే. అయితే, ఈ విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని కొందరు ఫెడరల్ కోర్టులో సవాలు చేసినట్లు తెలిసింది. చట్టపరంగా ఇది చెల్లదని అంటున్నారు. ట్రంప్ జారీ చేసిన ఆర్డర్ ప్రకారం.. అమెరికా గడ్డపై పుట్టినవారికి పౌరసత్వం రావాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒక్కరైనా అమెరికా పౌరులై ఉండాలి. లేదా చట్టపరమైన శాశ్వత నివాసిత హోదా(గ్రీన్‌కార్డు హోల్డర్) ఉండాలి. ఒకవేళ వలసదార్లు అమెరికా సైన్యంలో పని చేస్తూ ఉంటే వారికి జన్మించే పిల్లలకు కూడా పౌరసత్వం లభిస్తోంది. అక్రమ వలసదారులంతా వెనక్కే మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ‘రిమెయిన్ ఇన్ మెక్సికో విధానాన్ని ట్రంప్ పునరుద్ధరించారు. ప్రస్తుతం సరిహద్దుల్లో వేచిచూస్తున్న 70 వేల మంది నాన్–మెక్సికన్ శరణార్థులను వెనక్కి పంపించబోతున్నారు. ‘క్యాచ్ అండ్ రిలీజ్’కు శుభంకార్డు వేశారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని గుర్తించి వెనక్కి పంపబోతున్నారు. శరణార్థులుగా గుర్తించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నవారికి కూడా వదిలిపెట్టరు. అక్రమ వలసదార్లంతా అమెరికాను విడచిపెట్టి వెళ్లిపోవాల్సిందే. లేకపోతే బలవంతంగానైనా వెళ్లగొడతారు. ఈ విషయంలో ట్రంప్ నిర్ణయానికి చట్టపరమైన సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. జాతీయ అత్యవసర పరిస్థితి అమెరికా సార్వభౌమత్వం ప్రమాదంలో పడిందని ట్రంప్ ఎప్పటినుంచో చెబుతున్నారు. అందుకే మెక్సికో సరిహద్దుల్లో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు. దీంతో మెక్సికో సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి, గోడ నిర్మాణానికి స్వేచ్ఛగా నిధులు వాడుకొనే అవకాశం ట్రంప్‌కు లభించింది. డ్రగ్స్ గ్యాంగ్‌లపై ఉగ్రవాద ముద్ర అమెరికాలో చెలరేగిపోతున్న మాదక ద్రవ్య ముఠాలు, అంతర్జాతీయ డ్రగ్స్ గ్యాంగ్‌లను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా పరిగణిస్తూ ట్రంప్ ఉత్తర్వు జారీ చేశారు. ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలున్న జాబితాలో ఇవి చేరబోతున్నాయి. అంటే డ్రగ్స్ గ్యాంగ్‌లపై ఇక కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. ఇంధన అత్యవసర పరిస్థితి ట్రంప్ జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. చమురు నిల్వలు పెంచాలని ఆదేశించారు. శిలాజ ఇంధనాల ఉత్పత్తిని భారీ పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాస్కా నుంచి చమురు, గ్యాస్, ఇతర సహజ వనరులను భారీగా సమీకరించాలని పేర్కొంటూ ఉత్తర్వుపై సంతకం చేశారు. హరిత ఉద్యోగాల(గ్రీన్ జాబ్స్) కల్పనకు జో బైడెన్ తీసుకొచ్చిన గ్రీన్ న్యూ డీల్‌ను నిలిపివేశారు. టిక్‌టాక్ మరో 75 రోజులు అమెరికాలో టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తూ తీసుకొచ్చిన చట్టం అమలును ట్రంప్ 75 రోజులపాటు వాయిదా వేశారు. చైనాకు చెందిన టిక్‌టాక్‌కు ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదు. టిక్‌టాక్‌ను తొలుత వ్యతిరేకించిన ట్రంప్ తర్వాత సానుకూలంగా మారిపోయారు. ఎన్నికల ప్రచారంలో ఈ మాధ్యమాన్ని చక్కగా వాడుకున్నారు. కొత్త నియామకాలకు చెల్లు! అమెరికా సైన్యంతోపాటు కొన్ని ఇతర విభాగాల్లో తప్ప ప్రభుత్వంలో కొత్త నియామకాలు చేపట్టవద్దని ట్రంప్ తేలి్చచెప్పారు. ప్రభుత్వంపై ట్రంప్ పూర్తి పట్టుసాధించేదాకా నియామకాలు ఉండవు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులంతా ఆఫీసులకు కచ్చితంగా హాజరై విధులు నిర్వర్తించాల్సిందేనని, ఇంటి నుంచి పనిచేసే వెలుసుబాటు ఎవరికీ ఉండదని ట్రంప్ స్పష్టంచేశారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పునరుద్ధరణ దేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పునరుద్ధరిస్తూ, ప్రభుత్వ సెన్సార్íÙప్ను నియంత్రిస్తూ ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. జో బైడెన్ హయాంలో డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ వంటి సంస్థల సాగించిన కార్యకలాపాలపై విచారణ జరపాలని అటార్నీ జనరల్‌ను ఆదేశించారు. విదేశాలకు సాయం నిలిపివేత విదేశాలకు ఆర్థిక సాయం తాత్కాలికంగా నిలిపివేస్తూ మరో నిర్ణయం తీసుకున్నారు. విదేశాలకు సహాయం అందించే కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో సమీక్షిస్తామని తెలిపారు. ‘అమెరికా ఫస్ట్’ విదేశాంగ విధానంలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వెనెజ్వెలాపై ఆంక్షలు పునరుద్ధరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాల జాబితాలో క్యూబాను మళ్లీ చేర్చారు. పౌరుల జీవన వ్యయం తగ్గింపు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు పౌరుల జీవన వ్యయాన్ని గణనీయంగా తగ్గించాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఇళ్లు, ఆరోగ్య సంరక్షణ, గృహోపకరణాలు, నిత్యావసరాలు, ఇంధనం ధరలు తగ్గించాలన్నారు. దీనిపై వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని చెప్పారు. జీవన వ్యయం ఏ మేరకు తగ్గిందో 30 రోజుల్లోగా తనకు నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. ఇకపై గల్ఫ్ ఆఫ్ అమెరికా గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చాలని ట్రంప్ స్పష్టంచేశారు. అలాస్కాలోని మౌంట్ డెనాలీ పేరును మౌంట్ మెక్కిన్లీగా మార్చాలన్నారు. వాస్తవానికి మౌంట్ మెక్‌కిన్లీ పేరును బరాక్ ఒబామా హయాంలో మౌంట్ డెనాలీగా మార్చారు. కెనడా, మెక్సికో ఉత్పత్తులపై పన్నుల మోత కెనడా, మెక్సికో నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులు, వస్తువులపై ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పన్ను లు పెంచాలని ట్రంప్ ఆదేశించారు. చైనా, కెనడా, మెక్సికో తదితర దేశాలతో వాణిజ్య సంబంధాల్లో అనైతిక పద్ధతులపై సమీక్ష నిర్వహించాలన్నారు. ట్రాన్స్జెండర్లకు చేదు వార్త లింగ మార్పిడి చేయించుకున్నవారికి ట్రంప్ చేదువార్త చెప్పారు. అమెరికాలో ఇకపై పురుష, మహిళ అనే రెండు లింగాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని, మూడో లింగాన్ని గుర్తించడం లేదని స్పష్టంచేశారు. మహిళలు గానీ, పురుషులు గానీ లింగ మార్పిడి చేయించుకోవడానికి వీల్లేదని పేర్కొన్నారు. అయితే, ఈ నిర్ణయాన్ని అమలు చేయడంలో ఇక్కట్లు ఎదురయ్యే అవకాశాలున్నాయి. మద్దతుదారులకు క్షమాభిక్ష 2021 జనవరి 6వ తేదీన క్యాపిటల్ భవనంపై దాడి కేసులో నిందితులైన తన మద్దతుదారులకు ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించేశారు. దోషులుగా తేలినవారికి విముక్తి కల్పించారు. జైలుశిక్షలు సైతం రద్దు చేశారు. మొత్తానికి ట్రంప్ దాతృత్వం వల్ల 1,500 మందికిపైగా నిందితులు/దోషులు కేసుల నుంచి బయటపడ్డారు. పోలీసులతో ఘర్షణకు దిగి బీభత్సం సృష్టించినవారందరిపై ట్రంప్ కరుణ చూపారు. వారిపై నమోదైన కేసులన్నీ ఒక్క కలంపోటుతో రద్ద య్యాయి. ఇప్పటికే జైలుపాలైన వారంతా ఇక బయటకు రాబోతున్నారు.వలస నేరగాళ్లకు మరణ శిక్ష ఉద్యోగం, ఉపాధి కోసం అమెరికాకు వలస వచ్చి నేరాలకు పాల్పడివారికి మరణశిక్ష విధించబోతున్నారు. అమెరికాలో ఇటీవల మరణశిక్షలు విధించలేదు. ట్రంప్ వాటిని పునరుద్ధరిస్తున్నా రు. హత్యలు చేసినవారికి మరణశిక్ష విధి స్తారు. అలాగే యూఎస్ శరణార్థి సెటిల్మెంట్ ప్రోగ్రామ్‌ను ట్రంప్ రద్దు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు గుడ్బైప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు ట్రంప్ గుడ్‌బై చెప్పేశారు. డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా తప్పుకొనే ప్రక్రియ ప్రారంభమైనట్లే. ఇది చాలా పెద్ద నిర్ణయమని ఆయన అభివర్ణించారు. 2020లో కోవిడ్–19 మహమ్మారి ఉధృతి సమయంలో డబ్ల్యూహెచ్ఓ వ్యవహార శైలి పట్ల ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అమెరికా పట్ల ఆ సంస్థ స్పందన సక్రమంగా లేదని విమర్శించారు. చైనా పట్ల పక్షపాతం చూపుతోందని మండిపడ్డారు. ట్రంప్ తాజా నిర్ణయంపై డబ్ల్యూహెచ్ఓ విచారం వ్యక్తంచేసింది.పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వెనక్కిచరిత్రాత్మక పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుంటోంది. తద్వారా వాతావరణ మార్పులను నియంత్రించడంతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కృషికి భారీ విఘాతం కలగబోతోంది. పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి అమెరికా వైదొలగుతున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ తేల్చిచెప్పారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. 2017లో ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. కానీ, మళ్లీ ఆ ఒప్పందంలో భాగస్వామిగా చేరారు. ఏమిటీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్? అమెరికా ప్రభుత్వాన్ని శీఘ్రగతిన సంస్కరించడానికి, పరిపాలనను పరుగులు పెట్టించడానికి డొనాల్డ్ ట్రంప్ ఎంచుకున్న మార్గం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. కాంగ్రెస్ అనుమతి లేకుండానే అధ్యక్షుడు కొన్ని నిర్ణయాలు తీసుకొనే అధికారం ఇలాంటి ఉత్తర్వుల ద్వారా లభిస్తుంది. అయితే, కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రభుత్వం ఎలా వ్యవహరించాలని అధ్యక్షుడు కోరుకుంటాడో ఆ మేరకు కొన్ని స్టేట్మెంట్లపై సంతకాలు చేస్తాడు. ఆ స్టేట్మెంట్లను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఉంటారు. ఇలాంటి ఆర్డర్లు ఒక రకంగా సలహాలు, విజ్ఞప్తుల్లాంటివే. కొన్ని ఆర్డర్లను సవాలు చేయడానికి వీల్లేదు. కొన్నింటిని కోర్టుల్లో సవాలు చేయొచ్చు. కాంగ్రెస్ లేదా కోర్టులు ఇలాంటి ఉత్తర్వులను నిలిపివేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. -
మరో 8 చైనా యాప్‌లపై అమెరికా నిషేధం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదవి వీడే ముందు మరొక నిర్ణయం తీసుకున్నారు. అలీ పే, వీచాట్ సహా చైనాకు చెందిన ఎనిమిది యాప్‌లపై నిషేధం విధిస్తూ మంగళవారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. అమెరికా జాతీయ భద్రత పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ నెల 5 నుంచి అమల్లోకి వచ్చిన నిషేధం 45 రోజులు కొనసాగుతుంది. అలీ పే, కామ్‌స్కానర్, క్యూక్యూ వ్యాలెట్, షేర్ ఇట్, టెన్సెంట్ క్యూక్యూ, వీమ్యాట్, విచాట్ పే, డబ్ల్యూపీఎస్ ఆఫీస్లపై నిషేధం విధించారు. అమెరికాలో ఈ యా‹ప్‌లను విస్తృతంగా వినియోగిస్తున్నారని, చైనా నుంచి ఆ అప్లికేషన్లని నియంత్రిస్తూ ఉండడంతో దేశ భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ట్రంప్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే ఈ యాప్‌లపై నిషేధం విధించినట్టు ట్రంప్ స్పష్టం చేశారు. -
హెచ్–1బీ వీసాదారులకు భారీ ఊరట
వాషింగ్టన్: అమెరికాలో భారతీయ టెక్కీలకు, ఐటీ కంపెనీలకు భారీ ఊరట లభించింది. హెచ్–1బీ వీసాల్లో ట్రంప్ సర్కార్ ప్రతిపాదించిన ఆంక్షల్లో రెండింటిని అమెరికా కోర్టు నిలిపివేసింది. ఈ ఏడాది చివరి వరకు హెచ్–1బీ వీసాలను రద్దు చేస్తూ అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. హెచ్1–బీ వీసా విధానంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకే విఘాతం కలుగుతాయంటూ అమెరికా చాంబర్స్ ఆఫ్ కామర్స్, బే ఏరియా కౌన్సిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ఐటీ దిగ్గజ కంపెనీలు కోర్టుకెక్కాయి. ఆ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి వీసా విధానంలో మార్పులు తీసుకురావడంలో ట్రంప్ సర్కార్ పారదర్శకంగా వ్యవహరించలేదని కాలిఫోర్నియా జిల్లా న్యాయమూర్తి జెఫ్రీ వైట్ వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రభుత్వం వీసా విధానంలో మార్పులపైన చర్చించడానికి, ప్రజల అభిప్రాయాన్ని సేకరించడానికి తగిన సమయం ఇవ్వకుండా హడావుడి నిర్ణయాలు తీసుకున్నారన్న న్యాయమూర్తి విదేశీ ఉద్యోగులకు అధిక వేతనాలు, ఐటీ కంపెనీలు విదేశీ పనివారి నియామకంలో ఉన్న పరిమితుల్ని కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. డిసెంబర్ 7 నుంచి ఈ నిర్ణయాలేవీ అమలు చేయడానికి వీల్లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ తీర్పుపై ఐటీ కంపెనీలు హర్షం వ్యక్తం చేశాయి. బైడెన్ ప్రమాణ కమిటీలో ఇండియన్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ప్రమాణ స్వీకారమహోత్సవానికి వేసిన కమిటీలో ప్రవాస భారతీయుడు మజూ వర్ఘీస్కి చోటు లభించింది. ఈ కమిటీలో తనను ఎంపిక చేయడంపై మజూ హర్షం వ్యక్తం చేశారు. ‘‘జో బైడెన్, కమలా హ్యారిస్‌ల ప్రమాణ స్వీకార మహోత్సవంతో పాటుగా ఆ సంబరాల్లో జరిగే ఇతర కార్యక్రమాల ప్రణాళిక, నిర్వహణ కమిటీలో చోటు లభించడం నాకు గర్వకారణం‘‘ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బైడెన్, కమలా ఎన్నికల ప్రచారంలో కూడా మజూ కీలక సలహాదారుగా వ్యవహరించారు. -
టిక్‌టాక్ విషయంలో ట్రంప్‌కి చుక్కెదురు
న్యూయార్క్: ప్రముఖ వీడియో యాప్ టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమలును ఫెడరల్ జడ్జి తాత్కాలికంగా వాయిదా వేశారు. నిషేధం ఉత్తర్వులు అమల్లోకి రావడానికి కొద్ది గంటల ముందే ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే, అధ్యక్ష ఎన్నికల తర్వాత నవంబర్ నుంచి అమలు కావాల్సిన ఉత్తర్వుల వాయిదాకు కొలంబియా డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి కారల్ నికోలస్ నిరాకరించారు. ఈ నిషేధం తమ వ్యాపారానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని, ఇది ఒప్పందానికి విరుద్ధమని, టిక్‌టాక్ కేవలం యాప్ కాదని, పౌరులందరికీ ఉపయోగపడే ఆధునిక వేదిక అని, తక్షణం నిషేధం విధిస్తే తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని టిక్‌టాక్ న్యాయవాది జాన్హాల్ వాదించారు. టిక్‌టాక్ యాప్ జాతీయ భద్రతకు ప్రమాదకరమని, అమెరికా టిక్‌టాక్ కార్యకలాపాలను అమెరికన్ కంపెనీలకు అమ్మాలని, లేదా దేశం నుంచి నిషేధం ఎదుర్కోవాల్సిందేనని ట్రంప్ ఆగస్టు 6న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసిన సంగతి తెలిసిందే. టిక్‌టాక్‌కి చైనాకి చెందిన బైట్‌డాన్స్ మాతృ సంస్థ. అమెరికాలో కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఈ కంపెనీ యత్నిస్తోంది. ఒరాకిల్, వాల్‌మార్ట్‌లతో వ్యాపారం సాగించడానికి సంప్రదింపులు జరుపుతోంది. దేశ భద్రతకు ఈ యాప్ ప్రమాదకరమని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. అమెరికా పౌరుల సమాచారాన్ని టిక్‌టాక్ ద్వారా చైనాకు చేరవేస్తున్నారని వైట్ హౌస్ అభిప్రాయపడింది. అమెరికాలోని తమ కంపెనీలను రక్షించుకోవడానికి తగు చర్యలు చేపట్టనున్నట్టు చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. -
టిక్‌టాక్, వీ చాట్లపై అమెరికా నిషేధం
వాషింగ్టన్: జాతీయ భద్రతను కాపాడటానికి చైనా సామాజిక యాప్‌లు టిక్ టాక్, వీ చాట్ లను ఆదివారం నుంచి నిషేధిస్తూ అమెరికా ఆదేశాలు జారీచేసింది. దేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకు, దేశ భద్రతకు ముప్పుగా భావించిన భారత్, ఇదివరకే మొత్తం 224 చైనా యాప్‌లపై నిషే«ధించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 15లోపు, టిక్ టాక్, వీ చాట్ యాప్‌ల యాజమాన్యాలు అమెరికా చేతికి రాకపోతే, వాటిపై నిషేధం విధిస్తున్నట్టు ట్రంప్ గతనెలలోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. చైనా దురుద్దేశంతో అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుందని, జాతీయ, ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవడానికి అధ్యక్షుని ఆదేశాల మేరకు ఈ నిషేధం విధిస్తున్నట్టు యూఎస్ కామర్స్ సెక్రటరీ విల్బుర్ రాస్ చెప్పారు. టిక్ టాక్, వీ చాట్‌లాగా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే, ఇదే గతి పడుతుందని, మిగతా సామాజిక మాధ్యమాల యాప్‌లను హెచ్చరించారు. సెప్టెంబర్ 20 నుంచి, ఈ నిషేధం అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. -
అదే ఉద్యోగమైతే అమెరికా రావొచ్చు
వాషింగ్టన్: అమెరికా వెళ్లాలనుకునే భారత్ టెక్కీలకు కాస్త ఊరట లభించింది. హెచ్–1బీ, ఎల్–1 వీసాలపై ప్రయాణం ఆంక్షల్ని ట్రంప్ సర్కార్ స్వల్పంగా సడలించింది. వీసాల నిషేధానికి ముందు పనిచేసిన యాజమాన్యాల దగ్గరే తిరిగి ఉద్యోగాలు లభిస్తే విదేశీ వర్కర్లని అమెరికా రావడానికి అనుమతినిచ్చినట్టు విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది. ఈ మేరకు వీసా ప్రయాణాల ఆంక్షల్ని సవరించింది. అమెరికాలో మళ్లీ పాత ఉద్యోగాలే దొరికితే ఉద్యోగితో పాటు, జీవిత భాగస్వామి, పిల్లలు కూడా అమెరికాకి రావచ్చునని విదేశాంగ విడుదల చేసిన ట్రావెల్ అడ్వయిజరీలో స్పష్టం చేసింది. కోవిడ్–19 సంక్షోభ పరిస్థితుల్లో అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోవడంతో హెచ్–1బీ, ఎల్–1 ఇతర వీసాదారులు అమెరికాలో అడుగు పెట్టకుండా జూన్ 22న అధ్యక్షుడు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అమెరికన్ల ఉద్యోగ అవకాశాలు కాపాడడానికే ఈ ఆంక్షలు వి«ధించినట్టు అప్పట్లో ట్రంప్ వెల్లడించారు. దీనిని ప్రముఖ టెక్కీ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించినా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు జాతి ప్రయోజనాల పరిరక్షణ కోసమే ఈ సడలింపులు చేస్తున్నట్టుగా విదేశాంగ శాఖ వెల్లడించింది. అదే ఉద్యోగమైతే వీసాల మంజూరు అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి ట్రంప్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలతో తిరిగి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. గతంలో ఎవరైనా ఉద్యోగం కోల్పోయి, మళ్లీ ఇప్పుడు అదే సంస్థలో, అదే ఉద్యోగాన్ని పొందితే అమెరికా రావడానికి వీసాలు జారీ చేస్తామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అంతేకాకుండా కరోనా వైరస్‌పై పోరాటానికి ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న వారు, ప్రాణాంతక వైరస్‌లపై పరిశోధనలు చేస్తున్న వారిని కూడా ఆంక్షల నుంచి మినహాయించింది. ఐటీ సంస్థలతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా హెచ్–1బీ వీసాలపై పూర్తి స్థాయి ఆంక్షల్ని వ్యతిరేకించడం వల్ల ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. -
అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధిస్తా
వాషింగ్టన్: చైనాతో విభేదాలు ముదురుతున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన కంపెనీలపై అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కొరడా ఝళిపించారు. చైనాకే చెందిన వీడియో యాప్ టిక్‌టాక్‌పై అమెరికాలో నిషేధం విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఈ యాప్‌ను సొంతం చేసుకునేందుకు చర్చలు జరుపుతోందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘శనివారం కల్లా ఈ చైనా యాప్‌పై చర్యలు తీసుకుంటా. నాకున్న అత్యవసర అధికారాలను వినియోగించుకుంటా లేదా ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులను జారీ చేస్తా’అని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు. టిక్‌టాక్ హక్కులను అమెరికా కంపెనీ కొనుగోలు చేయడం తనకు ఆమోదయోగ్యం కాదని చెప్పారు. అమెరికాలో టిక్‌టాక్ హక్కుల కోసం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వేలకోట్ల ఒప్పందం కుదుర్చుకునేందుకు చురుగ్గా చర్చలు జరుపుతున్నారంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో శుక్రవారం ఒక కథనం వెలువడింది. ఈ చర్చల్లో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్డ్యాన్స్తోపాటు అధ్యక్ష భవనం ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపింది. అమెరికన్ల వ్యక్తిగత గోప్యత, భద్రతకు ప్రమాదకరంగా మారిందంటూ టిక్‌టాక్‌పై విదేశాంగ మంత్రి మైక్ పాంపియో విమర్శలు చేస్తున్నారు. 29 వేల చైనా యాప్‌ల తొలగింపు చైనీస్ యాప్ స్టోర్ నుంచి శనివారం అకస్మాత్తుగా 29,800 యాప్‌లను స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజ సంస్థ యాపిల్ తొలగించింది. ఇందులో 26 వేలకు పైగా గేమ్ యాప్‌లే కావడం గమనార్హం. లైసెన్స్ లేని గేమ్ యాప్‌లపై చైనా అధికారులు చర్యలు తీసుకుంటున్నందునే యాపిల్ ఇలా చేసినట్లు క్విమై అనే పరిశోధన సంస్థ అంటోంది. చైనా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్స్ ప్రభుత్వ నిబంధనలకు లోబడే చాలాకాలంలో పనిచేస్తున్నాయి. ఈ ఏడాది జూలై మొదటి వారంలో యాపిల్ తన యాప్ స్టోర్ నుంచి 2,500 టైటిళ్లను తొలగించింది. ఇందులో ప్రజాదరణ ఉన్న జింగా, సూపర్సెల్ వంటివి కూడా ఉన్నట్లు సమాచారం. -
విగ్రహాల ధ్వంసం: ట్రంప్ కీలక నిర్ణయం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని ప్రముఖ కట్టడాలు, స్మారక చిహ్నాలు, ఇతర విగ్రహాలను ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిశ్చయించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై డొనాల్డ్ ట్రంప్ శనివారం ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ‘‘అమెరికాలోని ప్రముఖ కట్టడాలు, స్మారక చిహ్నాలు, ఇతర విగ్రహాలను పరిరక్షించటానికి.. తాజాగా చోటు చేసుకున్న నేరాలపై చర్యలు తీసుకునే విధంగా కట్టు దిట్టమైన పరిపాలనా పర ఆదేశాలపై సంతకం చేసినందుకు గర్వంగా ఉంది. చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడేవారికి కఠిన కారాగార శిక్షలు ఉంటాయి’’ అని హెచ్చరించారు. ( గుర్రం దింపుతున్నారు!) కాగా, జార్జ్ ఫ్లాయిడ్ హత్య అనంతరం చోటు చేసుకున్న నిరసనల్లో వైట్ హౌస్ దగ్గరలోని మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్ విగ్రహాన్ని నిరసనకారులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం దీనిపై స్పందించిన ట్రంప్.. విధ్వంసానికి పాల్పడుతున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని స్మారక కట్టడాలను, విగ్రహాలను కాపాడుకునేలా ఆదేశాలు తీసుకొస్తామని చెప్పారు. -
సోషల్ మీడియాపై ట్రంప్ ఆంక్షలు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమాలపై కొరడా ఝళిపించారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో వచ్చే సమాచారం నుంచి కంపెనీలకు ఉన్న చట్టపరమైన రక్షణను తొలగించే ఉత్తర్వులపై ట్రంప్ గురువారం సంతకం చేశారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్విట్టర్ జోక్యం చేసుకుంటోందని ఆరోపించిన ఒక రోజులోనే ట్రంప్ ఈ చర్యకు దిగడం గమనార్హం. అంతకుముందు మెయిల్–ఇన్ బ్యాలెట్ పేపర్ల కారణంగా ఎన్నికల్లో అక్రమాలు జరుగుతాయన్న ట్రంప్ ట్వీట్ విషయంలో నిజానిజాలు సరిచూసుకోవాలని సూచిస్తూ ట్విట్టర్ నీలి రంగు ఆశ్చర్యార్థకాన్ని తగిలించడం.. దానిపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. ‘‘అమెరికన్ల వాక్స్వాతంత్య్రాన్ని కాపాడేందుకు, రక్షించేందుకు వీలుగా ఈ రోజు కొన్ని ఉత్తర్వులపై సంతకం చేశాను. ప్రస్తుతం ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమ దిగ్గజాలకు అసాధారణమైన రీతిలో చట్టపరమైన రక్షణ లభిస్తోంది. కంపెనీ తటస్తంగా ఉంటుందన్న సిద్ధాంతం ఆధారంగా ఈ రక్షణ కల్పించారు’’అని ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. అమెరికా వాణిజ్యాన్ని ఏ రకంగానైనా దెబ్బతీసే చర్యలకు దిగితే సామాజిక మాధ్యమాలను నిషేధించేలా ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌కు అధికారాలు కల్పించారు. -
సోషల్ మీడియాకు షాక్ : కత్తి దూసిన ట్రంప్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి చట్టపరమైన రక్షణలను తొలగించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు. సోషల్ మీడియా ఆన్లైన్ కంటెంట్‌ను తనిఖీ చేయడంపై చర్యలు తీసుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ట్విటర్ తో బాటు ఫేస్బుక్ లాంటి సంస్థలపై చట్టపరమైన చర్యలను తీసుకునేందుకు రెగ్యులేటర్స్ కు అధికారం లభించనుంది. (ట్విట్టర్‌ను మూసేస్తా : ట్రంప్) అమెరికా ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛ, ఇతర హక్కులను పరిరక్షించడానికి ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేస్తున్నానని ట్రంప్ ప్రకటించారు. ట్విటర్ లాంటి సోషల్ మీడియా దిగ్గజాలు తటస్థ వేదిక అనే సిద్ధాంతం వాడుకోలేరని గురువారం ఉత్తర్వుపై సంతకం చేసిన తరువాత ట్రంప్ విలేకరులతో అన్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కమ్యూనికేషన్స్ డిసెన్సీ యాక్ట్ ప్రకారం, కొత్త నిబంధనలు రాబోతున్నాయని, ఇక సెన్సార్, లయబిలిటీ ముసుగులో వారి ఆటలు సాగవని, ఇది చాలా పెద్ద విషయమని ట్రంప్ నొక్కి చెప్పారు. అంతేకాదు ఈ విషయంలో రాష్ట్రాలతో కలసి పనిచేయాలని అటార్నీ జనరల్‌కు దిశానిర్దేశం చేస్తున్నామన్నారు. మెయిల్-ఇన్ బ్యాలెట్ విధానానికి వ్యతిరేకంగా ఇటీవల తాను పెట్టిన పోస్టులపై ట్విటర్ ఫ్యాక్ట్ చెక్ లేబుల్ వేయడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలోనే తాజా పరిణామం చోటు చేసుకుంది. కాగా ఫేస్బుక్, ట్విటర్, గూగుల్ లాంటి సామాజిక మాధ్యమాలు పక్షపాతపూరితంగా వ్యవహరిస్తున్నా యంటూ గతం కొంత కాలంగా ఆయన మండిపడుతున్నారు. తాజాగా ట్విటర్ ఫ్యాక్ట్ చెక్ వ్యవహాంతో వివాదం మరింత ముదిరి చివరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కు దారి తీసింది. అయితే ఈ ఉత్తర్వులకు న్యాయపరమైన సవాళ్లు తప్పవని నిపుణులు భావిస్తున్నారు. చదవండి : ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం స్పందన మధ్యవర్తిత్వంపై మోదీకి ఫోన్ చేశా : ట్రంప్ -
అత్యాచారం చేస్తే ఉరిశిక్షే..
సాక్షి, న్యూఢిల్లీ: ‘పసిపిల్లలపై అకృత్యాలకు ఒడిగట్టే వారికి సమాజంలో బతికే అర్హత ఉండొద్ద’న్న వాదనకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. 12 ఏళ్ల లోపు బాలికలపై ఎవరైనా అత్యాచారం చేస్తే వారికి మరణదండన తప్పదని తేల్చిచెప్పింది. ఈ మేరకు లైంగిక అత్యాచార ఘటనల నుంచి పిల్లలను సంరక్షించే చట్టం(పోక్సో)కు సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. శనివారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మంత్రిమండలి సమావేశమైంది. నిర్ణయం అనంతరం చట్టసవరణకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులపై రాష్ట్రపతి సంతకం చేసిన పిదప ఆర్డినెన్స్ వెలువడనుంది. ఇటీవల కథువా, ఉన్నావ్ ఘటనల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. -
హెచ్-1బీ టార్గెట్ గా ట్రంప్ సంతకం
వాషింగ్టన్ : హెచ్-1బీ వీసాలను కఠినతరం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగం సిద్ధం చేశారు. నేడు హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్ మార్పులపై రూపొందించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేయనున్నారు. మరికాసేపట్లో ట్రంప్ ఈ సంతకం చేయనున్నట్టు తెలుస్తోంది. దీంతో దేశీయ ఐటీ రంగం దశదిశ పూర్తిగా మార్పులకు లోనై, కఠినతరమైన నిబంధనలు అమల్లోకి రానున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మిల్వాకీ, విస్కాన్సిన్ విచ్చేస్తున్న ట్రంప్, ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేయనున్నట్టు అడ్మినిస్ట్రేషన్ అధికారులు చెప్పారు. ''బై అమెరికన్, హైర్ అమెరికన్'' పేరుతో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను రూపొందించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మెయిన్ టార్గెట్ హెచ్-1బీ వీసాలేనని అధికారులు చెప్పారు. ఈ ఆర్డర్ తో ''అత్యంత ప్రతిభావంతుల్ని లేదా అత్యధిక వేతన అప్లికెంట్స్'' ను మాత్రమే తీసుకునే లక్ష్యం నెరవేరుతుందని ట్రంప్ కార్యాలయ అధికారులు చెబుతున్నారు. కంపెనీల్లో ప్రతిభావంతులైన విదేశీయులను నియమించుకునేందుకు వీలుగా ఈ హెచ్-1బీ వీసాలను 1990లో అమెరికా కాంగ్రెస్ తీసుకొచ్చింది. కానీ ప్రస్తుతం కంపెనీలు హెచ్-1బీ వీసాల్లో దుర్వినియోగానికి పాల్పడుతూ అమెరికన్ ఉద్యోగాలకు గండికొడుతున్నాయని ప్రస్తుత ప్రభుత్వ వాదన. హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలను తీసుకోనున్నట్టు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇక ఎట్టిపరిస్థితుల్లోనూ తక్కువ వేతనంతో అమెరికన్ లేబర్ ను భర్తి చేసేలా గెస్ట్ వర్కర్లను నియమించుకోనివ్వమని హెచ్చరించారు. దీంతో పాటు ఫెడరల్ నిర్మాణ ప్రాజెక్టులో కూడా అమెరికా తయారుచేసిన ఉత్పత్తులే వాడేలా ఆర్థికవ్యవస్థకు ఊతం కల్పించనున్నామన్నారు. -
ట్రంప్ మరో వివాదాస్పద ఆర్డర్: ఫేస్ బుక్ బ్యాన్
అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికన్లకు, విదేశీయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఒక్క ప్రజలే కాక, దిగ్గజ కంపెనీలు సైతం ట్రంప్ అంటే వణుకుతున్నాయి. ఏడు ముస్లిం మెజార్టి దేశాలపై ట్రావెల్ బ్యాన్ వంటి పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న ట్రంప్, తాజాగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ను లక్ష్యంగా చేసుకున్నారు. అమెరికా వ్యాప్తంగా ఫేస్ బుక్ వాడకంపై నిషేధం విధిస్తూ మరో కార్యవర్గ ఆదేశాలను జారీచేయడానికి ట్రంప్ సిద్ధమయ్యారు. ఫేస్ బుక్ పై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ త్వరలోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను జారీచేయనున్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే ఈ నిషేధాన్ని కొంతమంది రిపబ్లిక్ లీడర్లు అసలు ఒప్పుకోవడం లేదట. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న ఫేక్ న్యూస్(తప్పుడు వార్తలకు)కు వ్యతిరేకంగానే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు ట్రంప్ వారికి చెప్పారట. ఫేక్ న్యూస్ కు వ్యతిరేకంగా ఫేస్ బుక్ కూడా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం పాలనలో భాగమని ట్రంప్ పేర్కొన్నారు. చాలా తప్పుడు కథనాలు, నిజాలకు ప్రత్యామ్నాయ స్టోరీలు ఈ సైట్లో ఎక్కువగా సర్క్యూలేట్ అవుతున్నట్టు చెప్పారు. ట్రంప్ జారీచేయబోతున్న ఆదేశాల్లో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లను తప్పించినట్టు తెలుస్తోంది. ట్రంప్ ఈ నిర్ణయంతో ఫేస్ బుక్ ఉద్యోగుల్లో ఆందోళన ప్రారంభమైంది. ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున్నఫేస్ బుక్ యూజర్లు ఆందోళనలను ప్రారంభించారు. ఒకవేళ ట్రంప్ ఈ ఆర్డర్ ను పాస్ చేస్తే, తాము దానికి మద్దతిస్తామని వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ చెప్పారు. ఈ ప్రతిపాదిత ఆర్డర్ పై స్పందించిన ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, అమెరికాలో బ్యాన్ చేసినప్పటికీ కాలిఫోర్నియా నుంచి తమ ఆపరేషన్లు కొనసాగిస్తామని చెప్పారు. తప్పుడు కథనాలపై పోరాటం చేసే పద్ధతి ఇది కాదని మండిపడ్డారు. ముస్లిం మెజారిటీ దేశాల నుంచి వచ్చే వలసదారులు, శరణార్థులపై ట్రంప్ నిషేధం విధించినప్పుడు, ఆ నిషేధాన్ని ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ తీవ్రంగా తప్పుబట్టారు. విమర్శలతో ట్రంప్ పై మండిపడ్డారు కూడా. మరోవైపు తమ వెబ్ సైట్లో వచ్చిన తప్పుడు సమాచారం కారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు మేలు జరిగిందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ఇవన్నీ ఇప్పుడు ఫేస్ బుక్ ప్రతికూలంగా మారబోతున్నాయి.