వాషింగ్టన్: అమెరికా వెళ్లాలనుకునే భారత్ టెక్కీలకు కాస్త ఊరట లభించింది. హెచ్–1బీ, ఎల్–1 వీసాలపై ప్రయాణం ఆంక్షల్ని ట్రంప్ సర్కార్ స్వల్పంగా సడలించింది. వీసాల నిషేధానికి ముందు పనిచేసిన యాజమాన్యాల దగ్గరే తిరిగి ఉద్యోగాలు లభిస్తే విదేశీ వర్కర్లని అమెరికా రావడానికి అనుమతినిచ్చినట్టు విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది. ఈ మేరకు వీసా ప్రయాణాల ఆంక్షల్ని సవరించింది.
అమెరికాలో మళ్లీ పాత ఉద్యోగాలే దొరికితే ఉద్యోగితో పాటు, జీవిత భాగస్వామి, పిల్లలు కూడా అమెరికాకి రావచ్చునని విదేశాంగ విడుదల చేసిన ట్రావెల్ అడ్వయిజరీలో స్పష్టం చేసింది. కోవిడ్–19 సంక్షోభ పరిస్థితుల్లో అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోవడంతో హెచ్–1బీ, ఎల్–1 ఇతర వీసాదారులు అమెరికాలో అడుగు పెట్టకుండా జూన్ 22న అధ్యక్షుడు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అమెరికన్ల ఉద్యోగ అవకాశాలు కాపాడడానికే ఈ ఆంక్షలు వి«ధించినట్టు అప్పట్లో ట్రంప్ వెల్లడించారు. దీనిని ప్రముఖ టెక్కీ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించినా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు జాతి ప్రయోజనాల పరిరక్షణ కోసమే ఈ సడలింపులు చేస్తున్నట్టుగా విదేశాంగ శాఖ వెల్లడించింది.
అదే ఉద్యోగమైతే వీసాల మంజూరు
అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి ట్రంప్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలతో తిరిగి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. గతంలో ఎవరైనా ఉద్యోగం కోల్పోయి, మళ్లీ ఇప్పుడు అదే సంస్థలో, అదే ఉద్యోగాన్ని పొందితే అమెరికా రావడానికి వీసాలు జారీ చేస్తామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అంతేకాకుండా కరోనా వైరస్‌పై పోరాటానికి ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న వారు, ప్రాణాంతక వైరస్‌లపై పరిశోధనలు చేస్తున్న వారిని కూడా ఆంక్షల నుంచి మినహాయించింది. ఐటీ సంస్థలతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా హెచ్–1బీ వీసాలపై పూర్తి స్థాయి ఆంక్షల్ని వ్యతిరేకించడం వల్ల ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment